సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన జేసీ బ్రదర్స్ (జేసీ దివాకర్‌రెడ్డి– జేసీ ప్రభాకర్‌రెడ్డి) వ్యాపార సామ్రాజ్యమంతా అవినీతి, అక్రమమేనని తేలింది. గత తెలుగుదేశం పాలనలో మరీ చెలరేగిపోయారు. ట్రావెల్స్, ట్రాన్స్‌పోర్ట్, అసాంఘిక కార్యకలాపాలు, మాన్యం భూముల ఆక్రమణ తదితర వాటి ద్వారా గత ఐదేళ్లలో రూ.2900 కోట్ల మేర దోపిడీ సాగించారు.
తాడిపత్రి: దివాకర్ ట్రావెల్స్ అక్రమాలు 2012లో వెలుగులోకి వచ్చాయి. అప్పటి రవాణా శాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య మహబుబ్‌నగర్ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఓ మహిళా ప్రయాణికురాలు ఇచ్చిన సమాచారం మేరకు రవాణా శాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య స్వయంగా అధికారులతో కలిసి కర్నూలు – హైదరాబాద్ జాతీయ రహదారిలో తనిఖీలు నిర్వహించారు. దివాకర్ ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సులో మొబైల్ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి.. ఆ బస్సును కూడా సీజ్ చేశారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్‌పై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించి అనుమతులు లేని బస్సులను పదుల సంఖ్యలో సీజ్ చేశారు.
ఆదర్శ మున్సిపాలిటీలోనూఅంతులేని అవినీతి
తాడిపత్రి మున్సిపాలిటీ పేరుకే ఆదర్శం.. కానీ ఆ ఆదర్శం మాటున అంతులేని అవినీతి చోటు చేసుకుంది. జేసీ సోదరులే కాకుండా వారి అనుచరులు సైతం తాడిపత్రి మున్సిపాలిటీని అడ్డుపెట్టుకొని రూ.200 కోట్లకు పైగా దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డి బినామీగా వ్యవహరించిన ప్రధాన అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి పట్టణంలోని జేసీ నాగిరెడ్డి మున్సిపల్ కాంప్లెక్స్‌లో మొదటి అంతస్తు టెండర్ దక్కించుకున్నాడు. మొదటి అంతస్తుకు సంబంధించి రూ.2.73కోట్లు బకాయిలు మున్సిపాలిటీకి చెల్లించాలి. ఈ మొత్తం కాంప్లెక్స్‌ను వ్యాపారులకు సబ్‌లీజుకు ఇచ్చేశాడు. ఒక్కో వ్యాపారి నుంచి రూ.20 వేల నుంచి రూ.30 వేలు చొప్పున అద్దె వసూలు చేశాడు. ఈ కాంప్లెక్స్‌లో కనీసం 50 మంది వ్యాపారులు ఉంటారు. ఈ లెక్క ప్రకారం నెలకు రూ.10 లక్షలు నుంచి రూ.15 లక్షల ఆదాయం వచ్చేది. ఇదే కాంప్లెక్స్‌లో 64, 68 నంబర్ షాపులు కూడా ఎస్వీ రవీంద్రారెడ్డి దక్కించుకున్నారు. వీటికి రూ.3.52 లక్షలు గుడ్‌విల్, రూ.3.33 లక్షలు బాడుగల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో ఈ దుకాణాల లీజును మున్సిపల్ అధికారులు రద్దు చేశారు. అయినా ఈ దుకాణాలు లీజుకు ఇచ్చి ప్రతినెలా భారీగా అద్దె వసూలు చేశాడు. గత ఐదేళ్లుగా ఇదే తంతు కొనసాగించాడు.
ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో 64, 76, 68, 62 నంబర్ షాపులను కూడా ఎస్వీ రవీంద్రారెడ్డి దక్కించుకున్నాడు. వీటికి రూ.2 వేల చొప్పున మాత్రమే అద్దె చెల్లిస్తున్నారు. వ్యాపారులకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సబ్‌లీజుకు ఇచ్చారు. రెండు కాంప్లెక్స్‌లోని అద్దెలు రవీంద్రారెడ్డి వసూలు చేసినా, ఈ డబ్బులు తిరిగి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి చేరినట్లు సొంత పార్టీ నేతలే చెబుతుండడం గమనార్హం.
నిజాయతీ అధికారికి బదిలీనే బహుమానం
మైనింగ్ విజిలెన్స్ ఏడీగా ప్రతాప్‌రెడ్డి 2015 ఆగస్టు 21న బాధ్యతలు స్వీకరించారు. తాడిపత్రిలో జరుగుతున్న గ్రానైట్ మాఫియా అక్రమాలు చూసి ఆయన షాక్‌కు గురయ్యారు. గ్రానైట్ దందాపై ఉక్కుపాదం మోపారు. 2015కు ముందు ఏటా కోటి రూపాయలు కూడా ఫెనాల్టీ రూపంలో వచ్చేవి కావు. కానీ 2015–16లో రూ.5.40 కోట్లు, 2016–17లో రూ.5.55 కోట్లు రాబట్టారు. ఈ జరిమానాలను బట్టి అక్కడ దందా ఏ స్థాయిలో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. తమకు ప్రతిబంధకంగా మారుతున్న ప్రతాప్‌రెడ్డిని బదిలీ చేయించాలని చూశారు. చివరకు చంపుతామంటూ బెదిరింపులకు కూడా దిగారు. దీంతో గ్రానైట్ మాఫియాతో తనకు ముప్పు ఉందంటూ మైనింగ్ విజిలెన్స్ డైరెక్టర్‌కు ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. అప్పటి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పీఏ రవీంద్రారెడ్డితో పాటు గ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరెడ్డి, బిల్లుల బాబు, నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత ప్రతాప్‌రెడ్డిని ఇక్కడి నుంచి ఆ మాఫియానే బదిలీ చేయించి తమ అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగించింది. అధికారాన్నీ అడ్డుపెట్టుకుని గ్రానైట్ మాఫియా ద్వారా రూ. 200 కోట్లకు పైగా ఆర్జించారన్న ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. మాఫియా జోక్యం లేక ముందు ఈ ప్రాంత గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు ప్రతి నెలా రూ.9.5 కోట్ల మేర విద్యుత్ బిల్లులు చెల్లించేవారు. అంటే పరిశ్రమలు ఎంత బాగా నడిచాయో ఈ బిల్లులను చూస్తే తెలిసేది. మాఫియా జోక్యంతో పరిశ్రమలు కాస్తా చీమకుర్తి, మాటూరు, చిత్తూరు, కర్నూలు, ఒంగోలు తదితర ప్రాంతాలకు తరలిపోయాయి. దీంతో ప్రస్తుతం రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్లు మాత్రమే కరెంటు బిల్లులు వస్తున్నాయి. అంటే గ్రానైట్ పరిశ్రమలు భారీగా మూతపడ్డాయి. తద్వారా రూ.2,500 కోట్లు గ్రానైట్ పరిశ్రమకు నష్టం వాటిల్లింది.
ట్రాన్స్‌పోర్ట్ ద్వారా రూ.300 కోట్లు
ఆర్జాస్ స్టీల్‌ప్లాంట్ కోసం హుసేన్‌పురం, జంబులపాడు, చల్లవారిపల్లి, వీరాపురం గ్రామాల ప్రజలు దాదాపు రెండు వేల ఎకరాల వరకు తమ భూములను స్వాధీనం చేశారు. వీరు లారీలు, ఇతర మార్గాల ద్వారా ఈ ప్లాంటుపై ఆధారపడి జీవించే వారు. అయితే దివాకర్ రోడ్‌లైన్స్, ట్రాన్స్ ఇండియా పేరుతో జేసీ బ్రదర్స్ సొంతంగా ట్రాన్స్‌పోర్టు ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జేసీ బ్రదర్స్ ట్రాన్స్‌పోర్ట్‌ను కాదనే ధైర్యం ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఉండేది కాదు. దీంతో తొలి ప్రాధాన్యత జేసీ వారికే ఇస్తూ వచ్చేవారు. అయితే ఇందుకు సంబంధించిన బిల్లులను జేసీ బ్రదర్స్ ట్రాన్స్‌పోర్టు పేరు మీద కాకుండా తాడిపత్రి లారీ అసోసియేషన్ పేరుపై చేయిస్తూ ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొడుతున్నట్లు సమాచారం. లారీలపై జేసీపీఆర్ అని ఉంటుంది. బిల్లులు మాత్రం ఆయన పేరుతో ఉండవు. మొత్తం బినామీ లెక్కలే. ఈ లారీలు మినహా ఇతర లారీలు స్టీల్‌ప్లాంట్‌లోకి వెళ్లేందుకు వీల్లేదు. ఇలా ఐదేళ్లలో ట్రాన్స్‌పోర్ట్ ద్వారా రూ.300 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది.
డ్రై స్లాగ్ ద్వారా నెలకురూ.15కోట్ల ఆదాయం
ఆర్జాస్ స్టీల్ ప్లాంట్‌లో డ్రై స్లాగ్‌ను టన్ను రూ.10తో ఇక్కడి టీడీపీ నేతలు కొనుగోలు చేసేవారు. దీనిని అల్ట్రాటెక్ సిమెంట్, సాగర్ సిమెంట్ పరిశ్రమలకు తరలించి టన్ను రూ.850 చొప్పున విక్రయిస్తారు. ట్రాన్స్‌పోర్టు, ఇతర ఖర్చుల కింద రూ.250 పోగా రూ.600 మేర మిగులుతుండేది. ప్రతి నెలా 25వేల టన్నులకు పైగా డ్రైస్లాగ్‌ను ఈ స్థాయిలో తరలించే వారు. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.750 కోట్లకు పైగా ఆదాయం గడించినట్లు తెలుస్తోంది.
అన్ని రూట్లకూ ఒకటే పర్మిట్
జేసీ సోదరులు అధికార బలంతో రవాణా శాఖ అధికారులను గుప్పిట్లో పెట్టుకొని ఒక పర్మిట్ నంబర్‌పైనే పలు రూట్లలో అనధికారికంగా బస్సులు నడుపుతూ వచ్చారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్‌ల నిర్వహణపై నిఘా అధికమైంది. దీనికి తోడు దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు తరచూ ప్రమాదాలకు గురయ్యేవి. ఈ ట్రావెల్స్ అక్రమాలపైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. రంగంలోకి దిగిన రవాణా శాఖ అధికారులు అనుమతులు లేకుండా తిరుగుతున్న బస్సులన్నింటినీ ఎక్కడికక్కడ సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.
రాజకీయ అవసరాలకు మట్కా డాన్ సహకారం
తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ రాజకీయ అవసరాలకు మట్కా డాన్ రషీద్ స్పాన్సర్‌గా వ్యవహరించేవాడు. నియోజకవర్గంలోని నేతలకు పెద్ద మొత్తంలో కానుకలను ఆయన అందజేసేవాడు. ప్రజాప్రతినిధులు కార్లు కొనుగోలు చేస్తే వాటికి నెలవారీ కంతులు కూడా రషీద్ చెల్లించేవాడని తెలిసింది. మట్కా నిర్వహణకు పోలీసుల నుంచి ఇబ్బందులు రాకుండా కప్పం రూపంలో స్థానిక నేతలకు రషీద్ నజరానాలు ఇచ్చేవాడు. 2018 డిసెంబర్ 30న వైఎస్సార్ జిల్లాకు చెందిన సీఐ హమీద్‌ఖాన్‌తో పాటు పోలీసులపై దాడి చేసి వారి వాహనాన్నే తగులబెట్టి సవాల్ విసిరే స్థాయికి ఎదిగాడంటే అతని వెనుక ఉన్న వ్యక్తి ఎవరనేది తాడిపత్రిలోని ఏఒక్కరినీ అడిగినా తెలుస్తుంది.
మాన్యాన్నీ వదలని జేసీ సోదరులు
పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరులో పప్పూరమ్మ ఆలయానికి దాదాపు 19 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. ఈ భూముల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఆలయంలో ధూపదీప నైవేద్యాలు, నిత్య కైంకర్యాలు చేస్తుండేవారు. అయితే తాడిపత్రి – పెద్దపప్పూరు ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ భూములను మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కబ్జా చేసి పంట సాగు చేపట్టారు. రెండు పెద్ద ఫారంపాండ్లు ఏర్పాటు చేయించి బోరుబావుల నీటితో వాటిని నింపారు. ఈ నీటితో మాన్యం భూముల్లో కరివేపాకు, అరటి సాగు చేశారు. పంట దిగుబడుల ద్వారా రూ.లక్షలు ఆర్జిస్తున్నా ఆలయంలో పూజలకు కనీసం ఒక్క పైసా కూడా చెల్లించలేదనే ఆరోపణలున్నాయి. ఏడాది క్రితం ఈ విషయంపై విచారణకు వచ్చిన దేవదాయ శాఖ అధికారలు ఆ భూములన్నీ జేసీ దివాకర్‌రెడ్డి అధీనంలో ఉన్నాయని తెలుసుకుని నోరు మెదపకుండా వెళ్లిపోయారు. మూడు నెలల క్రితం అధికారులు వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
గ్రానైట్ మాఫియా
తాడిపత్రిలో 850 వరకు గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి 70 లారీలతో 20 నుంచి 30 మంది ట్రాన్స్‌పోర్టర్లు గ్రానైట్ రాళ్లను చిత్తూరు, మడకశిర, కర్నూలు ప్రాంతాల నుంచి తీసుకువస్తుంటారు. ఒక లోడు గ్రానైట్‌ను క్వారీ నుంచి తాడిపత్రికి చేరాలంటే రూ.45 వేల నుంచి రూ.50 వేలు రాయల్టీ చెల్లించాలి. అయితే రాయల్టీ లేకుండా క్వారీ నుంచి తాడిపత్రికి గ్రానైట్ చేర్చేలా క్వారీ యాజమాన్యం తాడిపత్రి పాలిష్ మిషన్ వ్యాపారుల మధ్య కుదిరిన ఒప్పందం మాఫియాను తలపించింది. లారీలో ఉన్న గ్రానైట్ పరిమాణాన్ని తగ్గించి బిల్లులో చూపించి రవాణా చేసేవారు. ఒకే బిల్లుతో 5 – 6 లోడ్లు రవాణా చేస్తుండేవారు. ఈ డబ్బులు మొత్తం మాఫియాను నడిపే ఓ పెద్దమనిషి ఇంటికి చేరవేసేవారు. అక్కడ వాటాల పంపకం జరుగుతుండేది.
Comments
Please login to add a commentAdd a comment