కడప అగ్రికల్చర్ : జిల్లాలో ఖరీఫ్ సీజన్ పరిస్థితి అంతు చిక్కని ప్రశ్నలా మారింది. వాతావరణం ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగైన పంటలు చేతికొస్తాయా.. సేద్యం చేసి సిద్ధం చేసుకున్న భూములన్నీ సాగయ్యేనా.. అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
అంతుచిక్కని వాతావరణ పరిస్థితుల నడుమ అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని మండలాల్లో నెలలో కురవాల్సిన వర్షం కంటే మించి కురవగా మిగిలిన మండలాల్లో ఓ మోస్తరు వర్షం కూడా కురవక పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మూడు సంవత్సరాలుగా కరవు రక్కసి కోరల్లో చిక్కిన జిల్లా రైతాంగం అల్లాడింది. మరోసారి ఈ రక్కసి కోరల్లో చిక్కుకునే పరిస్థితులు నెలకొంటున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఈ ఖరీఫ్‌లో జిల్లాలో వర్షాధారం కింద 1,60,635 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగు కావాల్సి ఉండగా సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తున్నా, ఇప్పటికీ 11,669 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. జూన్ నెలలో 67.1 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 72.1 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. సంబేపల్లె, టి సుండుపల్లి, వీరబల్లి, రాయచోటి, ముద్దనూరు, పులి వెందుల మండలాల్లో మాత్రమే పదును దాటి వర్షం కురిసింది.
మిగిలిన మండలాల్లో అంతంత మాత్రమే. జూలై నెలలో 96.7 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 17.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ముద్దనూరు, పుల్లంపేట, పులి వెందుల, సింహాద్రిపురం మండలాల్లో అత్యధికంగా కురిసింది. మిగిలిన మండలాల్లో తుంపర జల్లులు పడ్డాయి. సాగైన పంటలను ఎండ వేడిమి ఉక్కిరి బిక్కిరి చేస్తుండడంతో రైతులు తీవ్రంగా మదనపనడుతున్నారు. ఒక మండలంలో ఒక విధంగా, మరో మండలంలో అసలే కురవకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
పుష్యమి కార్తెలన్నీ దాటిపోతున్నా ఇప్పటికీ బలమైన ఒక్క వర్షం కూడా కురవలేదు. ఎక్కడ చూసిన అరకొర వర్షాలు తప్ప సంపూర్తి పదునుపాటి జాడేలదు. అరకొర వర్షానికి జిల్లాలో వేరుశనగ 5533 హెక్టార్లలో, పత్తి 3219 హెక్టార్లు, కంది 109 హెక్టార్లు, సజ్జ 610 హెక్టార్లు, ఉల్లి 319 హెక్లార్లు, పసుపు 405 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 98 హెక్టార్లు, ఆముదం 37 హెక్టార్లు, మినుము 90 హెక్టార్లు, మొక్క జొన్న 40 హెక్టార్లలో సాగైంది. ప్రస్తుతం పంటలన్నీ వర్షాభావంతో వాడుముఖం పట్టాయి. వేలాది రూపాయలు ఖర్చు చేశామని, పంటను ఎలా బతికించుకోవాలో అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు. మరో పది రోజులు గడిస్తే సీజన్ ముగుస్తుందని, ప్రధాన పంట వేరుశనగను సాగు చేయడానికి వీలుండదని రైతులు చెబుతున్నారు.
ఇక చిరుధాన్యాల సాగే శరణ్యమని అంటున్నారు. వర్షాభావంతో బోరుబావులు అడుగంటి పోతున్నాయని, పండ్ల తోటలను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడంలేదని ఆయా తోటల రైతులు ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు వేసవి కాలంలో ఎలాగోలా నెట్టుకొచ్చామని, ఈ వర్షాకాలంలోనైనా ఆశించిన వర్షాలు కురుస్తాయనుకుంటే తీవ్ర నిరాశ ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖరీఫ్ కల్లోలం!
Published Sun, Jul 19 2015 3:05 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM
Advertisement