'రైల్వే జోన్ వచ్చేవరకూ విశ్రమించేది లేదు' | we cann't stop agitation until railway zone establishes, says amarnath | Sakshi
Sakshi News home page

'రైల్వే జోన్ వచ్చేవరకూ విశ్రమించేది లేదు'

Published Tue, Feb 24 2015 7:24 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

'రైల్వే జోన్ వచ్చేవరకూ విశ్రమించేది లేదు' - Sakshi

'రైల్వే జోన్ వచ్చేవరకూ విశ్రమించేది లేదు'

విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ సాధించే వరకూ నిద్రపోమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాధ్ అన్నారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగిపోయేది కాదన్నారు. ఈ నెల 26వ తేదీన ప్రకటించే రైల్వే బడ్జెట్‌లో జోన్ ప్రస్తావన లేకపోతే తమ ప్రతాపం చూపుతామని హెచ్చరించారు. రైల్వే జోన్ ఉద్యమం మరింత తీవ్రతరం చేసి ప్రభుత్వాలను గడగడలాడిస్తామని చెప్పారు. దొండపర్తి డీఆర్‌ఎం కార్యాలయం వద్ద విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ పెద్ద ఎత్తున వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఆర్పీఎఫ్, రిజర్వ్ పోలీస్, నగర పోలీస్‌లు పెద్ద ఎత్తున మొహరించారు.

అయినా సరే పెద్ద సంఖ్యలో ప్రజలు ధర్నాలో హాజరయ్యారు. వీరినుద్దేశించి అమర్‌నాధ్ మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక ఆదాయాన్నిచ్చే డివిజన్‌లలో వాల్తేరు రైల్వే డివిజన్ నాలుగో స్థానంలో వుందన్నారు. ఏటా రూ. 6500 కోట్ల ఆదాయాన్నిచ్చే వాల్తేరుకు ఏటా ఎంత కేటాయింపులు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఒఢిశా కనుసన్నల్లోని రైల్వే అధికారులు తూర్పు కోస్తా రైల్వే నుంచి ఎలాంటి సాయం రాకుండా వాల్తేరును అణగతొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2003లో తూర్పు కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు అయినప్పటి నుంచీ ఉత్తరాంధ్రలో ఒక్క కొత్త రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పారు. నిత్యం ఆదాయాన్నిచ్చే కొత్తవలస-కిరండూల్(కెకె) రైల్వే మార్గాన్ని కనీసం డబుల్ లైన్ చేయలేకపోయారన్నారు. కొత్త రైల్వే మార్గం లేకపోగా, రద్దీ రైళ్లకు బోగీలను సైతం పెంచుకునే అవకాశం లేదన్నారు. ఉత్తరాంధ్ర ఎంపీల చేతగానితనం కారణంగానే వాల్తేరు రైల్వేకి ఈ దుస్థితి పట్టిందని చెప్పారు. ఇప్పటికైనా ఉత్తరాంధ్రలోని అయిదుగురు ఎంపీలు రాజీనామా చే సి జోన్ కోసం ఆందోళన బాట పడితే వారి వెంట మొత్తం ప్రజలంతా ఉంటారని హామీనిచ్చారు. అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ రైల్వే మార్గాన్ని వేయడానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు.

ఈ రాష్ట్రాన్ని విడదీయడానికి బీజేపీ, టీడీపీలు కాంగ్రెస్‌తో కలిసి చేసిన నాటకం నుంచి బయటపడేందుకు సాకులు వెతుక్కుంటున్నారన్నారు. ప్రజల ప్రయోజనాలు పట్టించుకునే స్థితిలో టీడీపీ, బీజేపీలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తైనాల విజయకుమార్, మళ్ల విజయప్రసాద్, కరణం ధర్మశ్రీ, తిప్పల గురుమూర్తి రెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, కంపా హానోకు, కొయ్యా ప్రసాదరెడ్డి, తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, పసుపులేటి ఉషాకిరణ్, ప్రగఢ నాగేశ్వరరావు, జాన్ వెస్లీ, అదీప్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement