ప్రజల్లోకి తప్పుడు సంకేతాలుగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
పులివెందుల టౌన్ : జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తున్నాయని వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర బీసీ కార్యాదర్శి అంబకపల్లె నారాయణస్వామి, జిల్లా సంయుక్త కార్యదర్శి వీరభద్రారెడ్డి, చంద్రమౌళి అన్నారు. ఓటుకు నోటు గురించి స్పందించేందుకు ఆయన వారం రోజుల సమయం తీసుకోవడం.. టీడీపీ, బీజేపీ నాయకులతో ట్యూషన్ చెప్పించుకోవడానికే ఉన్నట్లుందని ఆరోపించారు. స్థానిక పాత ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం వారు మాట్లాడారు.
రాష్ట్రంలో, కేంద్రంలో ఇన్ని జరుగుతున్నా పవన్‌కళ్యాణ్ ప్రశ్నించకుండా నోరు మూసుకున్నారా, నాలుక కోసుకున్నారా లేక అధికార పార్టీలకు అమ్ముడు పోయారా అని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రశ్నించకపోతే ఇంకెప్పుడు ప్రశ్నించలేరన్నారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు మీరు చూడకపోతే, తెలియకపోతే మేము ప్రశ్నలు అందిస్తాం. మా తరపున ప్రశ్నించాలన్నారు. రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ వారా కాదా ? ఆడియో టేపులో ఉన్నది బాబు గొంతు కాదా ? డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టవచ్చా.. లంచంగా ఇవ్వజూపిన డబ్బు ఎక్కడిది అని ప్రశ్నించరెందుకన్నారు. ఇకనైనా లెంపలేసుకొని రాజకీయ నటన మానుకోవాలన్నారు. పోరాడండి జనసైన్యం మీ వెంటే ఉంటుందని... లేకుంటే సైన్యంలేని సైన్యాధ్యక్షుడుగా మిగిలిపోతారని వారు వివరించారు.