సాక్షి ప్రతినిధి, నెల్లూరు : సమైక్యాంధ్ర నినాదాలతో నెల్లూరు నగరం హోరెత్తింది. నగరంలోకి ప్రవేశించే అన్ని దారులు ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానం వైపే కదిలాయి. ఉరకలేసిన ఉత్సాహంతో సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకుని గొంతుగొంతూ కలుపుతూ నినాదాలు చేసుకుంటూ జనం తండోపతండాలుగా తరలివచ్చారు. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, న్యాయవాదులు, ప్రజాసంఘాలు, కళాకారులు.. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్లువీళ్లు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు సమైక్యాంధ్ర కోసం సింహాలై గర్జించారు.
ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమైన జన సందోహం ఒక్కో మార్గం నుంచి ప్రదర్శనగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియానికి పోటెత్తింది. సమైక్య సింహగర్జన సభ ముగిసిన తర్వాత కూడా వేలాది మంది స్వచ్ఛందంగా రావడం కనిపించింది. పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు, వీధులు జనంతో కిటకిటలాటాయి.
ఎటువైపు చూసినా జనంతో నిండిపోయాయి. సమైక్య పరిరక్షణ వేదిక పేరుతో జిల్లా అధికారుల సంఘం గురువారం నిర్వహించిన ‘ సమైక్య సింహగర్జన ’ జిల్లా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఒక అపురూప ఘట్టంగా నిలిచిపోనుంది. సింహగర్జన సభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి హాజరై సంఘీభావం ప్రకటించారు.
సభకు లక్షలాది మంది హాజరవుతారని అంచనా వేసిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జనానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ స్వయంగా పర్యవేక్షించారు. సింహగర్జన సభకు విస్తృత ప్రచారం కల్పించడంతో నగరంలోని పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా మూసివేశారు. సభా ప్రాంగణం పరిసరాలు మినహా మిగిలిన ప్రాంతాలు నిర్మానుష్యంగా కనిపించాయి.
ఎటుచూసినా కోలాహలం : సింహగర్జన సభకు హాజరయ్యేందుకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది నగరానికి తరలి వచ్చారు. ట్రాక్టర్లు, లారీలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో జనం పెద్ద ఎత్తున సభకు హాజరయ్యారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందుగానే వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అక్కడ నుంచి ఆయా బృందాలు ప్రదర్శనగా సభా ప్రాంగణానికి చేరుకున్నాయి. తెలుగుతల్లి, జాతీయ నేతల వేషధారణలతో పాటు పలు రకాల విచిత్ర వేషధార ణలతో ప్రదర్శనగా రావడంతో కోలాహలం చోటు చేసుకుంది. అక్కడక్కడా డప్పు వాయిద్యాలతో సమైక్యవాదులు చిందులు తొక్కుతూ నినదించారు. నగరం నుంచి సభకు హాజరయ్యే వారి కోసం 15 కేంద్రాలను ఎంపిక చేసి అక్కడ నుంచే బయలుదేరే ఏర్పాట్లు చేశారు.
దీంతో కలెక్టరేట్, ఆత్మకూరు బస్టాండ్, వీఆర్సీ సెంటర్, అయ్యప్పగుడి సెంటర్, మినీబైపాస్ రోడ్డు, ములుముడి బస్టాండ్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వివిధ ఉద్యోగ సంఘాల సిబ్బంది, ప్రజాసంఘాలు ర్యాలీగా స్టేడియం చేరుకున్నాయి. ఈ ర్యాలీల్లోనూ విచిత్ర వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నృత్యాలు, నినాదాలతో దద్దరిల్లిన సభా ప్రాంగణం : సింహగర్జన సభా ప్రాంగణం సమైక్యవాదుల నృత్యాలు, నినాదాలతో దద్దరిల్లింది. సమైక్యాంధ్ర ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ కళాకారులు పాడిన పాటలు సభకు హాజరైన వారిని ఉరకలెత్తించాయి. ‘ఆంధ్ర రాష్ట్రమా, సమైక్య రాష్ట్రమా ..నిన్నే ముక్కలు చేస్తే తల్లడిల్లిపోతాం’ అంటూ కళాంజలి ఆర్కెస్ట్రా అధినేత శ్రీనివాస చక్రవర్తి పాడిన పాట అందరి హృదయాలను దోచుకుంది.
సభికుల విజ్ఞప్తి మేరకు ఇదే పాటను పలుమార్లు పాడారు. చిన్నాపెద్ద అన్న తేడా లేకుండా డ్యాన్సులు చేశారు. సభ నిర్వాహకులు సమైక్యాంధ్ర నినాదాలు చేసిన సమయంలో హాజరైన వారు కూడా నినాదాలు చేయడంతో పరిసర ప్రాంతాలు ప్రతిధ్వనించాయి. వక్తల ప్రసంగాల సమయంలోనూ సమైక్యాంధ్ర ప్రాధాన్యతను వివరించినప్పుడు జనం నుంచి విశేష స్పందన కనిపించింది. వేదికపైన జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు డి. రామిరెడ్డి, అదనపు జాయింట్ కలెక్టర్ పెంచలరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం, విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబా, ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రబాబు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేత మధుసూదన్‌రావు ఉన్నారు.
వీరితో పాటు కళాకారులకు మాత్రమే వేదికపైన అవకాశం కల్పించారు.
జాతీయ గీతాలాపనతో ముగింపు: లక్షలాదిగా హాజరైన సింగహగర్జన సభను జాతీయ గీతాలాపనతో ముగించారు. ఉదయం తొమ్మిది గం టల నుంచి జనం సభాప్రాంగణానికి చేరుకోవడం మొదలైంది. నిర్ణీత సమయానికి మైదానం మొత్తం జనంతో నిండిపోయింది. ఎండ ఎక్కువగా ఉండటంతో ప్రసంగాలకు ముందే వెళ్లిపోవడం కనిపించింది. ఒంటిగంట వరకు జరగాల్సిన సభను ముందుగానే ముగించారు. సభ ముగిసే సమయానికి కూడా వేలాదిమంది రావడం కనిపించింది.
విభజన జరిగితే నెల్లూరు ఎడారే
Published Fri, Sep 6 2013 4:32 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement