ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): విధి నిర్వహణలో ఉన్న కోర్టు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం, తోయటం, మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, న్యాయమూర్తులను పరుషపదజాలంతో దూషించిన కేసులో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ను అరెస్టు చేస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి పోలీస్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎంపీ హర్షకుమార్ ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో 93 మంది ఉన్నారని ప్రజలను, వ్యవస్థను తప్పుదోవ పట్టించారన్నారు. ఆయన వద్ద ఉన్న సమాచారాన్ని ఇవ్వాలని నోటీసులు ఇచ్చినా ఎటువంటి స్పందన లేదన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్ వద్ద 93 మంది ఉన్నట్టు సమాచారాన్ని అధికారులకు అందిస్తే తద్వారా ప్రభుత్వాధికారులు ఆవిధంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందన్నారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్
కాని అటువంటివేమీ లేకుండా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవపట్టించి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించారన్నారు. గతనెల 28న రాజమహేంద్రవరం కోర్టుకు చెందిన స్థలంలో ఆక్రమణలు తొలగిస్తుండగా మాజీ ఎంపీ హర్షకుమార్ మధ్యాహ్నం 12 గంటలు, 3.30 గంటల సమయంలో వచ్చి జిల్లా న్యాయమూర్తిని పరుషపదజాలంతో మాట్లాడడం, అక్కడ ఉన్న కోర్టు ఉద్యోగులను బెదిరించడంతో పాటు, తోయడం, మహిళా ఉద్యోగినులతో అసభ్యకరంగా ప్రవర్తించారని జిల్లా కోర్టు పరిపాలనాధికారి త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. హర్షకుమార్‌ను అరెస్టు చేసేందుకు వెళితే పరారయ్యారన్నారు. హర్షకుమార్‌ను అరెస్టు చేసేందుకు నాలుగు టీమ్‌లను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. హర్షకుమార్‌తో పాటు ఆయనకు సహకరించిన వారిని అరెస్టు చేస్తామన్నారు. ఈ విధంగా ధిక్కారధోరణిలో మాట్లాడి ప్రజలను తప్పుదోవపట్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఐజీ ఏఎస్ ఖాన్ స్పష్టం చేశారు.
త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్
మాజీ ఎంíపీ జీవీ హర్షకుమార్‌ను అరెస్టు చేయడంలో అలసత్వం ప్రదర్శించిన త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం.శేఖర్‌బాబును సస్పెండ్ చేసినట్టు ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ తెలిపారు. గత నెల 28న జిల్లా కోర్టు పరిపాలనాధికారి మాజీ ఎంపీ హర్షకుమార్‌పై ఇచ్చిన ఫిర్యాదును కేసు నమోదు చేసిన త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం.శేఖర్‌బాబుకు, సిబ్బందికి ఆయనను అరెస్టు చేయాలని అర్బన్ జిల్లా ఎస్పీ షీమోషీబాజ్‌పాయ్ ఆదేశాలు జారీ చేశారు. త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ శేఖర్‌బాబు గతనెల 29వతేదీ మధ్యాహ్నం వరకు ఇంటిలో ఉన్న హర్షకుమార్‌ను అరెస్టు చేయకుండా తాత్సారం చేశారన్నారు. ఇన్‌స్పెక్టర్, సిబ్బంది ముందు నుంచే మాజీ ఎంపీ పరారయ్యారన్నారు. అందువల్ల విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు శేఖర్‌బాబును విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు డీఐజీ ఏఎస్ ఖాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment