చెప్పినట్టు వినాల్సిందే! | do what i say | Sakshi
Sakshi News home page

చెప్పినట్టు వినాల్సిందే!

Published Mon, Mar 2 2015 2:49 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

do what i say

అనంతపురం సెంట్రల్ : అధికారం ఉందన్న అహంతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తాము చెప్పినట్లు వినాల్సిందేనంటూ అధికారులకు ఆర్డర్లు వేస్తున్నారు. వినడానికి ఇష్టం లేకపోతే వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. వీరి వైఖరి వల్ల అధికారులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మరీ ముఖ్యంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (ఎంపీడీఓలు) టీడీపీ నాయకులు, కార్యకర్తల నుంచి తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు.
 
  వీటిని తాళలేక పలువురు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోతున్నారు. మూడు, నాలుగేళ్లు సర్వీసు ఉండే ఎంపీడీఓలైతే ఇప్పుడే స్వచ్ఛంద ఉద్యోగ  విరమణ (వీఆర్‌ఎస్) చేస్తామని ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. రాజకీయ నేతల నుంచి రక్షణ కల్పించాల్సిన జిల్లా ఉన్నతాధికారులు చేష్టలుడిగి చూస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ నేతలు అప్పట్లో తాము కోల్పోయిన ఆదాయాన్ని ఈ ఏడాదిలోనే తిరిగి సంపాదించుకోవాలనే తపనతో ఉన్నారు. ఈ క్రమంలో వారి మధ్యే గ్రూపు తగాదాలు ఏర్పడుతున్నాయి. గ్రూపుల మధ్యలో ఎంపీడీఓలు నలిగిపోతున్నారు. నేతలు చెబుతున్న అడ్డమైన పనులు చేయలేక కొందరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోతున్నారు.
 
 మరికొందరు ఈ ఉద్యోగమే వద్దురా బాబూ అంటూ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్)కు సిద్ధమవుతున్నారు. ఇదే కోవలో శింగనమల ఎంపీడీఓ లలితకుమారి వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇసుక మాఫియా వేధింపుల నుంచి తనను రక్షించాలని ఆమె పలుమార్లు జెడ్పీ సీఈఓ రామచంద్రకు విన్నవించుకున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో వీఆర్‌ఎస్‌కు సిద్ధమయ్యారు. ప్రస్తుతం శింగనమల ఎంపీడీఓగా అక్కడే పనిచేస్తున్న ఈఓఆర్‌డీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. కూడేరు ఎంపీడీఓ నాగన్న కూడా స్థానిక టీడీపీ నాయకులతో ఇమడలేక పుట్లూరు మండలానికి బదిలీ చేయించుకున్నారు.
 
  కానీ కూడేరు ఎంపీడీఓగా పనిచేయడానికి ఎవరూ సాహసించడం లేదు. అక్కడే ఉన్న ఈఓఆర్‌డీని బతిమాలినా ముందుకు రాలేదు. దీంతో ఆత్మకూరు ఈఓఆర్‌డీ దివాకర్‌బాబుకు బలవంతంగా బాధ్యతలు కట్టబెట్టారు. ఆయన్ను స్వయాన జెడ్పీ డిప్యూటీ సీఈఓ తన వాహనంలో తీసుకెళ్లి.. ‘నీకు నేనున్నా. ఏమైనా కష్టమొస్తే నా వద్దకు రా..’అని భరోసా ఇచ్చి బలవంతంగా బాధ్యతలు తీసుకునేలా చేశారు. చెన్నేకొత్తపల్లి ఎంపీడీఓ మంజునాథరావు ఇప్పటికే సెలవుపై వెళ్లిపోయారు. కొత్తచెరువు ఎంపీడీఓ అమృతవాణి కూడా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. శెట్టూరు ఎంపీడీఓ కమలమ్మ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రొద్దం ఎంపీడీఓ సోనీబాయి తమకు వద్దంటూ స్థానిక ప్రజాప్రతినిధులు జెడ్పీ చైర్మన్ చమన్‌కు ఫిర్యాదు చేశారు.
 
 దీంతో త్వరలో సెలవుపై వెళ్లేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదేబాటలో రాయదుర్గం ఎంపీడీఓ కూడా ఉన్నారు. జిల్లాలోని మెజార్టీ మండలాల్లో ఇదే పరిస్థితి ఉందని అధికారులు వాపోతున్నారు. తమ సర్వీసులో ఇలాంటి పాలనను ఎప్పుడూ చూడలేదని వారంటున్నారు. ఈ ఐదేళ్లు తమకు ఎదురులేదనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు ఎంతకైనా తెగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారి నుంచి ఎంపీడీఓలకు రక్షణ కల్పించాల్సిన జిల్లా ఉన్నతాధికారులు గానీ, అసోసియేషన్ నాయకులు గానీ ఇంతవరకూ స్పందించిన పాపానపోలేదు.
 
 ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాల్సిందే
 ప్రజాప్రతినిధులకు ఎంపీడీఓలు గౌరవం ఇవ్వాల్సిందే. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలని ఎవరైనా ఒత్తిడి తెస్తే త న దృష్టికి తేవాలని స్వయాన చైర్మన్ చ మన్ సూచించారు.  ఇన్నాళ్లూ స్పెషలాఫీసర్ల పాలన ఉండేది. ఇప్పుడు  మండల పరిషత్‌లకు కార్యవర్గాలు ఏర్పడడంతో సమన్వయం చేసుకోలేక కొందరు ఎంపీడీఓలు ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగానే కొంతమంది దీర్ఘకాలిక సెలవుపై వెళుతున్నారు. మరికొందరు వయోభారంతో ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకుంటున్నారు.
 - రామచంద్ర, సీఈఓ, జిల్లా పరిషత్  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement