సాక్షి, వరంగల్: అతిపెద్ద ప్రభుత్వాసుపత్రిగా పేరున్న ఎంజీఎంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియజేసే మరో ఘటన వైరల్ అవుతోంది. వృద్ధురాలైన ఓ పేషెంట్ పట్ల నిర్లక్ష్యంగా సమాధానాలిచ్చిన ఆస్పత్రి సిబ్బంది.. ఆపై కర్కశకంగా వ్యవహరించారు. కనీసం స్ట్రెచర్ కూడా ఇవ్వకపోవడంతో ఆమె భర్తే భుజాన వేసుకుని మోసుకెళ్లాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన లక్ష్మి అనే వృద్ధురాలికి నెల కిందట ఎంజీఎం డాక్టర్లు ఆపరేషన్ చేసి అరిపాదం తొలగించారు. నెల తర్వాత లక్ష్మిని చెకప్ కోసం ఆస్పత్రికి తీసుకొచ్చారు ఆమె భర్త. అయితే పెద్దసారు(కన్సల్ట్ డాక్టర్) లేరని, రేపు రావాలంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. బయటకు వెళ్లేందుకు కనీసం స్ట్రెచర్ అయినా ఇవ్వాలని ఆయన కోరగా.. సిబ్బంది అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో లక్ష్మిని ఇలా ఆమె భర్త భుజాలపైకి ఎక్కించుకుని బయటకు తీసుకొచ్చారు.
అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీయడం, వాట్సాప్ తదితర సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేడయంతో వైరల్ అయ్యింది. గతంలో ఇదే ఎంజీఎం ఆస్పత్రికి సంబంధించిన పలు వ్యవహారాలు వెలుగులోకి వచ్చి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసే ఉంటుంది. అయినా పేషెంట్లకు అందుతున్న ట్రీట్‌మెంట్ మాత్రం మెరుగుపడడం లేదన్న విమర్శ ఇప్పటికీ వినిపిస్తోంది.
ఇక ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ స్పందించారు. ‘‘ఎంజీఎంలో స్ట్రెచ్చర్‌ల కొరత లేదు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించ లేదు. ఎవరో కావాలని ఎంజీఎంను బద్నాం చేసేందుకే భుజాలపై పేషెంట్ ను తీసుకుపొమ్మని ఆ పెద్దాయనకు చెప్పి వీడియో ను వైరల్ చేశారు. వీడియో తీసి అతనిపై కేసు పెడతాం. ఒకవేళ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటాం అని తెలిపారాయన.
అయితే.. ఆ పెద్దాయన మాత్రం ఎండలో తన భార్యను అలా వదిలేశారని, సిబ్బందిని స్ట్రెచర్‌తో రమ్మంటే రాలేదని, అందుకే తానే మోసుకొచ్చానని స్పష్టంగా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment