‘పుంత’పై చింత
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో పుంత రోడ్ల అభివృద్ధికి ఇప్ప ట్లో మోక్షం కలిగే అవకాశాలు కనిపించడం లేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్ సర్కార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏఎంసీ ఆదాయంలో 20 శాతం నిధులను పుంత రోడ్ల అభివృద్ధికి కేటాయిస్తూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అప్పటికి కొద్ది నెలలు క్రితమే వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న లింకురోడ్ల అభివృద్ధిని పట్టించుకోకపోతే ఉత్సవ విగ్రహాల్లా మారిపోతామనే ఆందోళనతో పాలకవర్గాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 40 శాతం నిధులను విడుదల చేయాలని కోరాయి. అయితే 20 శాతం నిధుల విడుదలకు అవకాశం కల్పిస్తూ మార్కెటింగ్ శాఖ జీవో జారీ చేసింది. దీంతో జిల్లాలోని 18 వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో రూ.20 కోట్లతో పుంత రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కలెక్టర్ పరిపాలనా ఆమోదం ఇచ్చే దశలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో టెండర్లు ప్రక్రియ నిలిచిపోయింది.ఏ ఒక్క పనికి ఆమోదముద్ర పడలేదు. దీంతో పనులు ప్రారంభించడానికి అవకాశం లభించలేదు. కొలువుతీరనున్న కొత్త సర్కారు ఆ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపుతుందా? లేదా రద్దు చేస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అభివృద్ధి అనుమానమే..!
టీడీపీ సర్కార్ ఈ వారంలో కొలువుతీరనుండటంతో జిల్లాలోని 18 ఏఎంసీ పాలకవర్గాలు రాజీనామాలు ప్రకటించాల్సి ఉంది. వీటికి కొత్త పాలకవర్గాలు ఏర్పాటు కావాల్సి ఉంది. ఇవి మూడేళ్లపాటు పదవిలో కొనసాగే అవకాశం ఉంది. పాలకవర్గాల చొరవ తీసుకుంటే పుంత రోడ్ల ప్రతిపాదనలకు మోక్షం కలగనుంది. టీడీపీ హయాంలోనే గతంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, మార్కెటింగ్ శాఖల పర్యవేక్షణలో పుంతరోడ్ల పనులు జరిగాయి. అయితే ఇవి లోపభూయిష్టంగా ఉండటంతో దివంగత పుంత రోడ్ల నిర్మాణాలపై నిషేధం విధించారు. దాదాపుగా పదేళ్ల తర్వాత కాంగ్రెస్ సర్కార్ ఈ పనులను చేపట్టడానికి ముందుకు వచ్చినా అమలులో నిర్మాణాత్మంగా వ్యవహరించకపోవడంతో పుంత రోడ్ల నిర్మాణం అగమ్యగోచరంగా మారింది. అంతేకాకుండా రాష్ట్ర విభజన కారణంగా లోటు బడ్జెట్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిధుల కొరత ఎదుర్కోనున్న నేపథ్యంలో టీడీపీ సర్కార్ ఈ రోడ్ల అభివృద్ధికి ఎంతవరకు ప్రాధాన్యం ఇస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.