‘దేశం’లో వర్గ పోరు | Differences in the Telugu Desam Party Politics | Sakshi
Sakshi News home page

‘దేశం’లో వర్గ పోరు

Published Sat, Jan 24 2015 2:58 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

‘దేశం’లో వర్గ పోరు - Sakshi

‘దేశం’లో వర్గ పోరు

పీలేరు నియోజక వర్గంలో పోటాపోటీగా లోకేష్ జన్మదిన వేడుకలు
సుగుణమ్మ నామినేషన్‌కు సీనియర్ నేతలు డుమ్మా
పలు నియోజక వర్గాల్లో ముదిరి పాకానపడుతున్న వర్గ విభేదాలు
ఆందోళన చెందుతున్న అధిష్టానం

 
తిరుపతి: జిల్లాలో తెలుగుదేశం పార్టీ వర్గ రాజకీయాలు  రోజురోజుకు ముదిరి పాకాన పడుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో బహిరంగానే  నేతలు వర్గాలుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలను వేర్వేరుగా చేపడుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది.  ఇటీవల పీలేరు నియోజకవర్గంలో చోటుచేసుకొన్న సంఘటనలే ఇందుకు నిదర్శనం.  శక్రవారం జరిగిన నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో పార్టీలో విభేదాలు బట్టబయలయ్యాయి.. పీలేరు, కలికిరి, కలకడ మండలాల్లో లోకేష్ జన్మదిన వేడుకలను డాక్టర్ ఇక్బాల్, మల్లారపు రవికుమార్ నాయుడు పోటాపోటీగా నిర్వహించారు. ఇంతకు మునుపు నెలరోజుల క్రితం సైతం నియోజకవర్గ పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని  పీలేరులో నిర్వహించకండా మదనపల్లెలో నిర్వహించారు. 

అక్కడ సమావేశం నిర్వహిస్తే పార్టీలోని రెండువర్గాల మధ్య గొడవలు జరుగుతాయని ముందు జాగ్రత్తగా సమావేశాన్ని మదనపల్లెకు మార్చినా పార్టీలో నేతల మధ్య తన్నులాట మాత్రం ఆగలేదు. మంత్రి        బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు సమక్షంలోనే అక్కడ ముష్టియుద్ధాలు కూడా జరిగాయి. అయినప్పటికీ అధిష్టానం దిద్దుబాటు చర్యలను చేపట్టకపోవడం వల్లే మళ్లీ లోకేష్ జన్మదిన వేడుకలను సైతం నియోజకవర్గంలోని రెండు వర్గాలు పోటాపోటీగా జరిపాయని ఆ పార్టీలోని కొంతమంది నేతలు పెదవి విరుస్తున్నారు.

సుగుణమ్మ నామినేషన్‌కు సీనియర్ నేతల డుమ్మా

 తిరుపతి నియోజకవర్గ ఉప ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ సతీమణి సుగుణమ్మ శుక్రవారం నామినేషన్‌ను వేశారు. ఈ కార్యక్రమానికి  గల్లా అరుణకుమారి తదితర పార్టీ సీనియర్ నేతలు హాజరు కాకపోవడం దేశం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని ముఖ్య నేతల మధ్య సమన్వయం కొరవడిందని అందువల్లే నామినేషన్‌కు రాలేదని పార్టీ  జోరుగా చర్చ సాగుతోంది. ఎమ్మెల్సీ పదవికి ముద్దుకృష్ణమ నాయుడు, గల్లా అరుణకుమారి పోటీపడుతూ ఇప్పటికే  వర్గాలు విడిపోయినట్లు పార్టీలో నేతలే చెవులు కొరుక్కుంటున్నారు.. మొత్తం మీద జిల్లాలో తెలుగు దేశం నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తుండడంతో వర్గ విభేదాలు పెరిగిపోతున్నాయి. పార్టీ అధినేత రంగంలోకి దిగి పార్టీకి కాయకల్ప చికిత్స చేయకపోతే పార్టీ పరుపు మంట కలవడం ఖాయమని నాయకులు ఆందోళన చెందుతున్నాయి.              
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement