చంద్రన్న కానుక పంపిణీలో తేడాలు
ముత్తుకూరు : భోగి పండగ రోజుకు కూడా పల్లెల్లోని రేషన్‌షాపు డీలర్లకు, పేదలకు సక్రమంగా చంద్రన్న సంక్రాంతి కానుక చేరలేదు. దీంతో బుధవారం కానుక పంపిణీలో జరిగిన తేడాపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ముత్తుకూరు మండలం మామిడిపూడి రేషన్‌షాపులో వీఆర్వో లక్ష్మి ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ ప్రారంభించారు. అయితే మూడు సరుకులు మాత్రమే పంపిణీ చేయడంతో స్థానికులు ఆగ్రహించారు.
ఇచ్చిన సరుకులు వాపసు చేసి, పంపిణీ నిలిపివేశారు. తహశీల్దార్ చెన్నయ్యకు ఫోన్‌లో సమాచారం అందించారు. ఈ క్రమంలో వెంటనే నూనె, నెయ్యి ప్యాకెట్లు తెప్పించారు. బెల్లం మాత్రం చేరలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, సరుకుల పంపిణీ చేయించారు. బస్తాల్లో వచ్చిన సరుకుల తూకంలో తేడాకు, నాసిరకం సరుకులపై పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. సరుకుల సంచులకు డబ్బు వసూలు చేశారు. బండ్లపాళెం, తాళ్లపూడి గ్రామాల్లో ఇదే తరహా విమర్శలు వచ్చాయి.