అమ్మలకు భరోసా ! | Doctor uppada swarajya lakshmi WITH VIP Reporter | Sakshi
Sakshi News home page

అమ్మలకు భరోసా !

Published Sun, Dec 28 2014 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

అమ్మలకు భరోసా !

అమ్మలకు భరోసా !

  నిత్యం అక్కడ సమస్యలు రాజ్యమేలుతాయి...కనీస సౌకర్యాలు లేక గర్భిణులు, బాలింతల ఆక్రందనల ఘోష అక్కడ ప్రతిధ్వనిస్తుంది. ప్రసవం కోసం వెళ్లిన గర్భిణి అక్కడి నుంచి శిశువుతో క్షేమంగా ఇంటికి చేరుకుంటుందన్న భరోసా లేదు. నవమాసాలు మోసి, శిశువులకు జన్మనిచ్చిన ముగ్గురు తల్లులు... బిడ్డల ఎడబాటుతో నరకయాతన అనుభవించారు. ఆస్పత్రి నుంచి ముగ్గురు పిల్లలు మాయమవగా ‘సాక్షి’ చొరవతో ఒక బిడ్డ తిరిగి తల్లిచెంతకు చేరింది. మిగతా ఇద్దరు తల్లులూ గర్భశోకాన్ని అనుభవిస్తున్నారు. పడకలు చాలకపోవడంతో ఒకే  మంచంపై చిరిగిన పరుపులపై ఇద్దరేసి చొప్పున చికిత్స పొందే దుస్థితి ఉంది. గర్భిణులకు పూర్తిస్థాయిలో భోజనం అందడంలేదు.   వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వారిని మరింత మానసిక క్షోభకు గురిచేస్తోంది.  ఇలా ఎన్నో సమస్యలు ఆ దవాఖానాలో రోగులపై దండెత్తుతున్నాయి.   ఘోషా ఆస్పత్రిలో ఉన్న సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి  డాక్టర్ ఉప్పాడ స్వరాజ్యలక్ష్మి ‘సాక్షి’ తరఫున వీఐపీ  రిపోర్టర్‌గా మారారు. ఆస్పత్రిలోని ఓపీ విభాగాలు, పలు వార్డుల్లో   కలియ తిరిగి  గర్భిణులు, బాలింతలు, వారికి సహాయం చేసేందుకు వచ్చినవారితో  మాట్లాడి,  సమస్యలు పరిష్కరిస్తానని, మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
 
 గర్భిణులు,బాలింతలు, వైద్యులతో డీఎంహెచ్‌ఓ సంభాణ ఇలా సాగింది.
 డీఎంహెచ్‌ఓ: అమ్మా  నాపేరు ఉప్పాడ స్వరాజ్యలక్ష్మి. నేను   డీఎంహెచ్‌ఓగా విధులు నిర్వహిస్తున్నాను, మీసమస్యలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ తరఫున వీఐపీ   రిపోర్టర్‌గా మీదగ్గరకు వచ్చాను. నీపేరేంటి , ఎక్కడనుంచి వచ్చావు?
 గర్భిణి జ్యోతి: అమ్మా నాపేరు జ్యోతి. మాది బొండపల్లి గ్రామం. తనిఖీకోసం వచ్చాను.
 డీఎంహెచ్‌ఓ: మీ దగ్గరలో ఆస్పత్రి ఉంది కదా... అక్కడ  తనిఖీలు చేయడం లేదా?
 జ్యోతి: అక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ పెద్ద డాక్టర్లు ఉంటారని వచ్చాను.
 డీఎంహెచ్‌ఓ: మీకు దగ్గరలో ఏ ఆస్పత్రి ఉంది. సేవలు బాగా అందిస్తున్నారా?
 జ్యోతి: మాకు దగ్గరలో బొండపల్లి పీహెచ్‌సీ ఉంది. అక్కడబాగానే వైద్య సేవలు అందిస్తున్నారు.
 డీఎంహెచ్‌ఓ: డాక్టర్ గారు మీపేరేంటి,  రోజుకు ఎంతమంది గర్భిణులను పరీక్షిస్తున్నారు?
 డాక్టర్ : మేడమ్ నాపేరు  సుధ. రోజుకు 50 మంది వరకు గర్భిణులను పరీక్షిస్తున్నాను.
 డీఎంహెచ్‌ఓ : అందరికీ మీరు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించగలుగుతున్నావా, లేక  అదనంగా ఇంకో వైద్యురాలు కావాలా?
 డాక్టర్ సుధ: మేడమ్  నాతోపాటు , ఇంకో వైద్యురాలు సహాయంగా ఉంటే గర్భిణులకు ఇంకా మెరుగైన సేవలు అందించగలం.
 డీఎంహెచ్‌ఓ: కౌన్సిలర్ గారు మీపేరేంటి, రోజుకు ఎంతమందికి  కౌన్సెలింగ్ చేస్తున్నారు
 కౌన్సెలర్ గోపాల్‌రావు: మేడమ్ నా పేరు గోపాల్‌రావు. రోజుకు 30 నుంచి 40 మంది వరకు హెచ్‌ఐవీపై కౌన్సెలింగ్ ఇస్తున్నాను.
 డీఎంహెచ్‌ఓ:   ఏప్రిల్ నెల నుంచి ఎంత మంది హెచ్‌ఐవీ గర్భిణులు ప్రసవించారు.
 గోపాల్‌రావు: మేడమ్ ఏప్రిల్ నుంచి ఇంతవరకు 23 మంది హెచ్‌ఐవీ గర్భిణుల  ప్రసవాలు జరిగాయి
 డీఎంహెచ్‌ఓ : బిడ్డకు ఎన్ని సంవత్సరాలలో లోపు హెచ్‌ఐవీ ఉందని నిర్ధారిస్తున్నారు?
 గోపాల్‌రావు:  18 నెలలు వయస్సు వచ్చినప్పుడు బిడ్డనుంచి శాంపిల్ తీసి నిర్ధారణకోసం ముంబైకి  పంపిస్తాం
 డీఎంహెచ్‌ఓ: డాక్టర్ గారు మీపేరేంటి, రోజుకు ఎంతమందిరోగులు సుఖవ్యాధులతో వస్తున్నారు?
 డాక్టర్ : మేడమ్ నాపేరు మీసాల వేణుగోపాల్. రోజుకు 10 నుంచి 15 మంది వరకు సుఖవ్యాధి,  సంబంధిత ఇతర వ్యాధులతో వస్తున్నారు.
 డీఎంహెచ్‌ఓ: సూపరింటెండెంట్ గారు  ఆస్పత్రిలో సౌకర్యాలు ఏవిధంగా ఉన్నాయి?
 సూపరింటెండెంట్ రవిచంద్ర: మేడమ్   ఆస్పత్రిలో ప్రస్తుతం 100 పడకలు ఉన్నాయి. ప్రస్తుతం ఆస్పత్రి మేడపైన150 పడకలు గైనిక్ బ్లాక్  నిర్మాణంలో ఉంది. ఒకటిరెండు  నెలల్లో పూర్తి కానుంది. గైనక్ బ్లాక్ అందుబాటులోకి వస్తే మొత్తం 250 పడకలు ఏర్పాటవుతాయి. అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు
 డీఎంహెచ్‌ఓ: రోగులను వేరే ఆస్పత్రి ఎక్కువగా రిఫర్ చేస్తున్నారటా...   నిజమేనా?
 సూపరింటెండెంట్  : అత్యవసరమనుకుంటేనే  రిఫర్ చేస్తున్నాం. లేదంటే చేయడం లేదు
 డీఎంహెచ్‌ఓ: ఏమ్మా...నీపేరేంటి,  ఇక్కడకు  ఎందుకు వచ్చావు, నీచేతిలో ఉన్నది పాపా ? ... బాబా?
 బాలింత తల్లి బంగారమ్మ: అమ్మ  నాపేరు బంగారమ్మ. మాది జొన్నవలస. మా పాప కాన్పు కోసం ఇక్కడకు  తీసుకువచ్చాను. పాప పుట్టింది.
 డీఎంహెచ్‌ఓ:  ఇక్కడ బాగానే చూస్తున్నారా? మందులు ఏవైనా కొనుగోలు చేశారా?
 బంగారమ్మ: బాగానే చూస్తున్నారమ్మా, మందులు కొనమని చెప్పలేదు.
 డీఎంహెచ్‌ఓ: 108 వాహనంలో వచ్చారా, ఆటోలో వచ్చావా?
 బంగారమ్మ: ఆటోలో వచ్చానమ్మ
 డీఎంహెచ్‌ఓ:108 వస్తుందని తెలియదా, ఎవరూ చెప్పలేదా?
 బంగారమ్మ: నాకు ఏవరూ చెప్పలేదు తల్లి, నా అల్లుడి తమ్ముడికి ఆటో ఉంటే, ఆ ఆటో పట్టుకుని వచ్చాం.
 డీఎంహెచ్‌ఓ: మీ పాపకు బ్యాంకు ఖాతా ఉందా?
 బంగారమ్మ:  లేదమ్మా
 డీఎంహెచ్‌ఓ :  ఏమ్మా నీపేరేంటి,   మీదేఊరు ?
 గర్భిణి ఆదిలక్ష్మి: మేడమ్‌గారు నాపేరు ఆదిలక్ష్మి . మాది సాలూరు. తనిఖీచేయించుకోవడానికి వచ్చాను.
 డీఎంహెచ్‌ఓ: సాలూరులో సీహెచ్‌సీ ఉంది కదా, ఇంత దూరం నుంచి ఎందుకు వచ్చావు?
 ఆదిలక్ష్మి: అక్కడ  ఆపరేషన్ చేయాలంటే ఇక్కడకే రిఫర్‌చేస్తారు. ఆ సమయంలో  సకాలంలో రాలేంకదా మేడమ్. అందుకే ఏ ఇబ్బంది ఉండదని,  ఇక్కడ  తనిఖీ చేయించుకోవడానికి వచ్చాను.
 డీఎంహెచ్‌ఓ : ఏమ్మా ఈ రోజు గర్భిణులకు ఏ ఆహారం ఇచ్చారు,  నీపేరేంటి?
 డైట్ సూపర్‌వైజర్: మేడమ్ గారు నాపేరు లక్ష్మి. గర్భిణులకు అన్నం, పప్పు, సాంబారు, అరటి పండు ఇచ్చాం.
 డీఎంహెచ్‌ఓ: ఏమ్మా...   ఆస్పత్రిలో మీకు సంబంధించిన వారెవరున్నారు ?
 గర్భిణి తల్లి అన్నపూర్ణ: అమ్మా నాపేరు అన్నపూర్ణ. మా అమ్మాయికి ఆస్పత్రిలో ప్రసవం అయింది.
 డీఎంహెచ్‌ఓ: మీ అమ్మాయికి ఇక్కడ ఇచ్చిన భోజనం పెడుతున్నావా. ఇంటి నుంచి తెచ్చిన భోజనం పెడుతున్నావా?
 అన్నపూర్ణ:  ఇంటినుంచి తెచ్చిన తోట కూర అన్నం పెట్టాను.
 డీఎంహెచ్‌ఓ: ఇక్కడ పప్పువంటి  మంచి ఆహారం ఇస్తారు కదా?
 అన్నపూర్ణ: పప్పు తినకూడదు కదమ్మా...  అందుకే పెట్టడం లేదు
 డీఎంహెచ్‌ఓ: ఎవరన్నారు పప్పు తినకూడదని?
 అన్నపూర్ణ: ఇక్కడ వాళ్లే అన్నారమ్మా.
 డీఎంహెచ్‌ఓ: పప్పు తినవచ్చు. పప్పు తింటే కంటే తల్లి పాలు ఇవ్వగలదు.
 డీఎంహెచ్‌ఓ:  ఏమ్మా నీపేరేంటి, ఏ గ్రామం నుంచి వచ్చావు?
 బాలింత శ్రీవాణి: మేడమ్‌గారు నాపేరు శ్రీవాణి, మాది దేవుపల్లి గ్రామం.
 డీఎంహెచ్‌ఓ: నీకు బ్యాంకు ఖాతా ఉందా?
 బాలింతశ్రీవాణి: లేదు మేడమ్.
 డీఎంహెచ్‌ఓ: డాక్టర్ , నర్సులు బాగా చూస్తున్నారా?
 శ్రీవాణి: బాగానేచూస్తున్నారు.
 డీఎంహెచ్‌ఓ: డాక్టర్ గారు మీపేరేంటి, ఎంతమందిపిల్లలకు ఎస్‌ఎన్‌సీయూలో చికిత్స పొందుతున్నారు?
 డాక్టర్ : మేడమ్ నాపేరు సుజాత. ఎస్‌ఎన్‌సీయూలో  16 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు.
 డీఎంహెచ్‌ఓ: ఎక్కువుగా ఏ వ్యాధితో వస్తున్నారు?
 డాక్టర్ సుజాత:  బరువు తక్కువతో పుట్టిన పిల్లలు  ఎక్కువగా వస్తున్నారు మేడమ్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement