railwayzone
-
రైల్వేజోన్ రాకపోవడానికి టీడీపీనే కారణం
సాక్షి, విజయవాడ : వాస్తవాలు అంగీకరించలేని తెలుగుదేశం ప్రభుత్వం, నేతలు బీజేపీపై మూకుమ్మడి దాడి చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎస్ మాధవ్ మండిపడ్డారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం నేతలపై నిప్పులు చెరిగారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, 2014 నుంచి ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధి చూస్తే ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ ఏమిచ్చిందో తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. నిధుల విషయంలో నిగ్గు తేలాల్సిన నిజాలు చాలా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి బీజేపీనే కారణం అని, ఏపీకి 11శాతం నిధులు వచ్చాయని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా కేంద్రం ఇచ్చిన నిధులపై నోరు విప్పాలని మాధవ్ డిమాండ్ చేశారు. మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం వాస్తవాలను దాచి, అబద్ధాలు, అవాస్తవాలను ప్రచారం చేయడం తాము జీర్ణించుకోలేక పోతున్నామని మాధవ్ అన్నారు. రాష్ట్రం ఇచ్చిన రుణమాఫీ హామీని కేంద్రం ఎందుకు భరిస్తుందని ప్రశ్నించారు. అలా చేస్తే ఇతర రాష్ట్రాలు కూడా రుణమాఫీ కోసం నిధులను అడుగుతాయిని అన్నారు. రాజధాని డీపీఆర్ లేకుండా ఎవరైనా నిధులు ఇస్తారా అని తెలుగుదేశం నేతలను ప్రశ్నించారు. అయినా రూ.2500 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. తన ప్రశ్నలకు తెలుగుదేశం ప్రభుత్వం, టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని, సెక్షన్ 93 ప్రకారం 10 ఏళ్ల గడువు ఉన్నా కేవలం మూడున్నర ఏళ్లలో రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను అమలు చేశామని అన్నారు. రైల్వేజోన్ గురించి టీడీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మాధవ్ విమర్శించారు. రాష్ట్రానికి రైల్వేజోన్ రాకపోవడానికి టీడీపీనే ముఖ్య కారణం అని ఆరోపించారు. గతంలో ఎర్రన్నాయుడు రైల్వేబోర్డు ఛైర్మెన్‌గా ఉన్నప్పుడు ఎందుకు రైల్వేజోన్ తెచ్చుకోలేక పోయారంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏమి ఇచ్చామో అనే దానిపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్దమేనని మాధవ్ అన్నారు. -
రైల్వేజోన్ ఏర్పాటు చేయాలి
ద్వారకానగర్: విశాఖ కేంద్రంగా వాల్తేరు రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఐ, సీపీఎం విశాఖనగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద సామూహిక నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.వి. సత్యనారాయణమూర్తి, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి సి.హెచ్. నర్సింగరావు మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. రెండు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు పోరాటం చేస్తున్నారన్నారు. విశాఖ డివిజన్‌ను ఒడిశాలోని భువనేశ్వర్‌లో కలపడం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని, విశాఖ మినహా మిగిలిన ప్రాంతాల్లో పారిశ్రామికాభివద్ధికి ఆటంకాలు కలుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం త్వరితగతిన సానుకూల నిర్ణయం ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు విఎస్. పద్మనాభరాజు, ఆర్కేస్సీకుమార్, జి.ఎస్. రాజేశ్వరరావు, బి.పద్మ, పి. మణి, జి.అప్పలరాజు, సీపీఐ నాయకులు ఎ.జె.స్టాలిన్, డి. మార్కండేయులు, ఎ. విమల, జె.డి .నాయుడు, ఎం. పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే జోనూ రానట్టేనా?
సాక్షి, విశాఖపట్నం :రాష్ట్ర ప్రజల కోటి ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ప్రత్యేక హోదా ఇదిగో వస్తుంది.. అదిగో వస్తోందంటూ ఎదురు చూసిన వారికి నిరాశే మిగిల్చింది. హోదా ఇచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పేసింది. ఈ నేపథ్యంలో విభజన చట్టంలో పేర్కొన్న రైల్వే జోన్ విశాఖలో ఏర్పాటుపైనా ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి రైల్వే జోన్ కేటాయించే అంశాన్ని చేర్చారు. విభజన జరిగి రెండేళ్లు దాటిపోయింది. బీజేపీ, టీడీపీలు తాము అధికారంలోకి వస్తే విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చాయి. అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చేశాయి. రెండు పార్టీలూ పొత్తుపెట్టుకుని ఇక్కడ, అక్కడ పాలన సాగిస్తున్నాయి. కానీ ఎన్నికల హామీలో భాగమైన రైల్వే జోన్‌పై మాత్రం అడుగు ముందుకు వేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం జోన్‌పై మీనమేషాలు లెక్కిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మిన్నకుండిపోతోంది. ప్రతిపక్షాలు ఉద్యమాలు, ఆందోళనలు చేస్తుంటే తూతూమంత్రంగా ప్రకటనలతోనే సరిపెడుతోంది. ఈ నెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో జరిగిన కార్యకర్తల విస్తతస్థాయి సమావేశంలో కేంద్రం రాష్ట్రానికి సహకరించడం లేదని చెప్పారు. అందులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ అంశాలను కూడా ప్రస్తావించారు. ‘విశాఖకు రైల్వే జోన్ రావాలి.. కానీ కేంద్రం ఇంకా నిర్ణయం చేయలేదు’ అని స్పష్టం చేశారు. ఆయన ప్రకటన చేసిన వారం రోజుల్లోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో కుండబద్దలు కొట్టేశారు. అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా లేదని సీఎంకు ముందుగా తెలిసే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదన వినిపిస్తోంది. అలాగే రైల్వే జోన్‌పై కేంద్రం నిర్ణయం తీసుకోలేదన్న సీఎం ప్రకటనపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. హోదా మాదిరిగానే విశాఖకు రైల్వే జోన్ ఏర్పాటుపై కూడా కేంద్రం ఇలాగే చేస్తుందేమోనని మేధావి వర్గాల్లో గుబులు రేగుతోంది. ఇప్పటికే రెండేళ్లుగా కేంద్రం రైల్వే జోన్ ఏర్పాటుపై కాలయాపన చేస్తోంది. కమిటీల పేరిట కొన్నాళ్లు, పొరుగు రాష్ట్రం అభ్యంతరం చెబుతోందని ఇంకొన్నాళ్లు కుంటిసాకులు చెబుతూ, నానుస్తూ వస్తోంది. ఉద్యమాన్ని అణచివేస్తూ.. విశాఖకు రైల్వే జోన్ కోసం ఏప్రిల్ 14న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం అర్ధంతరంగా ఆయన దీక్షను భగ్నం చేసి రైల్వే జోన్ ఉద్యమాన్ని నీరు గార్చడానికి ‘కషి’ చేసింది. టీడీపీ ప్రభుత్వం విశాఖలో రైల్వే జోన్ కోసం అటు కేంద్రంపై ఒత్తిడి చేయకుండా, ఇటు ఉద్యమాలు, ఆందోళనలు చేస్తున్న వారిని అణచివేస్తూ పరోక్షంగా కేంద్రానికి సహకరిస్తోంది. ఇదే ఇప్పుడు మేధావి వర్గాల్లో ఆందోళన కారణమవుతోంది. ఇప్పటికైనా టీడీపీ రాజకీయాలు మాని రైల్వే జోన్ కోసం ఉద్యమించాలని, ఆందోళన చేసే వారికి మద్దతుగా నిలవాలని విశాఖ వాసులు కోరుకుంటున్నారు. లేదంటే ప్రత్యేక హోదా మాదిరిగానే జోన్‌కు కూడా కేంద్రం ఎసరు పెట్టే రోజు ఎంతో దూరంలో లేదని అంటున్నారు. -
'రైల్వే జోన్ వచ్చేవరకూ విశ్రమించేది లేదు'
విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ సాధించే వరకూ నిద్రపోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాధ్ అన్నారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగిపోయేది కాదన్నారు. ఈ నెల 26వ తేదీన ప్రకటించే రైల్వే బడ్జెట్లో జోన్ ప్రస్తావన లేకపోతే తమ ప్రతాపం చూపుతామని హెచ్చరించారు. రైల్వే జోన్ ఉద్యమం మరింత తీవ్రతరం చేసి ప్రభుత్వాలను గడగడలాడిస్తామని చెప్పారు. దొండపర్తి డీఆర్ఎం కార్యాలయం వద్ద విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఆర్పీఎఫ్, రిజర్వ్ పోలీస్, నగర పోలీస్‌లు పెద్ద ఎత్తున మొహరించారు. అయినా సరే పెద్ద సంఖ్యలో ప్రజలు ధర్నాలో హాజరయ్యారు. వీరినుద్దేశించి అమర్నాధ్ మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక ఆదాయాన్నిచ్చే డివిజన్లలో వాల్తేరు రైల్వే డివిజన్ నాలుగో స్థానంలో వుందన్నారు. ఏటా రూ. 6500 కోట్ల ఆదాయాన్నిచ్చే వాల్తేరుకు ఏటా ఎంత కేటాయింపులు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఒఢిశా కనుసన్నల్లోని రైల్వే అధికారులు తూర్పు కోస్తా రైల్వే నుంచి ఎలాంటి సాయం రాకుండా వాల్తేరును అణగతొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2003లో తూర్పు కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు అయినప్పటి నుంచీ ఉత్తరాంధ్రలో ఒక్క కొత్త రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పారు. నిత్యం ఆదాయాన్నిచ్చే కొత్తవలస-కిరండూల్(కెకె) రైల్వే మార్గాన్ని కనీసం డబుల్ లైన్ చేయలేకపోయారన్నారు. కొత్త రైల్వే మార్గం లేకపోగా, రద్దీ రైళ్లకు బోగీలను సైతం పెంచుకునే అవకాశం లేదన్నారు. ఉత్తరాంధ్ర ఎంపీల చేతగానితనం కారణంగానే వాల్తేరు రైల్వేకి ఈ దుస్థితి పట్టిందని చెప్పారు. ఇప్పటికైనా ఉత్తరాంధ్రలోని అయిదుగురు ఎంపీలు రాజీనామా చే సి జోన్ కోసం ఆందోళన బాట పడితే వారి వెంట మొత్తం ప్రజలంతా ఉంటారని హామీనిచ్చారు. అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ రైల్వే మార్గాన్ని వేయడానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. ఈ రాష్ట్రాన్ని విడదీయడానికి బీజేపీ, టీడీపీలు కాంగ్రెస్‌తో కలిసి చేసిన నాటకం నుంచి బయటపడేందుకు సాకులు వెతుక్కుంటున్నారన్నారు. ప్రజల ప్రయోజనాలు పట్టించుకునే స్థితిలో టీడీపీ, బీజేపీలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తైనాల విజయకుమార్, మళ్ల విజయప్రసాద్, కరణం ధర్మశ్రీ, తిప్పల గురుమూర్తి రెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, కంపా హానోకు, కొయ్యా ప్రసాదరెడ్డి, తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, పసుపులేటి ఉషాకిరణ్, ప్రగఢ నాగేశ్వరరావు, జాన్ వెస్లీ, అదీప్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.