కొరగాని కేంద్రాలు | Koragani centers | Sakshi
Sakshi News home page

కొరగాని కేంద్రాలు

Published Sun, Jan 10 2016 11:31 PM | Last Updated on Sun, Sep 3 2017 3:26 PM

కొరగాని కేంద్రాలు

కొరగాని కేంద్రాలు

అత్యధికంగా చోడవరంలో 2039 ఎంటీలు
అత్యల్పంగా నాతవరంలో 24 ఎంటీలు
రైతులకు చెల్లించింది రూ.9.73కోట్లు
 

ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అన్నదాతలు దళారుల పాల్జే యాల్సి వస్తోంది. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపో
 వడం.. ప్రతిబంధకంగా మారిన నిబంధనలు అన్నదాతల పాలిట శాపంగా పరిణమించాయి. దీంతో జిల్లాలో ఆలస్యం గాతెరుచుకున్న కొనుగోలు కేంద్రాలు మొక్కుబడి కేంద్రాలుగా మారాయి.
 
విశాఖపట్నం: జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో లక్షా రెండు వేల హెక్టార్లలో వరిసాగైంది. డిసెంబర్ నెలాఖరుకు కోతలు పూర్తయ్యాయి. వాతావరణం అనుకూలించడంతో ఎకరాకు 25 నుంచి 30 బస్తాల చొప్పున 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినట్టు అధికారు అంచనా. దిగుబడిలో 15 శాతమైనా లెవీ కింద సేకరించాలన్న లక్ష్యంతో 47 వేల ఎంటీల ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం డ్వాక్రా సంఘాలు-7, పీఎసీఎస్‌లు-16  కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ మొదటి వారంలోనే ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికి చివరి వారంలో కానీ తెరుచుకోలేదు. పైగా చాలా కేంద్రాల్లో తేమకొలిచే యంత్రాలు, గోనెసంచుల వంటివి లేని పరిస్థితి. డ్వాక్రా మహిళలు, పీఏసీఎస్ సిబ్బందికి సరైన శిక్షణ ఇచ్చినట్టుగా కనిపించలేదు. దీంతో కేంద్రాలకొచ్చే రైతులకు సరైన అవగాహన కల్పించడంలో వీరు విఫలమవుతున్నారు. దీనికి తోడు గతంలో ఎన్నడూ లేని విధంగా విధించిన నిబంధనలు కొనుగోలుకు అడ్డంకిగా మారుతున్నాయి.

జిల్లాలో 47వేల ఎంటీల ధాన్యం లెవీగా సేకరించాలని లక్ష్యం కాగా.. కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు కావస్తున్నా ఇప్పటివరకు   6,985 ఎంటీల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయగలిగారు. వీటిలో గ్రేడ్-ఏ రకం 12టన్నులు, కామన్ వెరైటీ 6973.200 ఎంటీలు ఉన్నాయి. అత్యధికంగా చోడవరం కేంద్రంలో 2039 ఎంటీల ధాన్యం కొనగా, అత్యల్పంగా నాతవరం కేంద్రం లో 24 ఎంటీల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటివరకు రైతులకు రూ.9.73కోట్ల మేర చెల్లింపులు జరపగా, మరో రూ.55లక్షల వరకు చెల్లించాల్సి ఉంది.
 కొనుగోలు నిల్ ; కొనుగోలు కేంద్రాల ద్వారా వరుసగా ఒమ్మిలిలో 244, పద్మనాభంలో 18.74, యలమంచిలిలో 212, నర్సీపట్నంలో 260, పీఏసీఎస్‌ల ద్వారా ఆనందపురంలో 960, లక్ష్మీపురంలో 785, ఎస్.రాయవరంలో 80, దిమిలిలో 217, వడ్డాదిలో 179, బి.సూర వరంలో 80ఎంటీల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.  కేడీపేట, బీకే గూడెం, కోటవురట్ల, శ్రీరాంపురం, కొరుప్రోలు, మునగపాక, వేములపూడి, కొత్తకోట, పొట్టిదొరపల్లి కేంద్రాల్లో ఎక్కడా ఒక్క గింజ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదు. తేమ శాతం 17 శాతం, చెత్త ఒక శాతం, రంగుమారిన ధాన్యం ఐదు శాతం, కేళీ రకం ఆరుశాతం మించకూడదని, రవాణా, కలాసీల చార్జీలు రైతులే భరించాలి.. వంటి సవాలక్ష నిబంధనలు కొనుగోలుకు ఆటంకంగా మారాయి. సాధారణ రకానికి క్వింటాల్‌కు రూ.1410, 75 కేజీల బస్తాకు రూ.1057.50, గ్రేడ్-ఎ రకానికి క్వింటాల్‌కు 1450, 75 కేజీల బస్తాకు రూ.1087. 50 చొప్పున చెల్లించాల్సి ఉంది.

సర్కార్ నిబంధనల పుణ్యమాని రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. 75 కేజీల బస్తా రూ. వెయ్యి నుంచి రూ.1100 మధ్య దళారులు కొంటున్నారు. వారు నేరుగా కళ్లాల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తుండడంతో వారిచ్చిన ధరకే రైతులు తెగనమ్ముకోవల్సిన దుస్థితి.   దళారీలు చెక్క కాటాలపై తూకాల్లో ఐదు నుంచి పదికేజీల వరకు మొగ్గు తూస్తూ తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండడంతో అన్నదాతలు మోసపోతున్నారు. పట్టించుకోవల్సిన సివిల్ సప్లయిస్ అధికారులు పత్తాలేకుండా పోతున్నారు.‘పంట’ పండినా అమ్మగా వచ్చే ఆదాయం పెట్టుబడికి కూడా సరిపోయే పరిస్థితి లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement