అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలించిన వ్యయ పరిశీలకులు ప్రకాశ్ కారంత్
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ఎన్నికల్లో అభ్యర్థులు చేస్తున్న వ్యయానికి సరిగ్గా లెక్కలు చెప్పాలని లేని వారికి ఆర్వోల ద్వారా నోటీసులు ఇవ్వాలని సహాయ పరిశీలకులకు వ్యయ పరిశీలకుడు ప్రకాశ్ కారంత్ సూచించారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ స్థానానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని, నమోదైన రిజిస్టర్లను విజయనగరం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్సు హాలులో పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల కోసం పలు రాజకీయ పక్షాలు పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటనలకు, సమావేశాలకు ఖర్చు చేసిన వ్యయంపై పార్టీల వారీగా, అభ్యర్థుల వారీగా స్పష్టంగా ఉండాలన్నారు. అభ్యర్థులు చెప్పిన లెక్కలకు, వ్యయ పరిశీలకులు నమోదు చేసిన లెక్కలకు తేడాలుండడంతో పరిశీలకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీల ప్రతినిధులు తక్కువగా చూపుతున్నట్టుగా భావించి ఆయా ప్రతినిధులకు ఆర్వోల ద్వారా నోటీసులు జారీ చేయాలని సూచించారు. అభ్యర్థుల సమావేశాలు, సభలు, ర్యాలీలు, పత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్, ప్రకటనలను ఎన్నికల కమిషన్ సూచించిన ధరలకే నిర్ణయించాలన్నారు. వీడియో సర్వెలెన్సు బృందాలు నిత్యం తిరుగుతునే ఉండాలన్నారు. అభ్యర్థుల కార్యక్రమాలపై గట్టి నిఘా ఉంచాలన్నారు.
సహాయ పరిశీలకులు షాడో రిజిస్టర్‌లో ప్రతి సంఘటననూ ఖర్చుతో సహా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో అకౌంటింగ్ టీములు, విజయనగరం నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు, ఇండిపెండెంటు అభ్యర్థులు పాల్గొన్నారు.
ఆర్వోల ద్వారా నోటీసులు
Published Sat, Apr 26 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 6:31 AM
Advertisement