
మళ్లీ దొరల పెత్తనం వస్తుంది: శైలజానాథ్
విభజన బిల్లుపై చర్చలో మంత్రి శైలజానాథ్ వ్యాఖ్యలు
ఈ బిల్లు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.. ఓటింగ్ నిర్వహించాలి
సమైక్య రాష్ట్రం ఏర్పడ్డాకే దళితులు, వెనుకబడిన వర్గాలకు స్వేచ్ఛ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ప్రజాస్వామ్య, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఉన్నందున్నే వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. ఆ ప్రాంతంలో గతంలో మాదిరిగా మళ్లీ దొరల, పెత్తందార్ల ఆధిపత్యం పెరిగి, బడుగు, బలహీన వర్గాల ప్రజల స్వేచ్ఛకు భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. బిల్లుపై ఓటింగ్ నిర్వహిస్తే విభజన జరగాలో వద్దో తేలిపోతుందన్నారు. శుక్రవారం శాసనసభలో విభజన బిల్లుపై చర్చలో భాగంగా శైలజానాథ్ మాట్లాడారు. ఆయన మాటల్లోని ముఖ్యాంశాలు...
- బిల్లు ఏకపక్షంగా ఉంది. గతంలో రాష్ట్రాల ఏర్పాటు సందర్భాల్లో పాటించిన పద్ధతులను కూడా ఇక్కడ పాటించటం లేదు.
- బిల్లుపై ఓటింగ్ జరగాలి. తెలంగాణ కావాలంటున్న వారు కూడా ఓటింగ్‌లో పాల్గొనాలి. దాంతో రాష్ట్ర విభజన జరగాలా? వద్దా? అనే విషయం తేలిపోతుంది.
- సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు.. తెలంగాణ ప్రాంతంలో పెత్తందార్లు, దొరల పాలనలో బడుగు బలహీన వర్గాల ప్రజలు మగ్గిపోయారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాతే ఇక్కడ పద్ధతులు మారిపోయాయి. ప్రజలందరు సమానంగా బతకడానికి అవకాశం ఏర్పడింది.
- మళ్లీ తెలంగాణ ఏర్పడితే పాత రోజులు వస్తాయి. భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాల ఫలితాలను కూడా దోపిడీ వర్గాలే పొందుతున్నాయన్న కంచె ఐలయ్య మాటలు నిజం.
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రిగా దళితులకే పదవి ఇస్తామంటున్న వారు భూములను పంచుతాం అని ఎందుకు చెప్పడం లేదు?
- చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవటం వల్ల ఒక నేత తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు.
- రాజ్యాంగంలోని 371డీ అధికరణ అంశాన్ని ప్రస్తావిస్తేనే విభజనవాదులు వణికిపోతున్నారు. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం కనబరుస్తున్నారు.
ఢిల్లీలో మాట్లాడాల్సిన మాటలు అసెంబ్లీలోనా?
శైలజానాథ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి స్పందిస్తూ ఒక కులంలో పుట్టడం మనిషి తప్పు కాదని, అయితే పుట్టిన తర్వాత సమాజంలో ఏలా ఉంటున్నారనే విషయాన్ని చూడాలని వ్యాఖ్యానించారు. టీడీపీ సభ్యులు రేవంత్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డి, టీఆర్‌ఎస్ సభ్యుడు కె.తారకరామారావులు స్పందిస్తూ మంత్రి మాటల్ని ఖండించారు. బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో మాట్లాడాల్సిన మంత్రి అసెంబ్లీలో మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.