పత్తిని తెల్లబంగారంగా పిలుచుకుంటారు. అనావృష్టి, విద్యుత్ కోతల కారణంగా పంట దెబ్బతింటుండటంతో పత్తి రైతులు తెల్లబోతున్నారు. పెట్టుబడులు కూడా రావేమోనని దిగులు చెందుతున్నారు. వ్యవసాయాధికారులు తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
కడప అగ్రికల్చర్ : అనావృష్టితో పత్తిరైతుకు కష్టాలు వచ్చిపడ్డాయి. వర్షాభావం పత్తి రైతు ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో వేలాది ఎకరాల్లోని పత్తి పంట దెబ్బతింది. జూన్ నెలలో అరకొరగా కురిసిన వర్షాలకు, బోరుబావుల కింద జిల్లా వ్యాప్తంగా తెల్లబంగారాన్ని 5640 హెక్టార్లలో సాగు చేశారు. పంట ప్రారంభంలో ఏపుగా పెరగడంతో మళ్లీ వ ర్షాలు కురిస్తే మంచి దిగుబడులు వస్తాయని ఎంతో ఆశ పెట్టుకున్నారు. వర్షాలు కురవక ఒక పక్క, తీవ్ర విద్యుత్ కోతలతో మరోపక్క పంటకు నీరు అందక, తెగుళ్లతో ఆకులన్నీ ఎర్రగమారి రాలిపోతున్నాయి. పత్తి దిగుబడి రావాల్సిన సమయంలో మొక్కలు ఎండిపోతుండటంతో రైతు తట్టుకోలేక పోతున్నాడు.
అక్కడక్కడ పగిలిన కాయలు కూడా తెల్లని పత్తిని ఇవ్వడంలేదని రైతులు మదనపడిపోతున్నారు. ఈ ఏడాది మంచి పంట వస్తుందని రైతులు నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఎంత లేదన్నా ఎకరానికి అన్ని ఖర్చులు పోను రూ. 40 నుంచి 50 వేలు వస్తుందని ఆశించిన రైతుకు పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. రాబోయే నెలల్లో వర్షాలు కురిసి పంట దిగుబడులు భారీగా ఉంటాయని రైతులు, వ్యవసాయాధికారులు అంచనాలు వేశారు. అయితే వర్షాభావం తలెత్తడంతోను, బోరుబావుల్లో ఉన్న అరకొర నీరు విద్యుత్ కోతలతో అందకపోవడంతోను, తెగుళ్లు, వాతావరణంలో మార్పులతో రైతన్న విలవిలలాడుతున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్లు కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదని రైతులు తెలిపారు. ఇప్పటి వరకు ఎకరం సాగుకు రూ. 25వేల నుంచి 30 వేలు ఖర్చు చేసినట్లు తెలిపారు. పెట్టుబడి ఖర్చులు కూడా రావేమోనని బెంగపెట్టుకున్నారు.
పంట దెబ్బతిని తగ్గిన దిగుబడులు.....
జిల్లాలో పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె, వేంపల్లె, వేముల, తొండూరు. సింహాద్రిపురం, వీరపునాయునిపల్లె, రాజుపాళెం, చాపాడు, ఖాజీపేట,దువ్వూరు, ఎర్రగుంట్ల, వల్లూరు, కమలాపురం, బి. మఠం, పోరుమావిళ్ల, కాశినాయన, బి. కోడూరు మండలాల్లో అత్యధికంగాను, ఇతర మండలాల్లో ఓ మోస్తరుగాను మొత్తం కలిపి జిల్లాలో 14100 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. ఈ పంటలో ఎకరం నుంచి ప్రస్తుతం వచ్చే 3 క్వింటాళ్ల దిగుబడి వంతున తీసుకుంటే 42,300 క్వింటాళ్లు, బాగా పండితే 20 క్వింటాళ్ల వంతున 2,82,000 క్వింటాళ్లు వస్తుందని రైతులు తెలుపుతున్నారు. ఈ 2,82,000 క్వింటాళ్ల మొత్తం దిగుబడిని రైతులు కోల్పోవడడంతో బ్యాంకుల నుంచి, ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి తెచ్చిన అప్పులెలా తీర్చాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.
దెబ్బతింటున్న పంటకు సూచనలు అందక అవస్థలు..
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో పత్తి పంటసాగులో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నా వ్యవ సాయాధికారులు, శాస్త్రవేత్తల నుంచి ఎలాంటి సలహాలు, సూచనలు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి చర్యలు చేపడితే పంటను కాపాడుకోవచ్చో చెప్పే వారే కరవయ్యారనే బాధను వ్యక్తం చేస్తున్నారు. చేతికందాల్సిన పంట కళ్ల ఎదుటే నాశనమవుతోందని రైతన్నలు వాపోతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి...
మంచి దిగుబడులు వస్తాయని ఆశించి పత్తి పంట సాగు చేస్తే మాయదారి వర్షాభావంతో పంటపోయింది. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవు. రాత్రనక, పగలక కష్టపడుతున్నా ప్రకృతి నష్టపరుస్తూనే ఉంది. పంట బాగా వస్తుందని ఆశించాం. వర్షాలులేక అరకొరగా ఉన్న బోరుబావుల్లోని నీరు కరెంటు కోతలతో పంట మొత్తం పోయింది.
-సాంబశివారెడ్డి,
కొత్త సంగటిపల్లె, పెండ్లిమర్రి మండలం
పంటలను సూచేవారే కరువయ్యారు..
పత్తి పంటకు దెబ్బతింటున్న విషయం వ్యవసాయాధికారులకు తెలిపినా ఏమాత్రం పట్టించుకోలేదు. పంట వైపు వచ్చిన దాఖలాలు లేవు. ఎందుకిలా మొక్కలు చచ్చిపోతున్నాయో చెబుతామన్నా వినే అధికారులు కరువయ్యారు. ఏ మందు కొట్టాలో, ఏమి పిచికారి చేయాలో అర్థం కావడం లేదు. పొలంలోని మొక్కలన్నీ చచ్చిపోతున్నాయి. ఒక్కో చెట్టుకు రెండు, మూడు పత్తి ఇడుపులు ఉంటున్నాయి. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు కనబడటం లేదు.
- రామసుబ్బమ్మ,
రైతు గోర్లపల్లె, చింతకొమ్మదిన్నె మండలం
తెల్లబోయారు
Published Mon, Jul 21 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM
Advertisement
Advertisement