‘సిటీ’ల్లో సవాల్
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకుండానే తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు ముదురు పాకాన పడుతున్నాయి. సీట్ల కోసం వారంతా ‘బస్తీ మే సవాల్’ అంటున్నారు. ప్రధానంగా జిల్లాలో రాజమండ్రి, కాకినాడ నగరాల పరిధిలోని రెండు నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలకు పొగపెట్టేందుకు వైరివర్గం ప్రయత్నిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గాల్లో అన్నీ తామే అన్నట్టు వ్యవహరిస్తున్న ఆ ఇన్‌చార్జిలకు ఎన్నికల్లో టిక్కెట్లు రాకుండా చేయడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. జిల్లా కేంద్రంగా కాకినాడ, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న పరిసర ప్రాంతాలతో కూడినది కాకినాడ సిటీ నియోజకవర్గం. ఇక రాజమండ్రి సిటీ నియోజకవర్గం రాజకీయాలలో చైతన్యవంతమైన పాత్ర పోషిస్తూ వస్తోంది. అలాంటి నియోజకవర్గాల్లో టీడీపీలో టిక్కెట్ల కుంపటి రాజుకుంది.
కాకినాడ సిటీ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు టిక్కెట్టు ఖాయమైందనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. సీటు తనదేనని ధీమాతో ఉన్న కొండబాబుకు సొంత సామాజికవర్గం నుంచే ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. మత్స్యకార సామాజికవర్గం తన వెంట ఉంటుందనే భరోసాతో ఉన్న కొండబాబుకు పోటీగా కాంగ్రెస్ అదే సామాజికవర్గం నుంచి అభ్యర్థిని బరిలోకి దింపాలనుకుంటోంది. గత ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీ చేసిన బందన హరి పేరు ప్రచారంలో ఉంది. కాంగ్రెస్ హరిని బరిలోకి దింపితే కొండబాబు టిక్కెట్టుకు జెల్లకొట్టినట్టేనంటున్నారు. గత ఎన్నికల్లో హరి కారణంగానే టీడీపీ మూడో స్థానానికి పడిపోయింది. తాజా రాజకీయ పరిణామాలను బేరీజు వేస్తున్న టీడీపీ అధిష్టానం కొండబాబును పక్కన పెట్టవచ్చనే అనుమానాన్ని పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కొండబాబుతో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, పోతుల విశ్వం వర్గీయులు పైకి చెబుతున్నా.. అంతర్గతంగా టిక్కెట్టు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. దీంతో కొండబాబు వర్గం ముత్తా, పోతుల వర్గాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
బంధువు ద్వారా బాబుపై ముత్తా ఒత్తిడి!
జిల్లాలో సీనియర్ మంత్రిగా, ఎమ్మెల్యేగా విశేషమైన అనుభవం కలిగిన ముత్తా పదేళ్లుగా రాజకీయాలకు దూరమైపోయారు. వెంట ఉండే వర్గం కూడా తలో గూటికి చెల్లాచెదురైపోయారు. ఈ పరిస్థితుల్లో ముత్తా పట్ల టీడీపీ అధినేత చంద్రబాబుకు సానుకూలత లేకపోయినాసమీప బంధువైన బడా పారిశ్రామికవేత్త ద్వారా ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం పార్టీలో జోరందుకుంది. మరోపక్క కాంగ్రెస్ నుంచి బందనను బరిలోకి దింపితే సామాజిక సమీకరణల్లో విశ్వంకు టిక్కెట్టు వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కొండబాబు వెంట ఉండే ముఖ్యనేతల్లో దాదాపు అందరూ వైఎస్సార్ సీపీ సిటీ కోఆర్డినేటర్, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వెంట నిలిచారు. ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేస్తున్న పార్టీ జిల్లా ముఖ్యనేతలు కూడా కొండబాబు అభ్యర్థిత్వంపై పునరాలోచన చేస్తున్నారని సమాచారం.
రాజమండ్రి నుంచి పోటీకి ‘సై’ అన్న ఆలీ
దాదాపు ఇవే పరిస్థితులు రాజమండ్రి సిటీలో కూడా కనిపిస్తున్నాయి. అక్కడ మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టిక్కెట్టు రాకుండా వైరి వర్గమంతా ఒకటైంది. పార్టీ రాజమండ్రి పార్లమెంటు ఇన్‌చార్జి, సినీ నటుడు మురళీమోహన్, గోరంట్లతో మొదటి నుంచి పొసగని గన్ని కృష్ణ వర్గాలు బుచ్చయ్యకు టిక్కెట్టు రాకుండా చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మురళీమోహన్‌తో మొదటి నుంచీ మంచి సంబంధాలు కలిగిన ప్రముఖ హాస్య నటుడు ఆలీని తెర మీదకు తీసుకువస్తున్నట్టు సమాచారం.
రాజమండ్రికి చెందిన ఆలీ గతం నుంచీ రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి కనబరుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజమండ్రిలో గంధోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఆలీ మనసులో మాటను బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేస్తాననే ఆసక్తిని వ్యక్తం చేసినా పార్టీ నుంచి అనేది చెప్పకుండా దాటవేశారు.ఆలీకి గతం నుంచి టీడీపీతో దోస్తీ ఉన్న క్రమంలో ఆయనను బరిలోకి దింపడం ద్వారా గోరంట్లకు చెక్ పెట్టేందుకు మురళీమోహన్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారంటున్నారు. ఈ ప్రయత్నాలకు ఊతమిచ్చేందుకు గన్ని వర్గీయులు ఉండనే ఉన్నారు. ఈ పరిణామాలతో రెండు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన టీడీపీ శ్రేణుల్లో నెలకొంది.