కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం సాదాసీదాగా ముగిసింది. శనివారం ఎంపీ రాథోడ్ రమేష్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో ఎజెండా ప్రకారం 28 అంశాలపై చర్చించాల్సి ఉండగా.. 15 అంశాలకే పరిమితం చేశారు. పైగా చర్చ జరిగిన అంశాలనూ అంతగా లోతుగా పట్టించుకోలేదు. చెన్నూర్ మండలం కత్తెరశాల వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు చేపట్టిన ధర్నాకు విజిలెన్స్ కమిటీ మద్దతు తెలిపింది.
వాగుపై వంతెన నిర్మాణానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రధానంగా వ్యవసాయంలో పంట నష్టం, హౌసింగ్‌లో ఇళ్లను కట్టకుండానే బిల్లులు చెల్లించడం, కూలిపోయిన ఇళ్లు, పంచాయతీ రాజ్ శాఖలో వర్షాలకు చెడిపోయిన రోడ్లపై చర్చ కొనసాగింది. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, డ్వామాలో ఉపాధి హామీ కూలీ డబ్బుల చెల్లింపు, ఇందిర జలప్రభ కింద ఎస్సీ, ఎస్టీల వ్యవసాయ భూములకు సాగునీరు, ఆర్‌డబ్ల్యూఎస్‌లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీరు కల్పించాల్సిన గ్రామాలకు పైప్‌లైన్ సౌకర్యాలు, మార్కెట్ యార్డులో పత్తి కొనుగళ్లు, విద్యుత్, అంగన్‌వాడీలపై, పాఠశాలలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అహ్మద్‌బాబు మాట్లాడుతూ.. బేల మండలానికి మంజూరైన సబ్ మార్కెట్‌యార్డు ఏర్పాటుకు స్థలం గుర్తించామని, నాలుగు నెలల్లో కాంటాలతో కూడిన మార్కెట్‌యార్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. జిన్నింగ్‌మిల్లులో పత్తి కొనుగోళ్లు కుదరదని, అలాగైతే జిల్లా వ్యాప్తంగా చేపట్టాల్సి ఉంటుందన్నారు.
ఐసీడీఎస్‌లో అమృతహస్తం, సబల కార్యక్రమంపై పూర్తి వివరాలను తనకు అందజేయాలని పీడీ మీరాబెనర్జీని ఆదేశించారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, పంచాయతీ భవనాలు, మండల సమాఖ్య భవన నిర్మాణాలకు, ఇతర పనులకు మార్చి 31 వరకు కొత్తగా మంజూరు ఇవ్వలేమని డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. హౌజింగ్ పీడీ గంగారాం మాట్లాడుతూ.. అవతవకలు జరిగిన మండలాల్లో విచారణ చేపట్టి సంబంధిత ఏఈని సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. విద్యుత్ శాఖ ఎస్‌ఈ అశోక్ మాట్లాడుతూ.. కరెంటు లేని గ్రామాల్లో స్తంభాలు సరఫరా చేస్తామన్నారు. చెడిపోయిన రోడ్లకు మరమ్మతు కోసం టెండర్లు పిలిచామని ఎస్‌ఈ ఉమా మహేశ్వర్‌రావు పేర్కొన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, డీఆర్వో ఎస్‌ఎస్.రాజు, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, జేడీఏ రోజ్‌లీల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇళ్లు కట్టకుండానే బిల్లులు చెల్లించారు..
- రాథోడ్మ్రేష్, ఆదిలాబాద్ ఎంపీ
ఏజెన్సీ ప్రాంతమైన పిట్టగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని కొసాయి గ్రామంలో గిరిజనులకు, కోలాంలకు, ఎస్సీ, ఎస్టీలకు 20 ఇళ్లు మంజూరయ్యాయి. కానీ.. వారు నిర్మించకుండానే అధికారులే బిల్లులు కాజేశారు. ఇందిర జలప్రభ కింద ఎంత మంది లబ్ధిదారులున్నారు.. ఏయే పనులు చేపట్టాల్సి ఉందో అడిగి తెలుసుకున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు
- వివేక్, ఎంపీ, పెద్దపల్లి
భీమిని, నెన్నెల, బెల్లంపల్లి మండలాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో చాలా అవకతవకలు జరిగాయి. రచ్చబండ కార్యక్రమంలో కూడా ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. దండేపల్లి మండలం వెల్గనూరులో పశుసంవర్ధక శాఖకు చెందిన డాక్టర్ రావడం లేదు. ఇందిరా జలప్రభ కింద ఎస్సీ, ఎస్టీల వ్యవసాయ భూముల్లో బోర్లు వేయకుంటే ఆ పథకం ఫెయిల్ అయినట్లే. ఇటిక్యాల, కోటపల్లి, కాసిపేటలో ఆర్‌డబ్ల్యూఎస్‌కు సంబంధించిన పనులు ఇంకా ప్రారంభం కాలేదు.
రోడ్లు సరిగా లేవు..
- గుండా మల్లేష్, ఎమ్మెల్యే, బెల్లంపల్లి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జిల్లాకు కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ఇంటర్ కనెక్టివిటి కింద చేసి గ్రామాలలో పనులు జరిగేలా చూడాలి. క్లస్టర్ విలేజ్ ట్రైనింగ్ క్యాంప్‌కు ఒక్క గ్రామం, మండలం కానీ ఎంపికకాలేదు. వర్షాలకు రోడ్లు పూర్తి అధ్వానంగా మారాయి. టేకులపల్లి నుంచి మండల కేంద్రానికి వెళ్లాలంటే 15 నుంచి 20 కిలో మీటర్లు వెళ్లాల్సి వస్తుంది. రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బెల్లంపల్లి మార్కెట్‌యార్డు విస్తరణకు ప్రభుత్వ భూమి కావాలి. మార్కెట్‌యార్డు పక్కన ఉన్న ఐదారు ఎకరాలు ప్రభుత్వ భూమిని కేటాయించాలి.
రాత్రిపూట చీకట్లో ప్రజలు..
- కావేటి సమ్మయ్య, ఎమ్మెల్యే, సిర్పూర్
సిర్పూర్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, బల్బులు లేక ప్రజలు చీకట్లో ఉంటున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి ఇంకా డబ్బులు చెల్లించలేదు. రోడ్లు బాగా చెడిపోయాయి.
పత్తి తీసుకురావాలంటే ఇబ్బందులు..
- గేడం నగేష్, ఎమ్మెల్యే బోథ్
బోథ్ వ్యవసాయ మార్కెట్‌యార్డుకు పత్తి తీసుకురావాలంటే రైతులు ఇబ్బందులు పడుతున్నా రు. నియోజకవర్గంలోని చాలా మండలాల్లో రోడ్లు చెడిపోయి ఉన్నాయి. పనులు చేపట్టాలి.
సబ్‌మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలి..
- జోగు రామన్న, ఎమ్మెల్యే, ఆదిలాబాద్
బేల మండలంలో సబ్ మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం 2008లో మంజూరు చేసింది. కానీ ఇంత వరకు సబ్ మార్కెట్‌యార్డు ఏర్పాటు కాలేదు. బేలలో మార్కెట్ లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిన్నింగ్ మిల్లుల ద్వారా బేలలో పత్తి కొనుగోలు చేయాలి. జైనథ్‌లో మార్కెట్ యార్డు ఉన్న జిన్నింగ్ మిల్లులు లేవు.
ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లే లేవు..
- వేణుగోపాలచారి,
ఎమ్మెల్యే ముథోల్
ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లు లేవు. రెండేసి రేషన్‌కార్డులు ఉన్నాయి. కుభీర్‌లో 12 ఇండ్లు కాలిపోయాయి. ఇండ్లు పూర్తిగా కట్టుకున్న వారు బిల్లుల కోసం తిరుగుతున్నరు. ఉపాధి కూలీ డబ్బులు అందించాలి. ఆరు గ్రామాలకు ఒక పోస్టాఫీసు మాత్రమే ఉంది. దీని వల్ల ఇబ్బంది అవుతంది. ఆధార్, నగదు బదిలీలాగే వ్యక్తి గత మరుగుదొడ్లను కూడా జిల్లాలో మొదటి స్థానంలో నిలపాలి. ఐసీడీఎస్ అధికారులకు ఫోన్ చేసినా స్పందించడంలేదు.
సాదాసీదాగా..
Published Sun, Dec 1 2013 4:19 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement