అమరావతి: రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయిన దోమలను నియంత్రించడానికి దండయాత్ర పేరుతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం వథా ప్రయాసగానే మిగిలిపోయింది. దోమలు కాదు కదా.. కనీసం గుడ్లను కూడా ప్రభుత్వం నాశనం చేయలేకపోయింది. దీంతో ఎన్నడూ లేనంతగా రాష్ట్రం జ్వరాల గుప్పిట్లో విలవిల్లాడింది. ప్రధానంగా మున్సిపాలిటీలు, ఏజెన్సీ ప్రాంతాల్లో 2016 సంవత్సరంలో ఎప్పుడూ లేనంతగా డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా జ్వరాలు జనాన్ని గుక్కతిప్పుకోకుండా చేశాయి. ఇది ఎంతగా అంటే ఒక దశలో ప్రభుత్వాస్పత్రుల్లో జ్వర బాధితులకు వారం రోజులు గడిచినా పడకలు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో వైద్యులు కూడా చేతులెత్తేశారు.
కనీసం సెలైన్ బాటిళ్లు కూడా దొరకని పరిస్థితి. విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల్లో అయితే డెంగీ జ్వరాలు ఊహించని రీతిలో నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వంపై పేద రోగులు దుమ్మెత్తి పోశారు. ఈ వ్యతిరేకతను తాళలేక ఉన్నపళంగా ‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపట్టి మూడు రోజుల కిందటే మమ అని ముగించారు. రూ. 20 కోట్ల వ్యయం చేసి చేపట్టిన ఈ దండయాత్ర వథా ప్రయాసగా మిగిలినట్టు వైద్య ఆరోగ్యశాఖలో అధికారులే చెప్పుకుంటున్నారు.
ముందస్తు చర్యలు లేకనే జ్వరాలు..
రాష్ట్రంలో జ్వరాలు ఏ సీజన్‌లో వస్తాయనే ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఉంటుంది. జూన్, జూలై మాసాల్లో జ్వరాలు విజభిస్తుంటాయి. దీనికోసం దోమల గుడ్డు (లార్వా) దశలోనే నిర్వీర్యం చేయాలి. మలాథియాన్, పైరిథ్రిమ్ పిచికారీ చేయడంతో పాటు పారిశుధ్యంపై అవగాహన కల్పించాలి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ముమ్మర నియంత్రణ చర్యలు చేపట్టాలి. అలాంటివేమీ చేపట్టకుండా సెప్టెంబర్ దాకా వేచిచూసి, అందరూ మంచాన పడ్డాక ప్రభుత్వం కళ్లు తెరిచింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గుడ్లన్నీ పగిలి దోమలుగా మారి సర్కారు మీదే దండయాత్ర చేశాయి. అన్నిటికీ మించి ఈ ఏడాది డెంగీ జ్వరాలు గత పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా నమోదయ్యాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.
- వృథా ప్రయాసగా మిగిలిన ‘దోమలపై దండయాత్ర’
- దోమలను కాదు.. వాటి గుడ్లను కూడా నిర్వీర్యం చేయలేకపోయారు
- 126 వాహనాలు, 4,300 ర్యాలీలు, 38 లక్షలకు పైగా కరపత్రాలు
- రూ. 20 కోట్ల నిధులు వథా.. ముగిసిన కార్యక్రమం
దండయాత్ర బలగం ఇదీ..
- దండయాత్రకు వాడిన వాహనాలు 126
- ఎన్ని గ్రామాల్లో దండయాత్ర 1.43 లక్షలు
- ఎన్ని గ్రామాల్లో పారిశుధ్యం చేశారు 1.43 లక్షలు
- బ్లీచింగ్ పౌడర్ చల్లిన గ్రామాలు 35,953
- స్వచ్ఛభారత్ మీటింగ్‌లు 3,610
- కార్యక్రమాలు నిర్వహించిన స్కూళ్లు 5,796
- పంచిన కరపత్రాల సంఖ్య 38.42 లక్షలు