సెగభగలు
- మండిపోతున్న ఎండలు
- బెంబేలెత్తిస్తున్న వడగాలులు
- ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు
- మచిలీపట్నం, గుడివాడ, గన్నవరంలలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలో గత మూడు, నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరి గాయి. రెండు రోజులుగా వడగాలులు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం ఆరు గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపటంతో బయటకు వచ్చేందుకే ప్రజలు జంకుతున్నారు. ఉదయం 10 గంటల నుంచే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం 11 గంటలకే జనం లేక దుకాణాలను మూసివేయాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు.
పగటి ఉష్ణోగ్రతలు 43, 44 డిగ్రీలుగా నమోదవుతుండగా, రాత్రి సమయంలోనూ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు తగ్గకపోవటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆదివారం జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోహిణీ కార్తె శనివారంతోనే ముగిసిపోవడం.. ఆదివారం నుంచి మృగశిర కార్తె ప్రవేశించటంతో ఎండలు తగ్గుముఖం పడతాయని ప్రజలు భావించగా, మరింత పెరుగుతుండటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది.
ఓ వైపు కరెంటు కోతలు, మరోవైపు వడగాడ్పుల కారణంగా ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. దీంతో ఈ ఎండలు, వడగాలులను తట్టుకోవడమెలాగో అర్థంగాక ఆందోళనకు గురవుతున్నారు.