ఎంజీఎంలో ఓపీ నమోదు కోసం బారులుదీరిన రోగులు
సాక్షి, వరంగల్: ‘ఎంజీఎంల మంచిగ సూత్తరట’ అని ఎవరో అంటూంటే విని వచ్చాడు భీంరావు. అతడిది కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ గ్రామం. 8:20కి బస్సు దిగాడు. త్వరత్వరగా వెళ్లి ఓపీ దగ్గర పేరు రాయించుకునేందుకు లైన్‌లో నిల్చున్నాడు. అప్పటికే తనకంటే ముందు ఓ పదిమంది లైన్‌లో ఉన్నారు. ఓ వైపు తీవ్రమైన కడుపునొప్పి. అరగంట దాటింది. ‘ఓ డాక్టరమ్మ.. చిట్టీలిచ్చే సార్లు ఎప్పుడత్తరు’ అని అడిగాడు భీంరావు. ‘వస్తారు’ అని సమాధానమిచ్చింది నర్సు.
అలా దాదాపు మరో గంట గడిచింది. సరిగ్గా పదింటికి వచ్చారు ఓపీ చిట్టీలు ఇచ్చే కంప్యూటర్ ఆపరేటర్లు. కంప్యూటర్లు ఆన్ చేసి, అందులో పనిచేసే వాళ్లకు తెలిసిన వాళ్లకు, వెనుకవైపు కిటికీ నుంచి ఇంకా బాగా తెలిసిన వాళ్లకు.. ఇలా భీంరావు వంతు వచ్చే సరికి అరగంట పట్టింది. అప్పటికి క్యూలైన్ మరింత పెరిగింది. ఓపీ చిట్టీ అందుకొని డాక్టర్ రూమెక్కడమ్మా.. అని అడుగుకుంటూ పరిగెట్టాడు భీంరావు. ఇలా ఒక్క భీంరావు మాత్రమే కాదు. ఎంతోమంది నిత్యం ఓపీ చిట్టీల దగ్గర ఎదురుచూడాల్సిందే!
నిత్యం వేలాది మంది ఎంజీఎం ఆస్పత్రికి వస్తుంటారు. అంత మంచి పేరున్న ఆస్పత్రిలో కొందరి కారణంగా రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొంతమంది సిబ్బంది నెల రోజులుగా సమయపాలన పాటించకపోవడం వల్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రతీ సోమ, మంగళ, బుధవారాల్లో రోగులు కొన్ని సందర్భాల్లో వైద్యులను కూడా కలవకుండానే వెనుదిరుగుతున్నారు.
ఒకవేళ కలిసినా స్కానింగ్, రక్త, మూత్ర పరీక్షలు చేయాల్సి ఉంటే సమయం సరిపోక మరో రోజు తిరిగి ఆసుపత్రికి వస్తున్నారు. లేదంటే తెలిసిన వారింట్లో, బంధువుల ఇంట్లో తలదాచుకొని తెల్లవారి వస్తున్నారు. అసలే మళ్లీ కరోనా వేరియంట్ రూపు మార్చుకుంది. ఇక్కడ సోషల్ డిస్టెన్స్ మాట అటుంచితే సమయానికి వైద్యున్ని కలిసే అవకాశం కూడా దొరకట్లేదు.
రోగులకు ఇక్కట్లు..
రోగులకు సమయానుకూలంగా సేవలందించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా కనబడుతోంది. సోమవారం రూమ్ నంబర్ 3 (ఓపీ చిట్టిలు ఇచ్చే విభా గం) నుంచి అర కిలో మీటరు మేర రెండు క్యూ లైన్లు ఉండడాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. దీనికి కారణం ఏంటని వివరాలు ఆరా తీయడంతో కంప్యూటర్ అపరేటర్లు ఆలస్యంగా వస్తున్నారని తెలిసింది.
దీంతో పాటు రోగులను పరీక్షించాల్సిన ప్రత్యేక డాక్టర్ల స్థానంలో చాలామంది పీజీ వైద్యులే ఉన్నారు. చాలా మంది వైద్యులు తమ సొంత క్లినిక్‌లపై దృష్టి సారించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడుతోందని ఆసుపత్రి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇటు కంప్యూటర్ ఆపరేటర్లు, అటు వైద్యుల సమయపాలన లేమితో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
నిలబడలేక మరింత నడుంనొప్పి
మామూనూరు క్యాంప్ సమీపంలోని జక్కలోది నుంచి ఆసుపత్రికి వచ్చా. గత సోమవారం వచ్చినప్పటికీ భారీ క్యూలైన్ ఉండడంతో నిల్చోలేక అవస్థలు పడ్డా. ఈ సోమవారం కూడా అదే పరిస్థితి కనిపించింది. నడుం నొప్పి విపరీతంగా ఉండడంతో చూపించుకునేందుకు వచ్చా. ఇంకా నా చేతికి ఓపీ చిట్టి రాలేదు. క్యూలైన్ ఉండడంతో ఇంకా మరింత నడుంనొప్పి కలుగుతోంది. – వరమ్మ, జక్కలోది గ్రామం
70 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చా..
దాదాపు 70 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చా. కీళ్ల నొప్పులు ఉండడంతో వైద్యుడితో పరీక్షించుకునేందుకు వచ్చా. ఉదయం ఎనిమిది గంటలకే చేరుకున్నా అప్పటికే లైన్ పెద్దగా ఉంది. 8.30కు రావాల్సిన కంప్యూటర్ ఆపరేటర్లు రాకపోవడంతో గంటన్నరపాటు లైన్‌లోనే నిల్చోవాల్సిన పరిస్థితి ఎదురైంది. బాగా కాళ్లు గుంజినై.
– బక్కయ్య, దంతాలపల్లి మండలం, బొడ్డలడ గ్రామం
Comments
Please login to add a commentAdd a comment