తీన్‌మార్ | Disputes TDP leaders | Sakshi
Sakshi News home page

తీన్‌మార్

Published Thu, Oct 30 2014 2:51 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

తీన్‌మార్ - Sakshi

తీన్‌మార్

  • వివాదాల్లో తెలుగుదేశం నేతలు
  •  ఎంపీ కేశినేనిపై భూకబ్జా ఆరోపణలు
  •  కార్, బైక్ రేసుల్లో ఎమ్మెల్యే బొండా ఉమా కుమారులు
  •  తన పేరుతో మరొకరితో పరీక్ష రాయించిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్
  • అధికార పార్టీ నేతలు రోజుకో వివాదంలో చిక్కుకుంటున్నారు. తమపై వరుసగా వస్తున్న ఆరోపణలతో ఇరుకున పడుతున్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా కుమారుల వివాదాస్పద రేసులు.. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చీటింగ్ వ్యవహారం.. ఎంపీ కేశినేని నానిపై భూకబ్జా కేసులు.. ప్రస్తుతం రాజధాని నగరంలో హాట్‌టాపిక్‌గా మారాయి.
     
    సాక్షి ప్రతినిధి, విజయవాడ :  టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కుమారులిద్దరూ రేసుల్లో ఆరితేరినవారు. ఇటీవల జరిగిన కారు రేసు ప్రమాదంలో బొండా ఉమ పెద్ద కుమారుడు సిద్ధార్థతో కలిసి పాల్గొన్న కృష్ణలంక యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసులు ఈ కేసు నుంచి సిద్ధార్థను తప్పించేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసినవారంతా ఎమ్మెల్యే కుమారుడి ద్వారానే ఇదంతా జరిగిందని చెప్పడంతో.. కుక్క కారుకు అడ్డం రావడం వల్లే ఈ ఘటన జరిగిందంటూ కేసు నుంచి తప్పించేందుకు ఎమ్మెల్యే కథ అల్లారు. దీనికి పోలీసులు వంతపాడారు.

    ఎమ్మెల్యే చిన్న కుమారుడు రవితేజ ఇటీవల గుంటూరు జిల్లాలోని యడ్లపాడుకు సమీపంలో బైక్ రేస్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశాడు. విషయం తెసుకున్న స్థానికుల్లో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన పోలీసులు రేస్ నిర్వహిస్తున్నవారిని అదుపులోకి తీసుకోవాల్సిందిపోయి ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని బైక్‌లతో సహా వారిని అక్కడి నుంచి పంపించేశారు.
     
    స్థల వివాదాల్లో ఎంపీ కేశినేని!

    స్థల వివాదాల నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని)పై ఆరోపణలు వస్తున్నాయి. తన కార్యాలయం వెనుక వైపు ఉన్న స్థలం ఖాళీగా ఉండటంతో కార్లు పార్కింగ్ చేసుకునేందుకు ఇవ్వాలని స్థల యజమాని బొమ్మదేవర సుబ్బారావును మధ్యవర్తి ద్వారా కోరారు. తాను బిల్డింగ్ నిర్మాణం చేపట్టేవరకు కార్లు పెట్టుకుంటే తనకు అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. ఆ మేరకు ఎంపీ అనుచరులు స్థలాన్ని వాడుకుంటున్నారు.
     
    తాను కాంప్లెక్స్ కట్టుకుంటున్నానని, తన స్థలంలో ఉన్న కార్లు, జనరేటర్ తీసివేయాలని ఈ నెల 20న బొమ్మదేవర సుబ్బారావు ఎంపీ అనుచరులకు చెప్పగా, వారు పట్టించుకోలేదు. తన స్థలంలో భూమి పూజ చేసేందుకు సుబ్బారావు ప్రయత్నించగా బలవంతంగా నెట్టివేశారు. ఈ స్థలం ఎంపీ నానిదని, ఇందులోకి వచ్చే హక్కు సుబ్బారావుకు లేదంటూ నానా హంగామా సృష్టించారు. చేసేది లేక ఆయన ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లారు. వారి హామీ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసి ఈ నెల 28న అక్కడున్న కొన్ని వస్తువులను తొలగించి కాంప్లెక్స్ కట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ నెల 29 రాత్రి తిరిగి ఎంపీ వర్గీయులు ఆ స్థలంలో కార్లు పెట్టారు.
     
    అడవినెక్కలంలో భూ ఆక్రమణ కేసు...

    జిల్లాలోని అడవినెక్కలం గ్రామంలో గేరామేరియో ఆంథోని, సుధాకర్, వారి తల్లి ఏసమ్మలకు చెందిన 24.35 ఎకరాల భూమిని ఎంపీ నాని తన అనుచరులతో ఆక్రమించాడని వారు ఇటీవల ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కలిశారు. తమ్మిన రాములు అనే వ్యక్తి వద్ద నుంచి తాము కొనుగోలు చేసినట్లు ఎంపీ వర్గీయులు చెబుతున్నారు. వాస్తవానికి రాములుకు ఆ భూమిపై ఎటువంటి హక్కూ లేదు. తాను సాగులో ఉన్నట్లు రెవెన్యూ వారిని లోబరుచుకుని అడంగల్‌లో పేరు రాయించుకున్నాడు. దీంతో భూమి సొంతదారులు కోర్టును ఆశ్రయించారు.

    దీనిపై ఏసమ్మకే అన్ని హక్కులూ ఉన్నాయని, జేసీ కోర్టులో ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిందిగా కోర్టు సూచించింది. దీంతో కంగుతిన్న ఎంపీ వర్గీయులు ఎలాగైనా ఈ భూమిని లాక్కునేందుకు రెవెన్యూ వారిపై ఒత్తిడి పెంచుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుభవంలో ఉన్నట్లు రాయించుకున్న వారందరికీ భూములు ఇవ్వడం మొదలు పెడితే ప్రభుత్వానికి కూడా సెంటు భూమి మిగిలే అవకాశం లేదని పలువురు విమర్శిస్తున్నారు. రికార్డులను తారుమారు చేసేందుకు ఎంపీ వర్గీయులు చేస్తున్న ప్రయత్నాలపై మండిపడుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement