- వైఎస్సార్ సీపీ శాసనసభ డెప్యూటీ ఫ్లోర్‌లీడర్ ఉప్పులేటి కల్పన
సాక్షి, విజయవాడ : రాష్ట్ర బడ్జెట్‌లో అంకెల గారడీ తప్ప మరేమీ లేదని, ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయటానికే అంకెల గారడీతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ డెప్యూటీ ఫ్లోర్‌లీడర్ ఉప్పులేటి కల్పన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం నీతిమాలిన చర్య అని మండిపడ్డారు.
ప్రణాళిక వ్యయం కంటే ప్రణాళికేతర వ్యయం అధికంగా చూపడంతో తమపై పన్నుల భారం తప్పదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. గురువారం విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణాజిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కల్పన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్‌లో అంకెల గారడీ తప్ప ఏమాత్రం కొత్తదనం లేదని చెప్పారు.
ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హమీలను నిలుపుకోలేదని మండిపడ్డారు. రైతు రుణాలు రూ.87,612 కోట్లు రద్దు కావాల్సి ఉండగా, కేవలం 5వేల కోట్లు మాత్రమే కేటాయించటం దారుణమని విమర్శించారు. అలాగే.. బడ్జెట్‌లో డ్వాక్రా మహిళల ఊసే లేదని, చేనేత రంగానికి, పవర్ హ్యాండ్‌లూమ్స్‌కు, మహిళా సాధికారత ఇలా ఏ ఒక్క రంగానికి నిధులు కేటాయించకపోవటం దారుణమని విమర్శించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ విషయంలో సృష్టతలేదని చెప్పారు.
రాజధానికి నిధులేవి?
సింగపూర్ తరహాలో నూతన రాజధాని నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్‌లో రాజధానికి నిధుల కేటాయింపుపై మాట్లాడకపోవటం శోచనీయమన్నారు. రూ.12వేల కోట్లు లోటు బడ్జెట్ ఉంటే అభివృద్ధి పనులు ఎలా చేయగలుగుతారని ప్రశ్నించారు. లోటును పూడ్చుకోవటానికి మళ్లీ తమ నెత్తిన పన్నుల భారం మోపుతారేమనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు.
రాష్ట్రానికి ఆర్‌బీఐ, ప్రపంచ బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు అయ్యే పరిస్థితి లేదని, ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనల ప్రకారం మన రాష్ట్రానికి ఉన్న రుణ పరిమితి దాటిపోయామని అందుకే కొత్తగా అప్పు రాదని తెలిపారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌కు 44 శాఖల నుంచి నిధులు కేటాయిస్తామని చెప్పారే కానీ ఏ శాఖకు ఎంత కేటాయిస్తున్నారు... ఏపథకం, ఎంత ఇస్తున్నారు అనే వివరం లేనే లేదని చెప్పారు.
వికలాంగులకు రూ.1,500 ఫించన్ అని ఎన్నికల్లో హమీలు ఇచ్చి ఇప్పుడు షరతులతో కూడిన పింఛన్ అని మాట మార్చటం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ అసులు రంగు బయట పడిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబునాయుడు సర్కారేనని విమర్శించారు. సమావేశంలో పార్టీ నేతలు కొలుసు పార్థసారథి, పూనూరు గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హామీల నుంచి తప్పించుకుంటున్నారు : సారథి
ఇచ్చిన హామీల నుంచి సీఎం బాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా దక్షిణ అధ్యక్షుడు కొలుసు పార్థసారథి మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ ద్వారా ఈ విషయం స్పష్టమైందని ఆయన తెలిపారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ హమీలతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని, ఆ రెండు హామీలను నేటికి నెరువేర్చకుండా తప్పించుకు తిరగడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. కేవలం వైఎస్సార్ సీపీ అధినేత వైస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తూ ఇచ్చిన హామీల నుంచి తప్పించుకు తిరుగుతున్నారన్నారు.
ప్రభుత్వ చర్యల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని వడ్డీపై రాయితీని కోల్పోతున్నారని, మహిళలు కూడ వడ్డీ లేని రుణాలు కోల్పోతున్నారని చెప్పారు. 15 రోజుల్లో కోటయ్య కమిటీ నివేదిక వస్తుందని, దాని ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పటికి 45 రోజులు దాటినా దానిపై చర్యలు చేపట్టలేదన్నారు. రుణమాఫీపై ప్రధాని మోడీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఎందుకు పొందలేకపోయిందని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం కోసం రూ.600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.241 కోట్లకే పరిమితం చేశారని మండిపడ్డారు. మైనార్టీలు టీడీపీకి ఓటు వేయలేదనే కారణంగా కోత విధంచారా? అని ప్రశ్నించారు.
చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ: గౌతమ్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం చేసేది తక్కువ చెప్పేది ఎక్కువగా ఉందని గౌతంరెడ్డి మండిపడ్డారు. ప్రణాళికా వ్యయం రూ.26వేల కోట్లు చూపి ప్రణాళికేతర వ్యయం రూ.86 వేల కోట్లు చూపటం ద్వారానే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించారే గానీ మిగిలిన సౌకర్యాల గురించి పట్టించుకోలేదని, బందరు పోర్టుకు రూ.కోటికేటాయించడం, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, శిల్పారామం అని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు