నేర చరితులు ఏజెంట్లుగా అనర్హులు | Do Not Appoint Criminals As Agents | Sakshi
Sakshi News home page

నేర చరితులు ఏజెంట్లుగా అనర్హులు

Published Fri, May 17 2019 1:20 PM | Last Updated on Fri, May 17 2019 1:20 PM

Do Not Appoint Criminals As Agents - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న తిరుపతి అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి వి విజయరామరాజు

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: నేరచరిత్ర గల వ్యక్తులను ఏజెంట్లుగా నియమించవద్దని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వో, మున్సిపల్‌ కమిషనర్‌ వి.విజయరామరాజు తెలిపారు. స్థానిక తిరుపతి అర్బన్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం బరిలో వున్న అభ్యర్థులు, జనరల్‌ ఏజెంట్లతో కౌంటింగ్‌ ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తిరుపతి అసెంబ్లీ బరిలో వున్న అభ్యర్థులు కౌంటింగ్‌ ఏజెంట్ల జాబితాను అందించి పాసులు పొందాలన్నారు.

అదేవిధంగా ఎంపికైన ఏజెంట్లు రెండు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ కాపీలు, ఐడీ కార్డుతో ఈ నెల 23న ఉదయం 6గంటలకు చిత్తూరులోని ఆర్వీఎస్‌ నగర్, ఎస్‌వీసెట్‌ కళాశాల కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఎటువంటి నేరచరిత్ర లేనివారిని మాత్రమే ఏజెంట్లుగా నియమించాలని సూచించారు. అభ్యర్థులు అందించిన ఏజెంట్ల వివరాలను ఎస్పీ పరిశీలించనున్నట్లు తెలిపారు. తిరుపతి నియోజకవర్గంలో 261 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నందున కౌంటింగ్‌ ప్రక్రియ కోసం 20టేబుల్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

దీంతో పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ కోసం మరో 2 టేబుల్స్‌ అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏజెంట్లు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద సమస్యలు వుంటే ఆర్వోకు తెలపాలని సూచించారు. క్రమశిక్షణ పాటించాలని లేనిపక్షంలో కౌంటింగ్‌ కేంద్రాలనుంచి బయటకు పంపిస్తామని హెచ్చరించారు. కౌంటింగ్‌ రోజున ఉదయం 7గంటలకు అబ్జర్వర్, ఆర్వో, బరిలో వున్న అభ్యర్థుల సమక్ష్యంలో ఈవీఎంల స్ట్రాంగ్‌ రూమ్‌ను తెరవడం జరుగుతుందన్నారు.

అనంతరం 8గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు, 8.30గంటల నుంచి కంట్రోల్‌ యూనిట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. కంట్రోల్‌ యూనిట్ల లెక్కింపు పూరైన తర్వాత అబ్జర్వర్‌ రాండమైజేషన్‌తో 5వీవీ ప్యాట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఒక్కో వీవీ ప్యాట్‌ లెక్కింపునకు 45 నిమిషాలు సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో తిరుపతి ఏఆర్వో, అర్బన్‌ తహసీల్దార్‌ శ్రీనివాసులు, బరిలో వున్న వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, పార్టీల ఏజెంట్లు పాల్గొన్నారు.

కౌంటింగ్‌ విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ విధుల్లో నోడల్‌ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తిరుపతి అసెంబ్లీ ఆర్వో, నగర పాలక కమిషనర్‌ వి విజయరామరాజు సూచించారు. గురువారం స్థానిక డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో నోడల్‌ అధికారులతో కౌంటింగ్‌ ప్రక్రియపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో నోడల్‌ అధికారులే కీలకమని తెలిపారు. ఈ నెల 22న ఎస్కార్ట్‌తో పోస్టల్‌ బ్యాలెట్లను కౌంటింగ్‌ కేంద్రాలకు తరలించనున్నట్లు చెప్పారు.

అదే రోజు మధ్యాహ్నం విధులు కేటాయించిన సిబ్బంది జిల్లా కేంద్రానికి చేరుకోవాలన్నారు. దీంతో 23న ఉదయమే కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకోవచ్చని సూచించారు. అసెంబ్లీ పరిధిలోని పార్లమెంట్‌ ఓట్ల లెక్కింపు స్థల ప్రభావంతో 14టేబుల్స్‌పై జరుగుతుందన్నారు. ఇందులో డేటా ఎంట్రీ ఎక్సెల్‌ షీట్‌ నోడల్‌ అధికారులు టేబుల్‌ వారీగా వచ్చిన ఫలితాలను నమోదు చేస్తారని తెలిపారు. ఎక్సెల్‌ ఫార్ములా కీలకం అని అప్రమత్తంగా వుండాలని సూచించారు.

స్ట్రాంగ్‌ రూమ్‌ అధికారులు, రో ఆఫీసర్లు, ఈవీఎమ్‌ల నోడల్‌ అధికారులు తమ విధుల నిర్వహణలో జాగ్రత్త వహించాలన్నారు. త్వరలో జరిగే శిక్షణా తరగతులకు అందరూ తప్పక హాజరుకావాలని సూచించారు. ఈ సమావేశంలో నగరపాలక అసిస్టెంట్‌ కమిషనర్‌ హరిత, ఏఆర్వో శ్రీనివాసులు, కౌంటింగ్‌ విధులకు హాజరయ్యే నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement