ro
-
నేర చరితులు ఏజెంట్లుగా అనర్హులు
తిరుపతి అన్నమయ్య సర్కిల్: నేరచరిత్ర గల వ్యక్తులను ఏజెంట్లుగా నియమించవద్దని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వో, మున్సిపల్ కమిషనర్ వి.విజయరామరాజు తెలిపారు. స్థానిక తిరుపతి అర్బన్ మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం బరిలో వున్న అభ్యర్థులు, జనరల్ ఏజెంట్లతో కౌంటింగ్ ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తిరుపతి అసెంబ్లీ బరిలో వున్న అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్ల జాబితాను అందించి పాసులు పొందాలన్నారు. అదేవిధంగా ఎంపికైన ఏజెంట్లు రెండు అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలు, ఐడీ కార్డుతో ఈ నెల 23న ఉదయం 6గంటలకు చిత్తూరులోని ఆర్వీఎస్ నగర్, ఎస్వీసెట్ కళాశాల కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఎటువంటి నేరచరిత్ర లేనివారిని మాత్రమే ఏజెంట్లుగా నియమించాలని సూచించారు. అభ్యర్థులు అందించిన ఏజెంట్ల వివరాలను ఎస్పీ పరిశీలించనున్నట్లు తెలిపారు. తిరుపతి నియోజకవర్గంలో 261 పోలింగ్ కేంద్రాలు ఉన్నందున కౌంటింగ్ ప్రక్రియ కోసం 20టేబుల్స్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దీంతో పాటు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం మరో 2 టేబుల్స్ అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద సమస్యలు వుంటే ఆర్వోకు తెలపాలని సూచించారు. క్రమశిక్షణ పాటించాలని లేనిపక్షంలో కౌంటింగ్ కేంద్రాలనుంచి బయటకు పంపిస్తామని హెచ్చరించారు. కౌంటింగ్ రోజున ఉదయం 7గంటలకు అబ్జర్వర్, ఆర్వో, బరిలో వున్న అభ్యర్థుల సమక్ష్యంలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌ను తెరవడం జరుగుతుందన్నారు. అనంతరం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, 8.30గంటల నుంచి కంట్రోల్ యూనిట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. కంట్రోల్ యూనిట్ల లెక్కింపు పూరైన తర్వాత అబ్జర్వర్ రాండమైజేషన్‌తో 5వీవీ ప్యాట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఒక్కో వీవీ ప్యాట్ లెక్కింపునకు 45 నిమిషాలు సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో తిరుపతి ఏఆర్వో, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసులు, బరిలో వున్న వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, పార్టీల ఏజెంట్లు పాల్గొన్నారు. కౌంటింగ్ విధుల్లో అప్రమత్తంగా ఉండాలి సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ విధుల్లో నోడల్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తిరుపతి అసెంబ్లీ ఆర్వో, నగర పాలక కమిషనర్ వి విజయరామరాజు సూచించారు. గురువారం స్థానిక డీఆర్డీఏ సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో కౌంటింగ్ ప్రక్రియపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో నోడల్ అధికారులే కీలకమని తెలిపారు. ఈ నెల 22న ఎస్కార్ట్‌తో పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించనున్నట్లు చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం విధులు కేటాయించిన సిబ్బంది జిల్లా కేంద్రానికి చేరుకోవాలన్నారు. దీంతో 23న ఉదయమే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవచ్చని సూచించారు. అసెంబ్లీ పరిధిలోని పార్లమెంట్ ఓట్ల లెక్కింపు స్థల ప్రభావంతో 14టేబుల్స్‌పై జరుగుతుందన్నారు. ఇందులో డేటా ఎంట్రీ ఎక్సెల్ షీట్ నోడల్ అధికారులు టేబుల్ వారీగా వచ్చిన ఫలితాలను నమోదు చేస్తారని తెలిపారు. ఎక్సెల్ ఫార్ములా కీలకం అని అప్రమత్తంగా వుండాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ అధికారులు, రో ఆఫీసర్లు, ఈవీఎమ్‌ల నోడల్ అధికారులు తమ విధుల నిర్వహణలో జాగ్రత్త వహించాలన్నారు. త్వరలో జరిగే శిక్షణా తరగతులకు అందరూ తప్పక హాజరుకావాలని సూచించారు. ఈ సమావేశంలో నగరపాలక అసిస్టెంట్ కమిషనర్ హరిత, ఏఆర్వో శ్రీనివాసులు, కౌంటింగ్ విధులకు హాజరయ్యే నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
12మంది ఉద్యోగులపై ఈసీ క్రమశిక్షణ చర్యలు
-
12మంది ఉద్యోగులపై ఈసీ క్రమశిక్షణ చర్యలు
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన 12 మంది ఉద్యోగులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. విశాఖపట్నం జిల్లా మండపేట, నెల్లూరు జిల్లా కోవూరు, సుళ్లురుపేట, నూజీవీడుల ఆర్వో, ఏఆర్వోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకుగాను అభియోగాల నమోదుతో పాటు, శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. కాగా, ఇప్పటికే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్వో, ఏఆర్వోలపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా మరికొంత మంది అధికారులపై కూడా ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి,మిర్యాలగూడ టౌన్ : అసెంబ్లీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నామని ఆర్డీఓ జగన్నాథరావు పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని ఖమ్మం రోడ్డులో గల గాంధీపార్క్ స్కూల్ వద్ద, సుందర్‌నగర్, చర్చి రోడ్డు ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద బారీ కేడ్ల ఏర్పాటుతో పాటు ఆర్అండ్బీ అథితి గృహలోని వసతులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద గల వసతులను ఆర్‌ఆండ్‌బీ, పోలీస్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉన్నందున రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం నుంచి వంద మీటర్ల వరకు భారీ కేడ్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 12వ తేదీన 11గంటల నుంచి నామినేషన్లు వేసేందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు వస్తుంటారని, వంద మీటర్ల దాటిన తరువాతనే వాహనాలతో పాటు పార్టీల కార్యకర్తలను నిలుపుదల చేయాల్సి ఉంటుందన్నారు. కాగా ఖమ్మం రోడ్డులో నుంచి వెళ్లే వాహనాలను దారిమళ్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 19వ తేదీ వరకు వంద మీటర్ల దూరం ఆర్ఓ ఆధీనంలో ఉంటుందన్నారు. నామినేషన్ల సమయంలో నామినేషన్ వేసే అభ్యర్థితో కలిపి ఐదుగురు వ్యక్తులకు మాత్రమే ఆర్ఓ కార్యాలయానికి అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. అదే విధంగా ఆర్అండ్బీ అతిథి గృహం ఎన్నికలు ముగిసే వరకు తమ ఆధీనంలో ఉంటున్నందున ఆర్అండ్బీ అధికారులు అన్ని వసతులను ఏర్పాటు చేయాలని కోరారు. అదే విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా బారీ కేడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఆయన వెంట ఆర్అండ్బీ డీఈ నరేందర్‌రెడ్డి, వన్ టౌన్ సీఐ సదా నాగరాజు, ఆర్అండ్బీ ఏఈ రాజశేఖర్, ఆర్ఐ మహేందర్‌రెడ్డి, డివిజనల్ సర్వేయర్ బాలాజీనాయక్ ఉన్నారు. -
ఆర్వోల ద్వారా నోటీసులు
అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలించిన వ్యయ పరిశీలకులు ప్రకాశ్ కారంత్ విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ఎన్నికల్లో అభ్యర్థులు చేస్తున్న వ్యయానికి సరిగ్గా లెక్కలు చెప్పాలని లేని వారికి ఆర్వోల ద్వారా నోటీసులు ఇవ్వాలని సహాయ పరిశీలకులకు వ్యయ పరిశీలకుడు ప్రకాశ్ కారంత్ సూచించారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ స్థానానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని, నమోదైన రిజిస్టర్లను విజయనగరం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్సు హాలులో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల కోసం పలు రాజకీయ పక్షాలు పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటనలకు, సమావేశాలకు ఖర్చు చేసిన వ్యయంపై పార్టీల వారీగా, అభ్యర్థుల వారీగా స్పష్టంగా ఉండాలన్నారు. అభ్యర్థులు చెప్పిన లెక్కలకు, వ్యయ పరిశీలకులు నమోదు చేసిన లెక్కలకు తేడాలుండడంతో పరిశీలకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీల ప్రతినిధులు తక్కువగా చూపుతున్నట్టుగా భావించి ఆయా ప్రతినిధులకు ఆర్వోల ద్వారా నోటీసులు జారీ చేయాలని సూచించారు. అభ్యర్థుల సమావేశాలు, సభలు, ర్యాలీలు, పత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్, ప్రకటనలను ఎన్నికల కమిషన్ సూచించిన ధరలకే నిర్ణయించాలన్నారు. వీడియో సర్వెలెన్సు బృందాలు నిత్యం తిరుగుతునే ఉండాలన్నారు. అభ్యర్థుల కార్యక్రమాలపై గట్టి నిఘా ఉంచాలన్నారు. సహాయ పరిశీలకులు షాడో రిజిస్టర్లో ప్రతి సంఘటననూ ఖర్చుతో సహా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో అకౌంటింగ్ టీములు, విజయనగరం నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు, ఇండిపెండెంటు అభ్యర్థులు పాల్గొన్నారు.