సభలో మాట్లాడుతున్న డాక్టర్‌తిప్పేస్వామి
అనంతపురం, మడకశిర: రాబోవు ఎన్నికల్లో టీడీపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లడిగే అర్హత కోల్పోయారని మడకశిర ఎమ్మెల్యే,వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి అన్నారు. ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి గురువారం మడకశిరకు వచ్చారు. పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్‌ఆర్ సర్కిల్‌లో సభను ఏర్పాటు చేశారు. సభలో మాజీ మంత్రి హెచ్‌బీ నర్సేగౌడ్,మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈసభలో ఎమ్మెల్యే తిప్పేస్వామి మట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మడకశిర నియోజకవర్గంలో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లడగడానికి టీడీపీ నాయకులు సిగ్గుపడాలని అన్నారు. నియోజకవర్గంలోని రైతులకు హంద్రీనీవా ద్వారా సాగునీరు ఇవ్వకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని రైతుల భూములను లాక్కొని నిరుద్యోగులను మోసం చేశారన్నారు.
హంద్రీ–నీవా ద్వారా సాగునీటి సాధనకు కృషి
నియోజకవర్గానికి హంద్రీ–నీవా ద్వారా సాగునీటిని తీసుకురావడానికి కృషి చేస్తానని తిప్పేస్వామి తెలిపారు.స్థానిక ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ,కౌన్సిల్‌లో నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించకుండా నిద్ర పోయారని తెలిపారు. రాబోవు ఎన్నికల్లో మడకశిర నుంచి టీడీపీ పోటీలో ఉండదని, కాంగ్రెస్ మాత్రమే పోటీలో ఉంటుందన్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు కలసికట్టుగా కష్ట పడి పని చేయాలని కోరారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడానికి ప్రజలు ఉత్సాహంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యేగా తనకు తక్కువ సమయం ఉన్నా కష్ట పడి పని చేస్తానని తెలిపారు.
2019లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి
మాజీ మంత్రి హెచ్‌బీ నర్సేగౌడ్ మాట్లాడుతూ 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలని కోరారు. మడకశిరలో వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఘన విజయం సాధించాలన్నారు. టీడీపీ గత ఎన్నికల్లో సాగునీరు అందిస్తామని చెప్పి ఇంత వరకూ పట్టించుకోకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ దోపిడీ పార్టీ అని విమర్శించారు. ప్రస్తుతం ఉండేది ఎన్టీఆర్ టీడీపీ కాదన్నారు. చంద్రబాబు టీడీపీ అని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకూ న్యాయం జరుగుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రంగేగౌడ్, వాగేష్, డాక్టర్‌దేవరాజు, రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శులు బేకరీ నాగరాజు, శంకరగల్లు నాగన్న,సత్యనారాయణయాదవ్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శులు బరగూరప్ప, కృష్ణమూర్తి, రాష్ట్ర రైతువిభాగం కార్యదర్శులు బుళ్లసముద్రం రామిరెడ్డి, కరికెర జయరామ్, పట్టణ కన్వీనర్ రామకృష్ణ, మండల కన్వీనర్లు రామిరెడ్డి,డాక్టర్ శివప్రసాద్, మహేంద్ర పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment