దొనకొండ..ఒక ఆశ | Donakonda become the capital of Seemandhra? | Sakshi
Sakshi News home page

దొనకొండ..ఒక ఆశ

Published Tue, Feb 25 2014 2:34 PM | Last Updated on Wed, Oct 17 2018 3:49 PM

దొనకొండ..ఒక ఆశ - Sakshi

దొనకొండ..ఒక ఆశ

దొనకొండ.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జనం నోళ్లలో నానుతున్న ఊరి పేరు. దొనకొండను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయనున్నారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు పలకల గనులు, వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటంతో సీమాంధ్ర రాజధానిగా దొనకొండ పేరు తెరపైకొచ్చింది. రాష్ట్ర విభజన అంకం ఓ కొలిక్కి రావడంతో కొత్త రాజధాని ఏర్పాటుకు అనువైన స్థలాలు జిల్లాలోని దొనకొండ ప్రాంతంలో ఉన్నాయని రాష్ట్ర భూ పరిపాలనా విభాగం ఢిల్లీకి పంపిన నివేదికల్లో పేర్కొంది.
 
 దొనకొండ గత చరిత్ర ఘనమే..
రాష్ట్రం ఏర్పడక ముందు దొనకొండ ప్రాంతం నెల్లూరు జిల్లాలో ఉండేది. బ్రిటీష్ పాలకులు 1934లో దొనకొండకు దగ్గరలో 136.5 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయాన్ని నిర్మించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో విమానాలను ఇక్కడ నిలిపి ఇంధనాన్ని నింపుకుని సమావేశాలు నిర్వహించుకునే వారు. 1965-70 మధ్య కాలంలో విమానాలు రాకపోకలు సాగించేవి. విమానాశ్రయ స్థలం ఆక్రమణలకు గురికాకుండా నాలుగు నెలల కిందట సుమారు 43 లక్షల రూపాయల ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం ఫెన్సింగ్ ఏర్పాటు చేయించింది. ఈ స్థలం ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధీనంలో ఉంది.


ఇక రవాణా పరంగా దొనకొండ రైల్వేస్టేషన్ గుంతకల్ డివిజన్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. 1992కు పూర్వం మీటర్ గేజ్‌గా ఉన్న సమయంలో గుంటూరు నుంచి గుంతకల్ వెళ్లే రైళ్లు, గూడ్స్ బండ్లు దొనకొండలో నిలిపేవారు. డ్రైవర్లు విధులు మారే వారు. 2 వేల మంది రైల్వే ఉద్యోగులు ఇక్కడ పనిచేసే వారు. వీరి కోసం బ్రిటీష్ ప్రభుత్వం ప్రత్యేకంగా రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పింది. బ్రాడ్ గేజ్ కావడంతో ఇక్కడ పని చేస్తున్న సిబ్బందిని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. సుమారు 200 మంది ఉద్యోగులు నివసించే క్వార్టర్లను నిర్మించారు. రైల్వే క్వార్టర్లు శిథిలావస్థకు చేరడంతో అధికారులు పడేశారు. మొత్తం 140 ఎకరాల స్థలం రైల్వే శాఖ ఆధీనంలో ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం దొనకొండ ప్రాంతంలో 35 వేల ఎకరాల సాగు భూమి ఉండగా.. 25 వేల ఎకరాలు సాగర్ ఆయకట్టు పరిధిలో ఉంది. సుమారు 34 వేల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి.
 
పుష్కలంగా నీటి సౌకర్యం
గుండ్లకమ్మతో పాటు, నాగార్జున సాగర్ నీరు త్రిపురాంతకం, కురిచేడు, దర్శి, దొనకొండ, చీమకుర్తి తదితర ప్రాంతాల్లోని పొలాలకు అందుతోంది. ఇక వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 15 లక్షల మందికి తాగునీరు, 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం గుండ్లకమ్మ నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిని పరిశ్రమలకు ఉపయోగించుకునే అవకాశం ఉంది.
 
 రవాణా రంగం
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మార్కాపురం, నంద్యాల మీదుగా గుంతకల్ రైల్వే జంక్షన్‌ను, కర్నూలు మీదుగా హైదరాబాద్‌ను కలిపే రైలు మార్గం దొనకొండలో ఉంది. ప్రస్తుతం విద్యుదీకరణకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు టెండర్లు పిలిచారు. నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గం ప్రతిపాదన దశలో ఉంది. ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణకు ఈ మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. గుంటూరు నుంచి నంద్యాల వెళ్లే రాష్ట్ర రహదారి దొనకొండ సమీపంలో ఉంది. ఇటీవలే నల్గొండ జిల్లా నకిరేకల్ నుంచి సాగర్ , మాచర్ల, యర్రగొండపాలెం, మార్కాపురం, కొనకనమిట్ల, కనిగిరి, నెల్లూరు జిల్లా వెంకటగిరి మీదుగా రహదారిని మంజూరు చేశారు. జిల్లా కేంద్రం  ఒంగోలుకు దొనకొండ 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
 విద్యుత్‌కు ఇబ్బంది లేదు..
 శ్రీశైలం డ్యామ్ దొనకొండకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ పవర్ ప్రాజెక్టు నుంచి దొనకొండ ప్రాంతానికి విద్యుత్ అందించవచ్చు. విజయవాడ  ఎన్టీపీసీ విద్యుత్ లైన్లు ఒంగోలు నుంచి పొదిలి వరకు ఉన్నాయి. ఇక్కడ నుంచి లైన్ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది.  శ్రీశైలం కుడిగట్టు కాలువ నుంచి ప్రతి రోజూ కోటి 41 లక్షల 14 వేల మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. జిల్లాకు 41.60 లక్షల మెగా యూనిట్ల విద్యుత్‌ను కేటాయించారు. జిల్లా మొత్తం విద్యుత్ వినియోగం 71.60 లక్షల మెగా యూనిట్లు. శ్రీశైలం నుంచి వచ్చే విద్యుత్ సరఫరాతో పాటు మిగిలిన విద్యుత్‌ను విజయవాడ ఎన్‌టీ పీఎస్ నుంచి అందిస్తున్నారు. మార్కాపురం డివిజన్‌లో రోజుకు 20 లక్షల 60 వేల మెగా యూనిట్ల విద్యుత్‌ను, పొదిలిలో 15.60 లక్షల మెగా యూనిట్ల విద్యుత్‌ను శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఉపయోగించుకుంటున్నారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ఈ గణాంకాలకు అటుఇటుగా విద్యుత్ అందించే అవకాశం ఉంది.
 
 భౌగోళికంగా..
రాజధాని నిర్మించాలంటే సుమారు 5 లక్షల మంది నివసించే ప్రాంతం అవసరం. ఇందుకు అవసరమైన ప్రభుత్వ భూమి దొనకొండ, మార్కాపురం, పొదిలి ప్రాంతాల్లో ఉంది. భౌగోళికంగా ఈ ప్రాంతం జనజీవనానికి అనుకూలంగా ఉంటుంది. తుఫాన్లు, భూకంపాల తాకిడి చాలా తక్కువ. సునామీలు వచ్చే అవకాశమే లేదు. సుమారు 34 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. దొనకొండ మండలంలోని రుద్రసముద్రం, మల్లంపేట, పోలేపల్లి, లక్ష్మీపురం, కొచ్చర్లకోట తదితర గ్రామాల్లో అసైన్డ్ భూములు విస్తారంగా ఉన్నాయి. తాగునీటి సౌకర్యానికి ఇబ్బంది లేకుండా సాగర్ నీరు, గుండ్లకమ్మ జలాలు అందుబాటులో ఉన్నాయి. మార్కాపురం నుంచి నల్లమల అటవీ ప్రాంతం ప్రారంభమవుతుంది. దొనకొండకు 22 కిలోమీటర్ల దూరంలో డివిజన్ కేంద్రం, అంతర్జాతీయంగా పలకల ఉత్పత్తిలో పేరు గాంచిన మార్కాపురం పట్టణం ఉంది.

కంభం నుంచి పొదిలి వరకు సుమారు 1.35 లక్షల ఎకరాల అటవీ భూమి ఉంది. మేకలవారిపల్లె, కలుజువ్వలపాడు, గానుగపెంట, కొనకనమిట్ల, గొట్లగట్టు తదితర ప్రాంతాల్లో అటవీ భూములున్నాయి. ఇందులో ఎక్కువగా చిల్లచెట్లు మాత్రమే ఉన్నాయి. మార్కాపురం నుంచి దోర్నాల, పెద్దారవీడు, యర్రగొండపాలెం, పుల్లలచెరువు అటవీప్రాంతంలో సుమారు 1.11 లక్షల ఎకరాల అటవీ భూములున్నట్లు అంచనా. ప్రస్తుత మార్కాపురం ప్రాంతం గతంలో కర్నూలు జిల్లాలో ఉండేది. ఇటు రాయలసీమకు, అటు కోస్తాంధ్రకు పశ్చిమ ప్రకాశం సరిహద్దుగా ఉండటంతో రాజధానిగా దొనకొండ అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
 
 పారిశ్రామిక రంగానికి అనుకూలం
దొనకొండ ప్రాంతంలో సుమారు 34 వేల ఎకరాల అసైన్డ్ భూమి, 1.35 లక్షల ఎకరాల అటవీ భూమి కంభం-మార్కాపురం-పొదిలి మధ్య అందుబాటులో ఉంది. మార్కాపురం ప్రాంతంలో నల్లమలలోని 1.11 లక్షల ఎకరాల అటవీ భూములున్నాయి.  గట్టి నేల కావడంతో పాటు భూకంపాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మార్కాపురం మండలం రాయవరం నుంచి సుమారు 15 కిలోమీటర్ల పొడవున పలకల గనులు విస్తరించి ఉన్నాయి.

సుమారు 50 గ్రామాల ప్రజలు పలకల గనుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. 60 కిలోమీటర్ల దూరంలో చీమకుర్తి గ్రానైట్ గనులున్నాయి. మానవ వనరులకు కొదవ లేదు. మార్కాపురం, దొనకొండ, కొనకనమిట్ల, పొదిలి తదితర మండలాల్లో సుమారు రెండు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో ఏటా సుమారు 20 వేల మంది కూలీలు జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. నిర్మాణ రంగంలో ఎక్కువగా పనిచేస్తున్నారు.  
 
 కేంద్రానికి  నివేదిక
గతంలో జిల్లా కలెక్టర్‌గా, ప్రత్యేకాధికారిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి మూడు నెలల క్రితం ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటుపై కేంద్రానికి నివేదిక పంపినట్లు తెలిసింది. పారిశ్రామిక రంగం అభివృద్ధికి అవసరమైన ప్రభుత్వ భూములు విస్తారంగా ఉండటం, జీవనది గుండ్లకమ్మ ప్రవహించడం, వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉండటంతో నీటి సమస్య కూడా తలెత్తదని కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

 

ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశాలు లేకపోవడం, సీమాంధ్రలో అన్ని ప్రాంతాలను కలుపుతూ దొనకొండ మీదుగా రైల్వే లైన్, రహదారులు ఉండటంతో రాజధానికి అనువుగా ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాయలసీమలోని కడపకు సెయిల్ కర్మాగారం, విజయవాడ-గుంటూరు, తెనాలి పట్టణాలను మెట్రో నగరంగా, విశాఖపట్నం నుంచి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్  అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీమాంధ్రకు దొనకొండను రాజధానిగా చేసే అంశం ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement