గుంటూరు ఎడ్యుకేషన్: ‘పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, ఉపాధ్యాయుల పనితీరు అంచనా వేసేందుకు నేరుగా విద్యార్థులతో మాట్లాడతాను. ప్రాథమిక పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను కలుపుకుని విద్యారంగంలో జిల్లాను ప్రగతి పథంలో నడిపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా. టెన్త్ పరీక్షా ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని సమష్టిగా ముందుకెళతాం’ అని జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన కె.వి.శ్రీనివాసులు రెడ్డి చెప్పారు.
తూర్పు గోదావరి జిల్లా నుంచి బదిలీపై వచ్చిన శ్రీనివాసులు రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాను పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్ధానంలో నిలిపామని వివరించారు. ఇందుకు ఉపాధ్యాయులతోపాటు క్షేత్ర స్థాయిలో అధికారుల కృషి, తల్లిదండ్రులు అందించిన సహకారం తోడయ్యాయని చెప్పారు. అదనపు తరగతుల నిర్వహణ, మినిమమ్ స్టడీ మెటీరియల్ ద్వారా విద్యార్థుల్లో ప్రేరణ కల్పించామని చెప్పారు. ఇదే విధానాన్ని ఈ జిల్లాలోను అమలు చేస్తామన్నారు. జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న మండలాల్లోని పాఠశాలలపై దృష్టి సారించి తరగతుల నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు.
వ్యక్తిగత విశేషాలు..
శ్రీనివాసులు రెడ్డి స్వస్థలం ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆయన 2003 డీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్‌గా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు.2008 డిసెంబర్‌లో మచిలీపట్నం ఉప విద్యాశాఖాధికారిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం పదోన్నతిపై 2012 ఏప్రిల్ 9న తూర్పు గోదావరి డీఈవోగా వెళ్లారు. 2013 పదో తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్ర స్థాయిలో 2వ స్ధానం, 2014 ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేశారు.
విద్యార్థులతో నేరుగా మాట్లాడతా..
Published Fri, Nov 21 2014 1:48 AM | Last Updated on Fri, Sep 28 2018 4:43 PM
Advertisement