Nara Lokesh: గుట్టుచప్పుడు కాకుండా మూడోసారి..! | AP Minister Nara Lokesh Maintain Secrecy On Foreign Tour | Sakshi
Sakshi News home page

గుట్టుచప్పుడు కాకుండా మూడోసారి..! మరోసారి టీడీపీలో హాట్‌ చర్చ

Published Fri, Aug 2 2024 9:20 AM | Last Updated on Fri, Aug 2 2024 9:53 AM

AP Minister Nara Lokesh Maintain Secrecy On Foreign Tour

విజయవాడ, సాక్షి: నారా లోకేష్‌ బాబు మరోసారి విదేశీ టూర్‌కు చెక్కేశారు. అదీ అత్యంత గోప్యంగా..! రెండ్రోజుల కిందటే ఆయన దేశం వదిలి వెళ్లారని, అందుకే కేబినెట్‌ సమావేశాన్ని సైతం చంద్రబాబు అర్దంతరంగా వాయిదా వేశారని తెలుస్తోంది. అయితే లోకేశ్‌ ఎక్కడికి వెళ్లారు? ఆంధ్ర ప్రదేశ్‌ మంత్రి పర్యటన అంత గోప్యంగా జరగాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలకు మాత్రం టీడీపీ వర్గాల నుంచి సమాధానం వినిపించడం లేదు. కాకపోతే ఆ పార్టీ కార్యకర్తలు, నేతల మధ్య చర్చలు మాత్రం చాలా జోరుగా సాగుతున్నాయి.

చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ఈ ఏడాదిలో విదేశాలకు వెళ్లడం ఇది మూడోసారి.  జనవరిలో సంక్రాంతి తర్వాత ఆయన చాలారోజులపాటు మీడియాకు కనిపించలేదు. చివరకు.. పుట్టినరోజు కూడా ఆయన హడావిడి లేకపోవడంతో ‘ఏం జరిగిందా?’ అని టీడీపీ కేడర్‌ గుసగుసలాడుకుంది. సరిగ్గా.. ఆ టైంలోనే అమెరికాలో ఆయన ఏకంగా అరెస్ట్‌ అయ్యారంటూ  కొన్ని వదంతులు వినిపించాయి.  ఆసక్తికరంగా ఈ వదంతులను అటు చినబాబు కానీ ఇటు టీడీపీ కానీ ఖండించలేదు.  ఆ తర్వాత కూడా కొంత కాలం తరువాత కానీ అంటే ఎన్నికల ప్రచార సమయంలో కానీ ఆయన తెరపైకి వచ్చారు.

ఇక రెండోసారి.. ఎన్నికలయ్యాక నారావారి ఫ్యామిలీ ఫారిన్‌ టూర్‌ పేరిట ఎటో వెళ్లింది. అటు చంద్రబాబు, ఇటు లోకేష్‌ ఇద్దరూ స్వల్ప వ్యవధి తేడాతోో విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. అయితే చంద్రబాబు ట్రీట్‌మెంట్‌ కోసం అమెరికా వెళ్లారని టీడీపీ నేతలు ప్రచారం చేసినప్పటికీ.. అక్కడి పార్టీ ప్రతినిధులు మాత్రం ఆయన రాక గురించి సమాచారం లేదనే చెప్పారు. మరోవైపు.. లోకేష్‌ ఎక్కడికి వెళ్లారనే దానిపై కూడా కచ్చితమైన సమాచారం లేకుండా పోయింది. కట్‌ చేస్తే.. 

అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనల గురించి పక్కా సమాచారం ఉంటుంది. వైఎస్సార్‌సీపీ సైతం ఆ వివరాలను ఫొటోలు, వీడియోలతో సహా వీలైతే పత్రికా ప్రకటన లేదంటే సోషల్‌ మీడియా వేదికగా ప్రకటిస్తుంది. అయినా కూడా టీడీపీ అనుకూల మీడియా ఆ పర్యటనల గురించి ‘అతి’ కథనాలు వండి వార్చేవి.  కానీ, చంద్రబాబు అండ్‌ లోకేష్‌ పర్యటనల విషయంలో మాత్రం విపరీతమైన గోప్యత ప్రదర్శిస్తూ వస్తున్నాయి. 

అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను రిగ్గింగ్‌ చేసి నెగ్గారనే ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఈ క్రమంలో మంత్రి పదవి చేపట్టిన నెలన్నరలొనే మళ్ళీ లోకేష్‌ విదేశీ పర్యటనకు వెళ్లారు. దీంతో.. ఈ రహస్య పర్యటనలను వైఎస్సార్‌సీపీ ఆయుధంగా చేసుకునే అవకాశం లేకపోలేదు. ఇందుకోసమైనా.. వ్యక్తిగతమైనప్పటికీ లోకేష్‌ విదేశీ పర్యటనల కనీస వివరాలు వెల్లడించాలని టీడీపీ కీలక నేతలు అధినేత చంద్రబాబును కోరాలని భావిస్తున్నారట. ఒకవేళ లోకేష్‌ ఫారిన్‌ టూర్‌ రాష్ట్ర అభివృద్ధి కోసమో లేదంటే ఒప్పందాలు కోసమో అయ్యి ఉంటే అది ఆయనకు మైలేజ్‌.. పార్టీకి మంచి చేస్తుంది కదా చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. కనీసం సోషల్‌ మీడియా వేదికగా అయినా లోకేష్‌ తన టూర్‌పై క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు వాళ్లు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement