తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడానికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజిస్తోందని అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్‌ఆర్ సీపీ ఎన్నికల పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు.
యల్లనూరు, న్యూస్‌లైన్: తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడానికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజిస్తోందని అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్‌ఆర్ సీపీ ఎన్నికల పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం యల్లనూరులో వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా నాలుగున్నర నెలలుగా ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు భారీ ఎత్తున ఉద్యమించారని, అయినా సీమాంధ్ర ప్రజల ఆవేదనను పట్టించుకోకుండా వారి స్వార్థం కోసం రాష్ట్రాన్ని చీలుస్తున్నార న్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ బిల్లు అసెంబ్లీకి చేరిన సమయంలో డుమ్మా కొట్టడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు లోపాయికారిగా రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న తీరును ప్రజలు చీద రించుకుంటున్నారన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు కమీషన్ల కోసం కక్కుర్తి పడి మళ్లీ అధికారంలోకి రాలేమని గ్రహించి రాజీనామాలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి సువర్ణ పాలన తిరిగి రావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, మాజీ ఎంపీపీ కేతిరెడ్డి పెద్దారెడ్డి, డాక్టర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్రే ధ్యేయంగా వైఎస్‌ఆర్ సీపీ పోరాటం చేస్తోందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్, టీడీపీలకు రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పరితపిస్తున్న జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యాంధ్ర కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. రాష్ట్రం విడిపోతే నీటి సమస్య తీవ్రమవుతోందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వైఎస్‌ఆర్ సీపీ చేపట్టిన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. జిల్లా అధికార ప్రతినిధి మిద్దె కుళ్లాయప్ప, నాయకులు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, బోయ తిరుపాలు, మీసాల రంగన్న మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే ఇరు ప్రాంతాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ సభలో నాయకులు శరత్‌చంద్రారెడ్డి, సోమశేఖరరెడ్డి, చవ్వా రాజశేఖరరెడ్డి, భాస్కరరెడ్డి, మండల కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.