ప్రచార ఆర్భాటమే.. కానుక కొందరికే..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాఫీ మోసాన్ని మరిపించటానికి ముఖ్యమంత్రి కొత్త పథకం వేశారు. అదే చంద్రన్న సంక్రాంతి కానుక. అందుకు రూ.315 కోట్లు ఖర్చుచేస్తున్నామని ప్రకటించారు. అయితే ఆ నిధులు తెలుగు తమ్ముళ్లకు సంక్రాంతి కానుకకోసం కేటాయించిన నిధులనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు జిల్లాలో చంద్రన్న సంక్రాంతి కానుక సరుకుల పంపిణీ తీరే నిదర్శనం. జిల్లాలో 8.24 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి.
అయితే చంద్రన్న సంక్రాంతి కానుకలు జిల్లాకు వచ్చింది కేవలం 2.50 లక్షల ప్యాకెట్లు వచ్చినట్లు సమాచారం. వాటికి 2 లక్షల సంచులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. వచ్చిన అరకొర సరుకులనే ‘సముద్రంలో ఇంగువ’ కలిపినట్లు పంపిణీ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వచ్చిన సరుకులను సైతం కొన్నిచోట్ల డీలర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. బోగోలు మండలంలో చంద్రన్న సంక్రాంతి కానుకలను బ్లాక్‌మార్కెట్ తరలించి సొమ్ముచేసుకుంటున్నారు.
అదేవిధంగా కోవూరు నియోజకవర్గ పరిధిలో సంచికి రూ.20 వసూలు చేస్తున్నారు. నెల్లూరు, సూళ్లూరుపేట, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, వెంకటగిరి నియోజక వర్గాల పరిధిలో మూడు సరుకులే పంపిణీ చేస్తున్నారు. అందులో గోధుమ పిండి, నెయ్యి, కందిపప్పు ఇవ్వటం లేదు. మరి కొన్నిచోట్ల బెల్లం, శనగలు, గోధుమపిండిని సంచుల్లో రేషన్‌షాపులకు చేర్చారు. దీంతో ఆయా డీలర్లు ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్‌చేసి అలాగే ఇచ్చి పంపేస్తున్నారు. సంచులు ఇవ్వమని అడిగితే.. ‘సంచులు లేవు.. గించులు లేవు’ అని తిట్టి పంపేస్తున్నట్లు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తూకాల్లో మోసం... మర్రిపాడు మండలంలోని రామానాయుడుపల్లిలో రేషన్‌షాపులో చంద్రన్న కానుకలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు లబ్దిదారులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తూకాల్లో మోసం చేస్తుండడంతో గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. డీలర్లు తమ చేతివాటం చూపి ప్రతి సరకు 300 గ్రాములు నొక్కేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఉదయగిరి-నెల్లూరు రహదారిపై గ్రామస్తులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
మర్రిపాడు తహశీల్దారు ఎంవీ కృష్ణారావు గ్రామంలో పర్యటించి విచారణ జరిపి తూకాల్లో మోసాలు వాస్తవమని నిర్ధారించుకున్నారు. అనంతరం రేషన్‌షాపును సీజ్ చేశారు. ఇలా జిల్లాలో అనేక ప్రాంతాల్లో 100, 150, 200, 300 గ్రాములు నొక్కేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సా... గుతున్న పంపిణీ.. పండగకు ఒకరోజు ముందే సరుకులు పంపిణీ చేయాల్సి ఉన్నా.. చంద్రన్న సంక్రాంతి కానుక ఇంకా కొనసాగుతూనే ఉంది. అనేక చోట్ల బుధవారం రాత్రి వరకు పంపిణీ జరిగింది. మరి కొన్ని చోట్ల సరుకులు పంపిణీ చేయలేదు. సరుకులు చాలకపోవటంతో పంపిణీ నిలిపివేశారు. సరుకులు వచ్చాక పంపిణీ చేస్తామని డీలర్లు చెప్పి కార్డుదారులను తిప్పి పంపేశారు. జిల్లాలో అనేకచోట్ల సంక్రాంతి పండగకు చంద్రన్న కానుక అందే పరిస్థితి కనిపించలేదు. క్షేత్రస్థాయిలో ఇలా ఉంటే... అధికారులు మాత్రం సరకులన్నీ వచ్చాయి.. పూర్తిస్థాయిలో పంపిణీ చేస్తున్నామని చెబుతుండటం గమనార్హం.