ఒంగోలు సెంట్రల్: వైద్యుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం స్పందిండంలేదని వైద్యులు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం విధులు అయిపోయిన తర్వాత రిమ్స్ వద్ద నిరసన ప్రదర్శనను నిర్వహించారు. అనంతరం ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకూ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ వైద్యుల సంఘం రిమ్స్ బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ ఎం. వెంకయ్య మాట్లాడుతూ అనేక సార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
టైమ్‌బౌండ్ ఉద్యోగోన్నతులతో పాటు సంబంధిత పేస్కేళ్లను వర్తింపచేయాలని కోరారు. వేతన లోపాలను సవరించాలని డిమాండ్ చేశారు. రిమ్స్‌కు సెమీ అటానమస్ రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోనే రిమ్స్‌ను నిర్వహించాలని కోరారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ పద్ధతి కొనసాగించాలని.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వెంటనే సంబంధిత ఉత్తర్వులను జారీ చేయాలని కోరారు. బయోమెట్రిక్ హాజరులో ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలన్నారు.
ఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల విభజనను పూర్తి చేయాలని.. అక్కడి వైద్యులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం అమలు చేయాలని కోరారు.ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల్లో పని చేసే వైద్యులకు క్షేత్ర స్థాయిలో పర్యటనలకు రవాణా సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవలని కోరారు. పదోన్నతుల్లో సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోవాలన్నారు. జిల్లా సంఘ కార్యదర్శి డాక్టర్ ఆర్. వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.