సాక్షి, విజయవాడ : వాస్తవాలు అంగీకరించలేని తెలుగుదేశం ప్రభుత్వం, నేతలు బీజేపీపై మూకుమ్మడి దాడి చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎస్ మాధవ్ మండిపడ్డారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం నేతలపై నిప్పులు చెరిగారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, 2014 నుంచి ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధి చూస్తే ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ ఏమిచ్చిందో తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. నిధుల విషయంలో నిగ్గు తేలాల్సిన నిజాలు చాలా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి బీజేపీనే కారణం అని, ఏపీకి 11శాతం నిధులు వచ్చాయని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా కేంద్రం ఇచ్చిన నిధులపై నోరు విప్పాలని మాధవ్ డిమాండ్ చేశారు.
మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం వాస్తవాలను దాచి, అబద్ధాలు, అవాస్తవాలను ప్రచారం చేయడం తాము జీర్ణించుకోలేక పోతున్నామని మాధవ్ అన్నారు. రాష్ట్రం ఇచ్చిన రుణమాఫీ హామీని కేంద్రం ఎందుకు భరిస్తుందని ప్రశ్నించారు. అలా చేస్తే ఇతర రాష్ట్రాలు కూడా రుణమాఫీ కోసం నిధులను అడుగుతాయిని అన్నారు. రాజధాని డీపీఆర్ లేకుండా ఎవరైనా నిధులు ఇస్తారా అని తెలుగుదేశం నేతలను ప్రశ్నించారు. అయినా రూ.2500 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు. తన ప్రశ్నలకు తెలుగుదేశం ప్రభుత్వం, టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని, సెక్షన్ 93 ప్రకారం 10 ఏళ్ల గడువు ఉన్నా కేవలం మూడున్నర ఏళ్లలో రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను అమలు చేశామని అన్నారు.
రైల్వేజోన్ గురించి టీడీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మాధవ్ విమర్శించారు. రాష్ట్రానికి రైల్వేజోన్ రాకపోవడానికి టీడీపీనే ముఖ్య కారణం అని ఆరోపించారు. గతంలో ఎర్రన్నాయుడు రైల్వేబోర్డు ఛైర్మెన్‌గా ఉన్నప్పుడు ఎందుకు రైల్వేజోన్ తెచ్చుకోలేక పోయారంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏమి ఇచ్చామో అనే దానిపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్దమేనని మాధవ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment