నువ్వా.. నేనా
పీలేరులో టీడీపీ వర్గాల మధ్య తీవ్ర విభేదాలు
ఇప్పటికే రోడ్డెక్కిన ఇరు వర్గాలు
జీవీ చేరిక వార్తతో పార్టీ శ్రేణుల్లో అలజడి
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇక్భాల్ వర్గం
వర్గ రాజకీయాలతో ముఖ్యమంత్రికి తలనొప్పి
తిరువతి: జిల్లాలోని టీడీపీలో వర్గ విభేధాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి పరిణామాలు తలెత్తడం పార్టీకి ఇబ్బంది కరంగా మారుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం పార్టీలోని నాయకులపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పీలేరు నియోజకవర్గంలో ఇప్పటికే డాక్టర్ ఇక్భాల్ అహమ్మద్, మల్లారపు రవిప్రకాశ్‌నాయుడు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. పార్టీ కార్యకర్తల సమావేశం సైతం మదనపల్లెలో నిర్వహించాల్సిన దుస్థితి. అక్కడ జరి గిన సమావేశంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పార్టీనేత ముద్దు కృష్ణమనాయుడు సమక్షంలోనే ఇరువర్గాలు బా హాబాహీకి దిగాయి. ఇక్బాల్‌పై రవిప్రకాశ్ వర్గీయులు చేయి చేసుకున్నారు. దీంతో ఇక్భాల్ వర్గం దాడి చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని అధిష్టానం వద్ద పట్టుపట్టింది. రవిప్రకాశ్ వర్గీయులు హైదరాబాద్ స్థాయిలో చక్రం తిప్పడంతో అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది. దీంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. పీలేరు మార్కెట్ కమిటీ నియామకం విషయంలో సైతం రెండు సామాజికవర్గాల మధ్య అంత ర్యుద్ధం కొనసాగుతూనే ఉంది.
ఆయనొస్తే మూడు ముక్కలాట..
ఇప్పటికే వర్గ పోరులో నలిగిపోతున్న కార్యకర్తలకు మరో ఉపద్రవం మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథరెడ్డి రూపంలో ముంచుకొచ్చింది. ఆయన టీడీపీలో చేరుతున్నారనే వార్త పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. ఈయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇక్బాల్ వర్గం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర ఆరోపణలు చేసింది. రెండు వర్గాలతోనే అల్లాడుతున్న పీలేరు నియోజక వర్గంలోని దేశం కార్యకర్తలకు శ్రీనాథరెడ్డి చేరిక వార్త తీవ్ర అలజడి రేపుతోంది. ఈయన పార్టీలో చేరితే మూడు ముక్కలాటలో నలిగి పోవాల్సిందేనని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో పెరుగుతున్న గ్రూపు తగాదాలు..
ఎమ్మెల్సీ సీటు విషయంలో గల్లా అరుణకుమారి, ముద్దు కృష్ణమనాయుడు మధ్య పోరు నడుస్తోంది. ఈ విషయంతో జిల్లాలోని పార్టీ నేతలు వర్గాలుగా విడిపోయారు. మదనపల్లె నియోజకవర్గంలో దేశం నాయకుల పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారింది. పలమనేరు నియోజకవర్గంలో దేశం నేతలు లక్కనపల్లె శ్రీనివాసులరెడ్డి, సుభాష్‌చంద్రబోస్ వర్గాల మధ్య గొడవలు ఇప్పటికే పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లాయి. తిరువతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇరువర్గాల మధ్య విబేధాలు ఎన్నికల సమయంలో తేటతెల్లమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, లోకేష్ రంగంలోకి దిగి పార్టీ కార్యకర్తలకు నచ్చజెప్పాల్సి వచ్చింది. పార్టీలో గ్రూపు తగాదాలు పెరిగి పోతున్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ పరిస్థితి ఉంటే దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా చూపుతుందేమోనని అధిష్టానం అందోళన చెందుతోంది.