- 60 ఎకరాల్లో ఈ ఖనిజం ఉన్నట్టు ప్రచారం
- బ్లాస్టింగ్ జరిపి, లీజుకోసం ప్రభుత్వానికి దరఖాస్తు?
నక్కపల్లి : మండలంలో డొంకాడ గ్రామంలో గ్రానైట్ నిక్షేపాలు బయట పడ్డాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఖనిజం లభించినట్టుగా భావిస్తున్న ప్రాంతంలో పక్కనే భూములు కలిగిన ఓ వ్యాపారి బ్లాస్టింగ్ జరిపి నిర్దారణ చేసి ఈ ఖనిజం తవ్వకానికి అనుమతులు ఇవ్వాలని దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. ఖరీదైన గ్రానైట్ కావడంతో ఈ ప్రాంతాన్ని లీజుకు తీసుకునేందుకు పాయకరావుపేట, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభించారు.
గ్రానైట్ ఉన్నట్టుగా భావిస్తున్న భూములను రైతులు ఎకరాకు రూ.30 నుంచి 60 లక్షలకు విక్రయించేందుకు సిద్ధపడడంతో దళారులు రంగంలోకి దిగి బేరసారాలు జరుపుతున్నట్టు సమాచారం. మండలంలో డొంకాడ గ్రామానికి సమీపంలో పోలవరం కాలువ దాటిన తర్వాత రిజర్వ్‌ఫారెస్టు ఉంది. సోడ్రుకొండ, దిమ్మరాయి ప్రాంతాలకు సమీపంలో సర్వేనెం 20, 27, 28 లలో సుమారు 60 ఎకరాల్లో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నట్టు పక్కనే ఉన్న రైతులు కనుగొన్నారు.
ఇక్కడే తునికి చెందిన ప్రముఖ వ్యాపారికి సుమారు 30 ఎకరాలు మామిడి తోటలు ఉన్నాయి. ఇక్కడ మామిడి మొక్కలు నాటితే సరిగా పెరగడం లేదు. చెట్లు వాడిపోతున్నాయి. పొలాల్లో రాయి ఉండటంతో సదరు వ్యాపారి బ్లాస్టింగ్ జరిపించారు. గ్రానైట్ మాదిరి ఖనిజం బయట పడింది.
ఇక్కడ గ్రానైట్ ఉందన్న విషయం రెండేళ్ల క్రితమే నిర్దారణ అయింది. గతంలో ఒకసారి ప్రస్తుతం గ్రానైట్ నిక్షేపాలు కలిగిన కొండపై బ్లాస్టింగ్ చేశారు. అక్కడ బయటపడిన రాయిని నిర్దారణ కోసం ల్యాబ్‌కు పంపగా గ్రానైట్‌గా నిర్దారణకావడంతో వారం క్రితం మళ్లీ బ్లాస్టింగ్ జరిగి పెద్దసైజు పలకను ల్యాబ్‌కు పంపించి మరో పర్యాయం గ్రానైట్‌గా నిర్ధారించుకున్నాక లీజుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. గ్రానైట్ నిక్షేపాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న భూముల్లో కొన్ని రిజర్వ్‌ఫారెస్టు పరిధిలోకి వస్తాయని తెలుస్తోంది.
జిరాయితీకి ఆనుకుని రిజర్వ్ ఫారెస్టు ఉండడంతో ఈ ప్రాంతాన్ని కూడా లీజుకు తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గ్రానైట్ ఉన్న కొండ ప్రాంతంలో జిరాయితీ ఎంత, అటవీశాఖకు చెందిన భూమి ఎంత అనేది నిర్ధారించక పోతే గ్రానైట్‌పై కన్నేసిన నాయకులు ప్రభుత్వాదాయానికి గండి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బ్లాస్టింగ్ జరిపిన చోట తెలుపు, పింక్, లేత గోధుమరంగు గ్రానైట్ రాళ్లు బయటపడటం గమనార్హం. దీంతో గుట్టుచప్పుడు కాకుండా దానిని మైనింగ్, జియాలజిస్టుల పరిశీలనకు పంపి బయట పడ్డ ఖనిజం గ్రానైట్‌గా నిర్ధారించుకుని లీజుకోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్టు గ్రామస్తులు, సమీపంలో భూములు కలిగిన వారు చెప్పుకుంటున్నారు. చీడిక కొండ ప్రాంతంలో కూడా పాయకరావుపేటకు చెందిన ఓ ప్రముఖ నాయకుడు బ్లాస్టింగ్ జరిపించినట్టు తెలిసింది. ఇక్కడ లభించిన ఖనిజం గ్రానైటా కాదా అనేది నిర్ధారణకు పంపినట్టు ప్రచారం జరుగుతోంది.