రైల్వే జోనూ రానట్టేనా?
రైల్వే జోనూ రానట్టేనా?
Published Tue, Aug 2 2016 12:12 PM | Last Updated on Thu, May 3 2018 3:20 PM
సాక్షి, విశాఖపట్నం :రాష్ట్ర ప్రజల కోటి ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ప్రత్యేక హోదా ఇదిగో వస్తుంది.. అదిగో వస్తోందంటూ ఎదురు చూసిన వారికి నిరాశే మిగిల్చింది. హోదా ఇచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పేసింది. ఈ నేపథ్యంలో విభజన చట్టంలో పేర్కొన్న రైల్వే జోన్ విశాఖలో ఏర్పాటుపైనా ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి రైల్వే జోన్ కేటాయించే అంశాన్ని చేర్చారు.
విభజన జరిగి రెండేళ్లు దాటిపోయింది. బీజేపీ, టీడీపీలు తాము అధికారంలోకి వస్తే విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చాయి. అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చేశాయి. రెండు పార్టీలూ పొత్తుపెట్టుకుని ఇక్కడ, అక్కడ పాలన సాగిస్తున్నాయి. కానీ ఎన్నికల హామీలో భాగమైన రైల్వే జోన్‌పై మాత్రం అడుగు ముందుకు వేయడం లేదు.
కేంద్ర ప్రభుత్వం జోన్‌పై మీనమేషాలు లెక్కిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మిన్నకుండిపోతోంది. ప్రతిపక్షాలు ఉద్యమాలు, ఆందోళనలు చేస్తుంటే తూతూమంత్రంగా ప్రకటనలతోనే సరిపెడుతోంది. ఈ నెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో జరిగిన కార్యకర్తల విస్తతస్థాయి సమావేశంలో కేంద్రం రాష్ట్రానికి సహకరించడం లేదని చెప్పారు. అందులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ అంశాలను కూడా ప్రస్తావించారు. ‘విశాఖకు రైల్వే జోన్ రావాలి.. కానీ కేంద్రం ఇంకా నిర్ణయం చేయలేదు’ అని స్పష్టం చేశారు. ఆయన ప్రకటన చేసిన వారం రోజుల్లోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో కుండబద్దలు కొట్టేశారు.
అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా లేదని సీఎంకు ముందుగా తెలిసే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదన వినిపిస్తోంది. అలాగే రైల్వే జోన్‌పై కేంద్రం నిర్ణయం తీసుకోలేదన్న సీఎం ప్రకటనపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. హోదా మాదిరిగానే విశాఖకు రైల్వే జోన్ ఏర్పాటుపై కూడా కేంద్రం ఇలాగే చేస్తుందేమోనని మేధావి వర్గాల్లో గుబులు రేగుతోంది.
ఇప్పటికే రెండేళ్లుగా కేంద్రం రైల్వే జోన్ ఏర్పాటుపై కాలయాపన చేస్తోంది. కమిటీల పేరిట కొన్నాళ్లు, పొరుగు రాష్ట్రం అభ్యంతరం చెబుతోందని ఇంకొన్నాళ్లు కుంటిసాకులు చెబుతూ, నానుస్తూ వస్తోంది.
ఉద్యమాన్ని అణచివేస్తూ..
విశాఖకు రైల్వే జోన్ కోసం ఏప్రిల్ 14న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం అర్ధంతరంగా ఆయన దీక్షను భగ్నం చేసి రైల్వే జోన్ ఉద్యమాన్ని నీరు గార్చడానికి ‘కషి’ చేసింది.
టీడీపీ ప్రభుత్వం విశాఖలో రైల్వే జోన్ కోసం అటు కేంద్రంపై ఒత్తిడి చేయకుండా, ఇటు ఉద్యమాలు, ఆందోళనలు చేస్తున్న వారిని అణచివేస్తూ పరోక్షంగా కేంద్రానికి సహకరిస్తోంది. ఇదే ఇప్పుడు మేధావి వర్గాల్లో ఆందోళన కారణమవుతోంది. ఇప్పటికైనా టీడీపీ రాజకీయాలు మాని రైల్వే జోన్ కోసం ఉద్యమించాలని, ఆందోళన చేసే వారికి మద్దతుగా నిలవాలని విశాఖ వాసులు కోరుకుంటున్నారు. లేదంటే ప్రత్యేక హోదా మాదిరిగానే జోన్‌కు కూడా కేంద్రం ఎసరు పెట్టే రోజు ఎంతో దూరంలో లేదని అంటున్నారు.
Advertisement
Advertisement