భద్రతపై గురి!
10 నుంచి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు !
అన్ని సంస్థల్లో సీసీ కెమెరాలు, గార్డులు తప్పనిసరి
ఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాల పరిశీలన
‘సేఫ్‌సిటీ’పై నడుం బిగిస్తున్న పోలీసులు
జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు కార్యా లయాల్లో భద్రతకు సంబంధించి పోలీసులు కఠిన నిబంధనలను రూపొందిస్తున్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ నెల 10 నుంచి అన్ని సంస్థల భద్రతపై ప్రత్యేక నివేదికలు తయారు చేస్తున్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో జరిగే ఈ క్షేత్రస్థాయి తనిఖీల్లో ప్రమాణాలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
చిత్తూరు (అర్బన్): జిల్లాపై నిఘా పెంచడంతో పాటు భద్రతా ఏర్పాట్లను సమీక్షించడానికి పోలీసుశాఖ సిద్ధమవుతోంది. ఈ నెల 10 నుంచి చిత్తూరు పోలీసు జిల్లా పరిధిలోని ప్రతి ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో ‘సేఫ్టీ ఆడిట్’ పేరిట తనిఖీలు చేపట్టనున్నారు. ఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో ఇందుకోసం కార్యాచరణ రూపొందిస్తున్నారు. జిల్లాను సేఫ్‌సిటీగా మార్చాలనే నినాదంతో పోలీసుశాఖ ప్రజల్లోకి వెళ్లనుంది.
ఇలా తనిఖీలు..
ప్రజల భద్రతకు ప్రభుత్వ ప్రయివేటు సంస్థలు తీసుకుంటున్న చర్యలపై పోలీసు శాఖ క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రయివేటు సంస్థలు, సినిమా హాళ్లు, మల్టీఫ్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఆసుపత్రులు, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, సూపర్‌బజార్లు, కార్పొరేటర్ సంస్థలకు చెందిన మాల్స్‌తో పాటు జనం రద్దీగా ఉండే ప్రాంతాలను పోలీసులు తనిఖీ చేస్తారు. ఇక్కడ ప్రజలకు ఏదైనా ఇబ్బందులొస్తే సంస్థల యాజమాన్యాలు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయనే విషయాలను పరిశీలిస్తారు. అసాంఘిక శక్తులు ప్రమాదకరమైన వస్తువులు తీసుకెళితే ముందగానే గుర్తించి ఎలా నిరోధిస్తారు..? చోరీలను నియంత్రించేందుకు ఏంచర్యలు చేపడుతున్నారనే విషయాలను నిశితంగా పరిశీలిస్తారు. స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా సీసీ కెమెరాలు పెట్టుకోవడం, ప్రజలు మాల్స్, ఇతర సముదాయాల్లోకి వెళ్లేప్పుడు తనిఖీలు చేయడం, గార్డులను నియమించుకోవడంపై ఆయా సంస్థలకు పోలీసు శాఖ నోటీసులు జారీ చేస్తుంది.
నిబంధనలు పాటించకుంటే కేసులు..
పోలీసులు సేఫ్టీ ఆడిట్‌లో గుర్తించిన లోపాలను సరిచేసుకోవాలంటూ ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు నోటీసులు ఇస్తుంది. ఇవి తీసుకున్న తరువాత పోలీసులు పేర్కొన్న లోటుపాట్లను సరిచేసుకోవాల్సిన బాధ్యత సంస్థల యాజమాన్యాలపై ఉంటుంది. ఇక నోటీసులు తీసుకున్న నెల రోజుల్లో అక్కడ భద్రతను పునరుద్ధరించుకోవాలి. అలా కాకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తే ఆయా సంస్థలపై కేసులు నమోదు చేసే అధికారం పోలీసు శాఖకు ఉంటుంది.
ప్రజలు సహకరించాలి
పోలీసుశాఖ పరంగా ప్రజల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటాం. అయితే కొన్ని విషయాలు ప్రజలకు తెలిసినా వాటిని పోలీసులతో షేర్ చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. పోలీసులపై నమ్మకం ఉంచి తెలిసిన విషయాలు మా దృష్టికి తీసుకురండి. 100 నంబర్‌కు కాల్ చేయండి, స్థానిక ఎస్సైకు చెప్పండి. ఆయన వినకుంటే సీఐ, డీఎస్పీ, ఏఎస్పీ ఇలా ఎవరికో ఒకరి చెప్పండి. మీకు ఎవరిపైనా నమ్మకం లేకుంటే నాకు నేరుగా ఫోన్ (9440796700) చేసి చెప్పండి. అప్పుడే నేరాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది.
-ఘట్టమనేని శ్రీనివాస్, ఎస్పీ, చిత్తూరు