
అక్రమాస్తుల్లేవ్: డీజీపీ వి.దినేష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీబీఐ తన ఆస్తులపై విచారణ ప్రారంభించినట్లు వచ్చిన వార్తలో వాస్తవం లేదని డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వి.దినేష్‌రెడ్డి స్పష్టంచేశారు. తనకు అక్రమాస్తులు లేనేలేవని ఆయన గురువారం పోలీసు ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. నెల్లూరులో తన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు మాత్రమే ఉన్నాయని, తాను మాత్రం ఎలాంటి ఆస్తులనూ కొనుగోలు చేయలేదని చెప్పారు. తనను డీజీపీ కాకుండా అడ్డుకునేందుకు ఐపీఎస్ అధికారి ఉమేష్‌కుమార్ కేంద్ర హోంశాఖకు 2011 జూన్‌లో నిరాధారమైన ఫిర్యాదుచేశారని దినేశ్‌రెడ్డి ఆరోపించారు.
రాజధాని శివార్లలో 542 సేల్‌డీడ్‌లను ఆధారాలుగా చూపుతూ తనకు 1,500 ఎకరాలు ఉన్నాయని పార్లమెంట్ సభ్యుడు ఎం.ఎ.ఖాన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉమేష్‌కుమార్ ఫిర్యాదుచేశారని తెలిపారు. ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు 542 సేల్‌డీడ్‌లలో తన పేరుతో ఒక్క ఆస్తి కూడా లేదని దినేష్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆ 542 సేల్‌డీడ్‌లకు సంబంధించి మాత్రమే విచారణ జరపాల్సిందిగా సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించిందన్నారు. మామిడిపల్లిలో తన భార్య 7.5 ఎకరాలు కొనుగోలు చేశారని, తన పేరుతో ఒక్క సెంటు భూమి కూడా అక్కడ కొనుగోలు చేయలేదని తెలిపారు. ఫోర్జరీ సంతకాలతో ఆ ఫిర్యాదులను ఉమేష్‌కుమార్ పంపినట్లుగా తర్వాత దర్యాప్తులో తేలింద ని తెలిపారు. ఫోర్జరీ సంతకం కేసును కొట్టివేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఉమేష్‌కుమార్ ఆశ్రయించగా.. కచ్చితంగా ఆ కేసును ఎదుర్కొనాల్సిందేనని న్యాయస్థానం స్పష్టంచేసిందని వివరించారు. అదే సమయంలో ఆ ఫిర్యాదులో పేర్కొన్న 542 సేల్‌డీడ్‌లపై కూడా విచారణ జరపాలని మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశించిందని దినేష్‌రెడ్డి చెప్పారు. రాజధాని శివార్లలో ఒక రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోవారం రోజుల పాటు జరిగిన సేల్‌డీడ్ వివరాలన్నీ ఉమేష్‌కుమార్ ఫిర్యాదులో చేర్చారని చెప్పారు. సీబీఐ విచారణ తాను డీజీపీగా కొనసాగడానికి ఇబ్బంది కాబోదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.