సాక్షిప్రతినిధి, నల్లగొండ
సార్వత్రిక ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని తయారు చేయలేక టీడీపీ అధినాయకత్వం కిందా మీద పడుతోంది. ప్రజా సమస్యలు గుర్తించి పోరాటాలు చేయాలని నిర్ణయించి మూడు రోజులు గడవక ముందే వెనకడుగు వేసింది. ముందు నిర్ణయించిన మేరకు శనివారం జిల్లా సమావేశం, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వరుసగా పన్నెండు రోజులపాటు నియోజకవర్గస్థాయి సమావేశాలు జరపాల్సి ఉంది. కానీ, వీటిని వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్ ప్రకటించారు. తెలంగాణ టీడీపీ ఫోరం నేతలంతా జిల్లా సమావేశానికి హాజరుకావడానికే సమావేశం వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నా.. అసలు కారణం వేరే ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి తెలంగాణ జిల్లాలో పర్యటిస్తామని ఇప్పటికే టీటీడీపీ ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రతి నియోజకవర్గంలో గ్రూపు
జిల్లా టీడీపీలో ఉన్న గ్రూపు గొడవలు, ముఖ్య నేతల మధ్య ఉన్న అభిప్రాయ బేధాలు ఎక్కడ బయట పడతాయో అన్న ఆందోళన నాయకత్వంలో ఉంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల్లో కుర్చీలు విసురుకుని తలలు పగులగొట్టుకున్న తమ్ముళ్లు ఇంకా ఆ జ్ఞాపకాల నుంచి బయటపడలేదు. నకిరేకల్ నియోజకవర్గంలో ఇన్‌చార్జి పాల్వాయి రజనీ కుమారి, మరో నాయకుడు రేగట్టె మల్లికార్జునరెడ్డి వర్గాల మధ్య ముష్టి యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో తమ నెత్తిన బలవంతంగా స్వామిగౌడ్‌ను రుద్దుతున్నారన్న అసంతృప్తితో అక్కడి నాయకులు ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మిర్యాలగూడెంలో తన అనురచర గ ణాన్ని పెంచి పోషించడంతో అక్కడా గొడవలున్నాయి. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇన్‌చార్జి డాక్టర్ చిన్నపురెడ్డికి.. ‘మోత్కుపల్లి’ మనుషులు చికాకులు కల్పిస్తూనే ఉన్నారు. ఇక, మునుగోడు నియోజకవర్గంలోనూ వేనేపల్లి వెంకటేశ్వరరావుకు అవకాశం దక్కకపోవడంతో గ్రూపు గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానమైన నల్లగొండ నియోజవర్గంలో ఒకరంటే ఒకరికి పొసగని పరిస్థితి. తుంగతుర్తి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మోత్కుపల్లి నర్సింహులుకు అక్కడి కేడర్ ఏమాత్రం సహకరించడం లేదు. సహకార ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. సంకినేని వెంకటేశ్వరావు నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేతిలో టీడీపీ కోలుకోలేని దెబ్బతిన్నది. ఈ కారణంగానే మోత్కుపల్లి తిరిగి వెనక్కి ఆలేరుకు వెళ్లిపోయే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. చివరకు జిల్లా అధ్యక్షున్ని కూడా డమ్మీ చేసిన పరిస్థితులు టీడీపీలో ఉన్నాయి.
పరువు కాపాడుకునేందుకు..
ఇలాంటి దయనీయమైన పరిస్థితులు ఉన్న టీడీపీ వాటి నుంచి బయట పడే సూచనలు కనిపించడంలేదు. ఈనేపథ్యంలో సమావేశాలు పెట్టుకుంటే బయటి ప్రాంత నేతల ముందు పరువు పోవడం మినహా మరోటి కాదన్న అభిప్రాయం బలంగానే వ్యక్తం అయ్యిందంటున్నారు. ఈ కారణంగానే ముందైతే ఏదో ఒక కారణం చూపెట్టి సమావేశం వాయిదా వేసినట్లు తెలుస్తోంది
జిల్లా తెలుగుదేశం పార్టీ సమావేశం వాయిదా
Published Sat, Sep 28 2013 3:17 AM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM
Advertisement