రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రానికి గత నాలుగేళ్లలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు.
– ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రాత్మక రీతిలో పాదయాత్ర చేసి 2004 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని విజయపథాన నడిపించారు. ప్రస్తుతం ఆయన తనయుడు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి బాటలోనే నడుస్తున్నారు. అసెంబ్లీకి సాధారణ ఎన్నికల వ్యవధి ఏడాదిలోపే ఉన్న తరుణంలో రాష్ట్రంలో ఆయన ‘ప్రజా సంకల్పం’ పేరుతో పాదయాత్ర చేపట్టి ఇప్పటికి 200 రోజులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆంగ్ల పత్రిక ‘హిందూస్థాన్ టైమ్స్’ ప్రతినిధి జగన్‌ను కలిసి చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూ గురువారం ఆ పత్రికలో ప్రముఖంగా ప్రచురితమైంది. రాష్ట్రంలో గానీ, జాతీయ స్థాయిలో గానీ ఎన్నికల పొత్తులు ఉండబోవని జగన్ ఈ ఇంటర్వ్యూలో స్పష్టంగా తేల్చి చెప్పారు. 2019 ఎన్నికలకు ముందే ఫలానా పార్టీ లేదా గ్రూపు పట్ల మొగ్గు చూపే ప్రసక్తే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ఏ పార్టీ లేదా ఫ్రంట్ అయితే లిఖిత పూర్వకంగా అంగీకారం తెలుపుతుందో వారికే కేంద్రంలో మద్దతు ఇస్తామని చెప్పారు. ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఇలా ఉంది.
మీరు ఇప్పటికే 200 రోజుల పాదయాత్రలో 2,400 కిలోమీటర్లకు పైగా పూర్తి చేశారు కదా.. ఈ యాత్రలో మీరు పరిశీలించింది ఏమిటి?
ఈ యాత్రలో ప్రతి రోజూ నాకు ఒక కొత్త అనుభవమే. ఈ అనుభవం నుంచి నేను ప్రతిరోజూ ఎంతో నేర్చుకుంటున్నాను. బహుశా నాకు ఎదురయ్యే మనుషులు మారొచ్చు. కానీ వారి దీన స్థితిగతులు మాత్రం మారలేదు. కొన్ని చోట్ల వారి పరిస్థితుల్లో కొంత తేడా ఉండొచ్చు. గత నాలుగేళ్లుగా సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు. అప్పుల భారాన్ని మోస్తూ సతమతం అవుతున్నారు. నిరుద్యోగ సమస్య బాగా ఎక్కువగా ఉంది. మొత్తం ఆర్థిక వ్యవస్తే కుప్పకూలి పోయింది. గ్రామాల్లో ప్రజాస్వామ్యమనేదే లేదు. టీడీపీ నేతలతో నింపేసిన జన్మభూమి కమిటీలు స్థానిక ప్రభుత్వాల అధికారాలన్నింటినీ హరించి వేశాయి.
పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలన్నా చివరకు మరుగుదొడ్లు మంజూరు చేయాలన్నా.. ఈ కమిటీలు టీడీపీ నేతల ద్వారా వెళ్లే వారికే ఇస్తున్నాయి. ప్రజల చేత ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన సర్పంచ్‌లు అధికారాలు లేక ఉత్సవ విగ్రహాల్లా మిగిలి పోయారు. గ్రామ స్థాయిలో అవినీతి పెచ్చరిల్లింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను మొత్తం లూటీ చేశారు. అధికారుల సమక్షంలోనే వారికి తెలిసే ఇసుక మాఫియా ఇసుకను తవ్వి దోచుకుంటోంది. కేవలం టీడీపీ బినామీలు మాత్రమే ఉచితంగా ఇసుకను తీసుకెళుతున్నారు. ఈ ఇసుక దోపిడీలో జిల్లా కలెక్టర్లు కూడా భాగస్వాములుగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, ఆయనకు చెందిన హెరిటేజ్ కంపెనీ కూడా ఈ లూటీలో భాగస్వాములే. మట్టిని కూడా వారు వదలడం లేదు. బొగ్గు సరఫరా, విద్యుత్ కొనుగోళ్లు, మద్యం వ్యాపారం ఇలా అన్నింట్లోనూ భారీ కుంభకోణాలున్నాయి. వారు ఆలయాలను, ఆలయాలకు చెందిన భూములను కూడా వదలడం లేదు.
మీరు యాత్రలో గుర్తించిన ప్రధానమైన సమస్యలు ఏమిటి?
ఎన్నో సమస్యలు చూశాను. అవన్నీ మానవ తప్పిదాల వల్ల ఏర్పడినవే. చంద్రబాబునాయుడు పరిపాలన అధ్వానంగా ఉన్నందువల్ల ఉత్పన్నమైనవే. రూ 87,612 కోట్ల రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు గత నాలుగేళ్లలో సగటున ఏటా మాఫీ చేసిందల్లా రూ.3,000 కోట్లు మాత్రమే. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలిస్తాను.. జాబు కావాలంటే బాబు రావాలి అనే నినాదంతో ఆయన అధికారంలోకి వచ్చారు. హామీ ఇచ్చినట్లుగా ఆయన ఎవ్వరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు.. ఇస్తానన్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. మన యువతకు ఉద్యోగాలు రాగలిగే అవకాశం ఉండేది కేవలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్లనే. ప్రత్యేక హోదా వస్తే జీరో ఆదాయపు పన్నుతో పాటు పరిశ్రమలకు జీఎస్టీ మినహాయింపులు వచ్చి ఉండేవి. కానీ ప్రత్యేక హోదా రాలేదు.
వచ్చే ఎన్నికల్లో మీ ప్రధాన అజెండా ఏమిటి? ప్రత్యేక హోదానా? లేక వైఎస్సార్ పాలన పునరుద్ధరణా? లేక చంద్రబాబు పాలనా?
ఎన్నికల్లో ఇవన్నీ ప్రధాన అంశాలుగా ఉంటాయి. గత ఎన్నికల్లో మేం కేవలం 1.5 శాతం ఓట్ల తేడాతో అధికారంలోకి రాలేక పోయాం. తనకు తాను అనుభవజ్ఞుడిగా చంద్రబాబు చెప్పుకోవడంతో పాటుగా ఆయన ప్రజలకిచ్చిన అబద్ధపు హామీలు, పవన్ కళ్యాణ్ మద్దతు, దేశంలో వీచిన నరేంద్ర మోదీ గాలి.. ఇవన్నీ అప్పట్లో మా ఓటమికి కారణాలయ్యాయి. కానీ నేడు రాష్ట్రంలో నెలకొన్న వాతావరణం వేరుగా ఉంది. చంద్రబాబు పెద్ద అబద్ధాల కోరు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన సైకిల్ నుంచి మోదీ, పవన్ కళ్యాణ్ అనే చక్రాలు వేరు పడ్డాయి. అధికారంలోకి వచ్చాక మేమేం చేస్తామో.. నవరత్నాలు కార్యక్రమం ద్వారా చెబుతున్నాం. అదే సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణ పాలనను తీసుకు వస్తామని ప్రజలకు చెబుతున్నాం. ప్రత్యేక హోదా సాధన కచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రధానాంశంగా ఉండబోతోంది. ప్రత్యేక హోదా కోసం తొలి నుంచీ రాజీ లేకుండా నిరంతరం పోరాడున్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే. చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఇప్పుడు తన వైఖరి మార్చుకున్నారు.
ముందస్తు ఎన్నికలు వస్తాయని అంటున్నారు. వస్తే ఎదుర్కోనేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా?
నేను ఇప్పటికైతే వాటి గురించి ఏమీ ఆలోచించడం లేదు. ప్రస్తుతం నా దృష్టి అంతా పాదయాత్రపైనే కేంద్రీకరించాను. అయితే.. త్వరగా ఎన్నికలు జరగడం అనేది మాకూ, ఈ రాష్ట్రానికి చాలా మేలు చేస్తుంది. రాబోయే ఎన్నికలకు అదనంగా ఏర్పాట్లు చేసుకోవడం అనేది అవసరం లేదు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బహుముఖ పోటీ జరిగేట్లు కనిపిస్తోంది.. దీంతోపాటు సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగబోతోంది.. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి ఆ ప్రభావం మీ పార్టీపై ఏమైనా పడుతుందనుకుంటున్నారా?
నేనలా అనుకోను. బహుముఖ పోటీ ప్రభావం మా పార్టీ విజయావకాశాలపై ఏ మాత్రం ఉండదు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, బీజేపీ మద్దతుదార్లు ఇద్దరూ కూడా టీడీపీకే ఓట్లేశారు. ఆ పార్టీలన్నీ అప్పుడు కలిసి పోటీ చేసినందువల్ల అది సాధ్యమైంది. ప్రస్తుతం ఆ పార్టీలు రెండూ టీడీపీ ఓట్లనే చీల్చుతాయి తప్ప వైఎస్సార్ కాంగ్రెస్ ఓట్లను కానే కాదు.
పవన్ కళ్యాణ్ మీ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని మీ పార్టీ తిరుపతి మాజీ ఎంపీ చెప్పారు కదా?
నా వద్దకు అయితే అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదు. ఎవ్వరి మద్దతూ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే సత్తా మా పార్టీకి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి మద్దతు కోసం, లేదా పొత్తు కోసం ఇప్పుడు, ఈ దశలో ఆలోచించే అవసరం మాకు ఉందని భావించడం లేదు.
వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన భుజాలపై బీజేపీ తుపాకులు ఎక్కు పెట్టి కాల్చుతూ.. తన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తోందని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు.. ?
చంద్రబాబువి పూర్తిగా అర్థరహితమైన, పనికిమాలిన ఆరోపణలు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగింది టీడీపీ కాదా?
మీ పార్టీకి ఏపీలో 2019 ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో అంటే 25కు గాను 20 ఎంపీ స్థానాలు వస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారు?
నేను ఇప్పటికే ఈ విషయంపై పూర్తిగా స్పష్టత ఇచ్చాను. ఏపీకి ప్రత్యేక హోదా మంజూరు చేస్తామని లిఖిత పూర్వకంగా అంగీకారం తెలిపే పార్టీకి లేదా మిత్రపక్షాల కలయిక (అలయన్స్‌కు)కు మాత్రమే మా పార్టీ మద్దతు ఇస్తుంది. కేవలం పైపై హామీ ఇచ్చే వారికి మద్దతు ఇవ్వం.
ఎన్నికల అనంతరం ఒకవేళ ఏర్పడబోయే ఫెడరల్ ఫ్రంట్‌లో చేరాల్సిందిగా మీ పార్టీకి ఆహ్వానం వస్తే చేరతారా? జాతీయ రాజకీయాల్లో మీ పార్టీ పాత్ర ఎలా ఉండబోతోంది?
జాతీయ స్థాయిలో ఏదైనా ఫ్రంట్‌లో గాని, మిత్రపక్షాల కలయికలో గాని చేరాలన్న ఆసక్తి నాకు లేదు. జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించాలన్న కోరికా లేదు.
Comments
Please login to add a commentAdd a comment