డాక్టర్ శ్రీధర్, డాక్టర్ గణేశ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం లాక్‌డౌన్ విధించడం వల్ల అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువగా టీవీ చూడటం చేయరాదని ఉస్మానియా ఆస్పత్రి వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీధర్ ప్రజలకు సూచించారు. టీవీల్లో ఎక్కువగా కరోనాకు సంబంధించిన వార్తలు చూడటం ద్వారా లేని ఆందోళనలు పెరుగుతాయని, ఇది మానసిక సమస్యలకు దారితీసే అవకాశం ఉందని తెలిపారు. ఇక టీవీలు చూస్తూ అతిగా తినడం సైతం మంచిది కాదన్నారు. బీపీ, షుగర్ ఉన్నవాళ్లు ఆహార నియ మాలు పాటించడం తప్పనిసర న్నారు.
వ్యాయామం చేయడం సైతం దినచర్యలో భాగం కావాలన్నారు. బుధవారం ఐఅండ్‌పీఆర్ కార్యాలయంలో అపోలో ఆస్పత్రి జనరల్ మెడిసిన్ ఎండీ డాక్టర్ వై.గణేశ్‌తో కలిసి కరోనా నివారణ చర్యలపై మాట్లాడారు. జలుబు, దగ్గు, జ్వరం రాగానే భయపడాల్సిన అవసరం లేదని, వయస్సు పైబడిన వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంట్లోనే ఉండటం ద్వారా కరోనాను నివారించవచ్చని, బయటికి వెళ్లినప్పుడు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని సూచించారు. కరోనాతో అందరికీ ప్రాణహాని లేదని, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవారిపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతుందన్నారు.
లక్షణాలు కనిపిస్తే డాక్టర్లను సంప్రదించండి..
డాక్టర్ గణేశ్ మాట్లాడుతూ.. కరోనా లక్షణాలు కనిపిస్తే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. డాక్లర్ల సూచన లేకుండా హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులు వాడరాదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లలేని వారు, ఆన్‌లైన్ సేవల ద్వారా ప్రైవేటు ఆస్పత్రులను సంప్రదించవచ్చని తెలిపారు. అందరూ ఎన్–95 మాస్కులు వాడాల్సిన అవసరం లేదని, మామూలు మాస్కులు లేక కర్చీఫ్ కట్టుకున్నా సరిపోతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment