సాక్షి, విశాఖపట్నం : ‘హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు విశాఖకు అన్యాయం చేశారు. ఇక్కడి వేల కోట్ల రూపాయల విలువైన ఆర్థిక వనరులను అక్కడికి తరలించారు. జిల్లా వనరులు దోపిడీకి గురయ్యాయి. అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్ర విభజన జరిగితే పర్యాటక, పారిశ్రామిక, ఉన్నత విద్య, విద్యుత్ రంగాల్లో నగరానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది’ అని విశాఖ అభివృద్ధి మండలి (వీడీసీ) ఆవేదన వ్యక్తం చేసింది.
నగరానికి జరగబోయే నష్టాలను వీడీసీ ఉపాధ్యక్షుడు, సింబయాసిస్ సీఈఓ ఒ.నరేష్‌కుమార్ విలేకరులకు వివరించారు. పారిశ్రామికంగా విశాఖకు ఉన్న గుర్తింపు కారణంగా ఇక్కడ భూములకు ఎనలేని విలువ వచ్చిందని, వుడా పేరుతో వీటిని ప్రభుత్వం వేలం వేయించి కొన్ని వేల కోట్ల నిధులను తరలించుకు పోయారన్నారు. ఆ నిధులతో రాజధానిని పలు రకాలుగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని గాలికి వదిలేశారని చెప్పారు. మొదటినుంచీ భూములు విక్రయించగా వచ్చిన వేల కోట్ల నిధులను విశాఖ అభివృద్ధికి వెచ్చిస్తే దేశంలోనే ప్రముఖ మెట్రోనగరంగా విశాఖ అభివృద్ధి చెందేదని అభిప్రాయపడ్డారు.
విభజన కారణంగా హైదరాబాద్‌ను వదులుకోవలసి వస్తే తీసుకున్న నిధులను తిరిగి విశాఖకు కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఐటీ రంగం టర్నోవరు ప్రస్తుతం రూ. 60 వేల కోట్ల వరకు ఉందని, అక్కడ ఐటీ వృద్ధిలో విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల ఇంజినీరింగ్ విద్యార్థుల పాత్ర ఎంతో ఉందన్నారు. ఇప్పుడు విభజన కారణంగా మన విద్యార్థులకు అక్కడ ఐటీ రంగంలో అవకాశాలు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయస్థాయి ప్రతిష్టాత్మక ఐఐఐటీ, ఐఐటీ, ఎఎస్‌బీ, నిఫ్ట్ వంటి క్యాంపస్‌లు అక్కడే ఉన్నాయి.. ఆంధ్రా ప్రాంతంలో ముఖ్యంగా విశాఖలో ప్రతిష్టాత్మక క్యాంపస్ ఒక్కటి కూడా లేదు.. ఇప్పుడు ఆయా జాతీయ క్యాంపస్‌ల్లో విద్యార్థులు పరాయి విద్యార్థుల్లా చదువుకోవలసి వస్తుందన్నారు.
విశాఖ అంటే అందరికి పర్యాటక రంగం గుర్తుకు వస్తుంది.. కానీ ఇక్కడ పర్యాటకపరంగా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులను ఒక్కటి కూడా అభివృద్ధి చేయలేదని చెప్పారు. విభజన కారణంగా విశాఖ పర్యాటక వృద్ధి మరింత వెనక్కువెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ రాష్ట్రంలోనే అత్యంత లాభాల్లో నడుస్తోందని, కానీ దీనికి మిగిలిన డిస్కంలతో పోల్చితే అతితక్కువగా 15.7 శాతమే విద్యుత్ కేటాయిస్తున్నారని, దీని వల్ల ఇక్కడ ఐటీ,పారిశ్రామిక రంగం వృద్ధిలో మందగమన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని విశ్లేషించారు. ఇక్కడ డిస్కమ్‌కు వచ్చిన లాభాల్లో రూ. 3 వేల కోట్లను హైదరాబాద్ డిస్కమ్‌కు అడ్డగోలుగా మళ్లించారని, ఆ నిధులకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.
ఇక్కడి సొమ్ముతో అక్కడ సోకులు
Published Fri, Aug 16 2013 2:56 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement
Advertisement