విచ్చలవిడి ఇంధన వినియోగంతో వేడెక్కిపోతున్న భూమి
ఎలక్ట్రానిక్, పాలిధిన్ బ్యాగులతో ప్రకృతికి విఘాతం
ఫిషరీస్ టెక్నాలజీ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్
గుంటూరు ఎడ్యుకేషన్ : మానవ తప్పిదాలతోనే ప్రళయాలు, భూకంపాలు సంభవిస్తున్నాయని న్యూఢిల్లీలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ యు.శ్రీధర్ పేర్కొన్నారు. ప్రకృతి వనరులను విచ్చలవిడిగా వినియోగిస్తున్న కారణంగా రోజురోజుకూ భూమి వేడెక్కిపోయి ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్‌ఐసీ కాలనీలోని విజ్ఞాన్ హైస్కూల్లో గురువారం ధరిత్రీ దినోత్సవాన్ని (ఎర్త్ డే) కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర శాఖ సహకారంతో లైట్స్ ఫౌండేషన్, విజ్ఞాన్ విశ్వ విద్యాలయం సంయుక్తంగా నిర్వహించాయి.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రకృతి సంపద విషయంలో 3 ఆర్‌లు ఎంతో ముఖ్యమైనవని అవి రెడ్యూస్, రీ-సైకిల్, రీ యూజ్‌లుగా వివరించారు. రేపటి తరం విద్యార్థులకు ప్రకృతి సంపదపై అవగాహన కల్పించాలని, ప్రకృతి సమతుల్యత కాపాడాల్సిన గురుతర బాధ్యతను వారికి తెలియజేయాలన్నారు. వాడి పారేసిన వస్తువులతో సముద్ర జలాలు సైతం కలుషితమవుతున్నాయని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్, పాలిధిన్ వ్యర్ధాల నిర్మూలన ప్రపంచ దేశాలకు సవాల్‌గా మారిందని స్పష్టం చేశారు.
కర్బన పదార్ధాల వినియోగం వలన ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని, ఈ విషయంలో రేపటి తరానికి అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలను విద్యాసంస్థల్లో ముమ్మరంగా నిర్వహించాల్సి ఉందని అన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ ప్రకృతి మనకు ఇచ్చిన సంపదను పరిరక్షించుకోవాలన్నారు. ప్రకృతి వనరులను విచ్చలవిడిగా వినియోగిస్తే పంచభూతాల్లో సమతుల్యత లోపించి, అవి విపత్తులు, ప్రళయాల రూపంలో విరుచుకుపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. అనంతరం 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ చదువుతున్న విద్యార్థులకు ఎన్విరాన్‌మెంట్ క్విజ్, పెయింటింగ్, ఎక్స్‌టెంపోర్, వేస్ట్ మేనేజ్‌మెంట్ ఐడియా, స్లోగన్, స్కిట్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ముందుగా డాక్టర్ లావు రత్తయ్య, డాక్టర్ శ్రీధర్ పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సీహెచ్ శ్రీనివాస్, లలితకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మానవ తప్పిదాలతోనే విపత్తులు
Published Fri, May 1 2015 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM
Advertisement
Advertisement