పర్చూరు, న్యూస్‌లైన్ :
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఉపాధ్యాయులు చేపట్టిన సమ్మె కారణంగా జిల్లావ్యాప్తంగా 1570 ప్రభుత్వ పాఠశాలలు మూతబడినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఏ రాజేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మొత్తం 241 మంది ప్రధానోపాధ్యాయులు, 7,164 మంది ఉపాధ్యాయులు, 101 మంది ఎన్జీఓలు సమ్మెలో ఉన్నట్లు వెల్లడించారు. గురువారం పర్చూరు మండలంలో పర్యటించిన ఆయన పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా పర్చూరు ఎంఈఓ కార్యాలయంలో డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని పేదపిల్లల ఆకలి తీర్చే మధ్యాహ్న భోజన పథకం అమలు విషయంలో రాజీపడొద్దని సూచించారు. విద్యార్థులకు తప్పనిసరిగా వారానికి రెండు కోడిగుడ్లు ఇవ్వాల్సిందేనన్నారు.
పాఠశాలల్లో మెనూబోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకానికి ఆటంకాలు ఏర్పడకుండా సివిల్‌సప్లయిస్ అధికారులతో మాట్లాడి బియ్యం పంపిణీ జరిగేలా చూస్తామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో వయసుకు తగిన విధంగా ఎదుగుదల కనిపించడం లేదన్నారు. మండల విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేసి మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని కోరారు. ముఖ్యంగా కిశోర బాలికల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు చేయించాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో తప్పనిసరిగా సమాచారహక్కు బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థులకు అందజేసిన సామగ్రిని బీరువాల్లో ఉంచొద్దని, వాటిని వెంటనే పిల్లలకు పంపిణీ చేయాలని ఆదేశించారు. సీఆర్పీలను అడిగి క్లస్టర్ పరిధిలోని పాఠశాలల వివరాలు తెలుసుకున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం కాారణంగా పర్చూరు మండలంలో 26 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసినట్లు ఎంఈఓ టంగుటూరి శారదాదేవి డీఈఓకు తెలిపారు.
ఎయిడెడ్ పాఠశాలల్లో రేషనలైజేషన్ తాత్కాలికంగా నిలిపివేత...
ఉద్యమాల నేపథ్యంలో ఎయిడెడ్ పాఠశాలల్లో సిబ్బంది రేషనలైజేషన్ ప్రక్రియను సీమాంధ్రలోని 13 జిల్లాల్లో తాత్కాలికంగా నిలిపివేసినట్లు డీఈఓ తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వెలువడిన తర్వాతే ఈ విషయంపై చర్యలు చేపడతామన్నారు. ఆయన వెంట ఒంగోలు ఉపవిద్యాశాఖాధికారి ఈ సాల్మన్, పర్చూరు మండల విద్యాశాఖాధికారి టంగుటూరి శారదాదేవి ఉన్నారు.
జిల్లావ్యాప్తంగా 1570 పాఠశాలల మూసివేత
Published Fri, Sep 20 2013 2:57 AM | Last Updated on Fri, Sep 1 2017 10:51 PM
Advertisement