పార్టీ జిల్లా అధ్యక్షుడిని బాయ్‌కాట్ చేస్తున్న గంటా వర్గం
పతాక స్థాయికి టీడీపీ వర్గ విభేదాలు
పిలుపు లేదంటున్న గవిరెడ్డి
‘గంటా’ పర్యటనకు దూరం
విశాఖపట్నం: ‘పిలవని పేరంటం’ అవమానం జిల్లా పార్టీ అధ్యక్షుడికే ఎదురైతే!?.. జిల్లా పార్టీ అధ్యక్షుడి ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోతే!?... అదీ ఆయన సొంత నియోజకవర్గంలోనే ఇంతటి చేదు అనుభవం ఎదురైతే ఎలా ఉంటుంది... అచ్చు జిల్లా టీడీపీలో పతాక స్థాయికి చేరిన వర్గ విభేదాల మాదిరిగా ఉంటుంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడుకు పొగపెడుతున్న మంత్రి గంటా వర్గం కథను వ్యూహాత్మకంగా క్లైమాక్స్‌కు తీసుకువస్తోంది. ఓ వైపు అధిష్టానం వద్ద గవిరెడ్డికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న గంటా వర్గం... మరోవైపు మాడుగుల నియోజక వర్గంలోనే ఆయన చాపకిందకు నీళ్లు తెస్తోంది. ఏకంగా గవిరెడ్డినే బాయ్‌కాట్ చేస్తూ ఆయన నియోజకవర్గంలో శుక్రవారం మంత్రి గంటా పలు కార్యక్రమాల్లో పాల్గొనడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
మాడుగుల నియోజకవర్గం సాగరం పంచాయతీ సురవరం గ్రామంలో రూ.కోటి 25 లక్షలతో నిర్మించిన కస్తూరిబా ఆశ్రమ పాఠశాల భవన సముదాయానికి రాష్ర్ట మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లాలం భవానీతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షతో పాటు నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఇంతపెద్దఎత్తున కార్యక్రమాలను ఏర్పాటు చేసి మాడుగుల నియోజవ ర్గ టీడీపీ ఇన్‌చార్జి గవిరెడ్డిని పూర్తిగా విస్మరించారు. ఆయనేమి గత ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి. మాజీ ఎమ్మెల్యే, గ్రామీణజిల్లా పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంతటికీలకమైన నాయకుడిని విస్మరించడం స్థానికంగా ఆయన కేడర్‌కు సైతం మింగుడుపడడం లేదు. కనీసం జిల్లా పార్టీ అధ్యక్షునిగా కాదు... కనీసం నియోజకవర్గ ఇన్‌చార్జిగా కూడా గవిరెడ్డికి ఆహ్వానం అందలేదు. మంత్రి, ఎంపీలిద్దరూ గవిరెడ్డిని పట్టించుకోలేదు. దీంతో తీవ్ర అసంతృప్తి చెందిన గవిరెడ్డి అనుచరులు, వివిధ పార్టీల మండలాధ్యక్షులు సైతం మంత్రి పర్యటనకు దూరంగా ఉండిపోయారు. ఒక జెడ్పీటీసీతో పాటు నాలుగు మండలాల ఎంపీలు టీడీపీకి చెందిన వారే అయినప్పటికీ ఈ పర్యటనలోఅటిండెన్స్ వేయించుకోవడానికే పరిమితమయ్యారు. క్యాడర్ జాడపెద్దగా కన్పించలేదు.
పరిస్థితిలా ఉంటుందని ముందుగానే గమనించిన గంటా వర్గీయుడైన విశాఖ డైయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు ఆఫీస్ నుంచి రాత్రికి రాత్రే గ్రామాల రైతులకు ఫోన్‌లు వెళ్లాయి. గంటా పర్యటనలో పాల్గొనాల్సిందిగా ఆ ఫోన్‌ల సమాచారం. దీంతో ఈ పర్యటనలో రైతులతో పాటు పార్టీనుంచి సస్పెండైన నేతల హల్‌చల్ ఎక్కువగా కన్పించింది. సొంత నియోజకవర్గంలో మంత్రి పర్యటిస్తుంటే పార్టీ జిల్లా అధ్యక్షుడు హాజరు కాకపోవడం పట్ల పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదే తొలిసారికాదు. గతంలో కూడా ఇదేరీతిలో తనకు చెప్పకుండా నియోజకవర్గంలో గంటా పర్యటించడాన్ని గవిరెడ్డి తీవ్రంగా గర్హించడంతో గవిరెడ్డి వ్యతిరేకవర్గీయులు ఆయన దిష్టిబొమ్మల దహనం చేసిన విషయం విధితమే. ఇప్పుడు మరోసారి గవిరెడ్డికి ఆహ్వానం లేకుండా గంటా మాడుగలలో పర్యటించడం పార్టీలో చర్చనీయాంశమైంది.
గంటా విజ్ఞతకే వదిలేస్తున్నా
పార్టీ జిల్లా అధ్యక్షునిగా తాను ఎప్పుడు, ఏ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా ముందుగా ఆ నియోజకవర్గ ఇన్‌చార్జికి చెప్పి వారి అనుమతితోనే నిర్వహించేవాడిని. ఎక్కడైనా ఇదే సంప్రదాయం కొనసాగుతుంది. నా నియోజక వర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు.. సమీక్షలు.. సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు మంత్రి స్వయంగా నాకు చెప్పాలి. లేదా సమాచారం అందించాలి. కానీ అలా చేయలేదు. నేను ఓడిపోయి ఉండవచ్చు.. కానీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా, మాజీ ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ అధ్యక్షునిగా కనీస గౌరవం ఇవ్వాలి. నాకు చెప్పకుండా నా నియోజకవర్గంలో పర్యటిస్తుండడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.
-‘సాక్షి’తో ఫోన్‌లో గవిరెడ్డి రామానాయుడు,
జిల్లా టీడీపీ అధ్యక్షుడు
అధ్యక్షుడికే పిలుపు లేదు!
Published Sat, Feb 21 2015 12:20 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement