ఎన్‌ఎల్‌సీలో సమ్మె సైరన్ | NLC workers strike | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎల్‌సీలో సమ్మె సైరన్

Published Wed, Aug 20 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM

NLC workers strike

ఎన్‌ఎల్‌సీ కార్మికులు మళ్లీ సమ్మె సైరన్ మోగించారు. సమ్మె నోటీసును మంగళవారం యాజమాన్యానికి సమర్పించారు. సమ్మెలోకి ఎప్పటి నుంచి దిగుతారనే వివరాలను సెప్టెంబరు మూడో తేదీన ప్రకటించనున్నారు.
 
సాక్షి, చెన్నై: కడలూరు జిల్లా నైవేలిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లిగ్నైట్ కార్పొరేషన్(ఎన్‌ఎల్‌సీ) ఉంది. ఇక్కడ వేలాదిగా ఉద్యోగ, కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. నేల బొగ్గు తవ్వకాలు, విద్యుత్  ఉత్పత్తి విభాగంలో అత్యధిక శాతం ఒప్పంద కార్మికులు పనులు చేస్తున్నారు. వీరంతా కొన్నేళ్లుగా తమ డిమాండ్ల పరిష్కారం లక్ష్యంగా ఉద్యమిస్తున్నారు. గత ఏడాది నైవేలి వాటాల విక్రయానికి కేంద్రం యత్నించడం ఇక్కడి ఉద్యోగ, కార్మికుల్లో ఆగ్రహాన్ని రేపింది. తమ డిమాండ్ల సాధనతోపాటుగా వాటాల విక్రయానికి వ్యతిరేకంగా సమ్మెబాట పట్టడంతో విద్యుత్ ఉత్పత్తి ఆగే పరిస్థితి నెలకొంది.
 
ఎట్టకేలకు కోర్టు అక్షింతలు, కేంద్రం దిగి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ వాటాల విక్రయానికి సిద్ధ పడింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనతో కార్మికులు సమ్మెను వీడారు. అదే సమయంలో, తమ డిమాండ్ల మీద దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఆ డిమాండ్ల గురించి పట్టించుకున్న వారే లేరని చెప్పవచ్చు. తరచూ యాజమాన్యం, కార్మికులు చర్చలు సాగించడం అది విఫలం కావడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల సాధనకు మళ్లీ సమ్మె నినాదాన్ని కార్మిక సంఘాలు అందుకున్నాయి.
 
సమ్మె నోటీసు : ఎన్‌ఎల్‌సీ పరిధిలో అన్ని రాజకీయ పక్షాల అనుబంధ కార్మిక విభాగాలు, సీఐటీయూ, ఏఐటీయూసీ కార్మిక విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలన్నీ ఎన్‌ఎల్‌సీ కార్మిక సమాఖ్యగా ఆవిర్భవించడం జరిగింది. ఈ సమాఖ్య నేతలు తిరుమావళవన్, శ్రీధరన్, రాజ వన్నియన్, ఉదయకుమార్, స్టాలిన్, హెండ్రి, రాజప్పన్, రవిచంద్రన్, శ్రీనివాసులు తదితరులు మంగళవారం సమావేశమయ్యారు. 2013లో తమకు ఇచ్చిన హామీ మేరకు, సుప్రీం కోర్టు మార్గ దర్శకాల మేరకు డిమాండ్లను పరిష్కరించేందుకు యాజమాన్యం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. అయితే, యాజమాన్యం ఖాతరు చేయని దృష్ట్యా, సమ్మెకు సిద్ధ పడాల్సిందేనన్న ఏకాభిప్రాయానికి వచ్చారు.
 
ఒప్పంద కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సౌకర్యాల కల్పన తదితర డిమాండ్లతో కూడిన ప్రకటనను సిద్ధం చేశారు. కార్మిక నిబంధనల మేరకు సమ్మె సైరన్ మోగించేందుకు నెల రోజులకు ముందుగా యాజమాన్యానికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ దృష్ట్యా, ఎన్‌ఎల్‌సీ ఉన్నతాధికారి ముత్తుకు కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు సమ్మె నోటీసును అందజేశారు. సమ్మెకు దిగే తేదీ వివరాలను సెప్టెంబరు మూడో తేదీ ప్రకటించనున్నామని వివరించారు.
 
ఆ రోజున కార్మిక సంఘాల సమాఖ్య సర్వసభ్య సమావేశానికి నాయకులు పిలుపు నిచ్చారు. ఇందులో తీసుకునే నిర్ణయం మేరకు ముందుగా కొన్ని రోజుల పాటుగా ఆందోళనలు, నిరసనలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అప్పటికీ యాజమాన్యం దిగి  రాని పక్షంలో సమ్మె అనివార్యం కాబోతున్నది. ఈ కార్మికల సమ్మె నినాదం అందుకున్న దృష్ట్యా, ఎన్‌ఎల్‌సీ భద్రతా సిబ్బంది, అక్కడి పోలీసులకు ఇక చేతి నిండా పనే. ఈ సమయంలో ఎక్కడ ఆందోళనలు చేస్తారో, ఎప్పుడు వివాదాలు చెలరేగుతాయోనన్న ఉత్కంఠతో భద్రతను పర్యవేక్షించాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement