
తెలుగువారిని విడగొట్టొద్దు: సబ్బం హరి
తెలుగువారిని విడగొట్టవద్దని అనకాపల్లి లోక్సభ సభ్యుడు సబ్బం హరి కోరారు. సమైక్యంగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆదివారం ఆర్కే బీచ్ లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు మద్దతు పలకడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆయనకు స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కనువిప్పు కలిగించి సమైక్య ఉద్యమంలో పాల్గొనేలా చేయాలని ఆకాంక్షించారు. కనీసం తన కుమారులనైనా ఎన్టీఆర్ కళ్లు తెరిపించి సమైక్య ఉద్యమబాట పట్టించాలన్నారు. ఇందిరా గాంధీ చిన్న రాష్ట్రాలను వ్యతిరేకిస్తే ఆమె కోడలు మన రాష్ట్రాన్ని విడదీయాలని చూస్తున్నారని విమర్శించారు. ఆఎ ఏ ఉద్దేశంతో రాష్ట్ర విభజనకు పూనుకున్నారో అది జరగదన్నారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సబ్బం హరి ఇటీవలే ప్రకటించారు. తాను ఉత్తుత్తి రాజీనామా చేయలేదని, ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ తిరిగి ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు రాదని, తన రాజీనామా ఆమోదించకుంటే.. బిల్లు వచ్చినప్పుడు వ్యతిరేకంగా ఓటేస్తానని ఆయన చెప్పారు.