అత్తింటివారే చంపారని
బంధువుల ఆరోపణ
ఆత్మహత్యకు పాల్పడిందంటున్న
భర్త, అత్తమామలు
అండలూరు (వీరవాసరం) :
వరకట్న వేధింపులను తాళలేక ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వీరవాసరం మండలం అండలూరులో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై పి.శ్యామ్‌సుందర్ తెలిపిన వివరాల ప్రకారం.. అండలూరుకు చెందిన మల్లుల సుధారాణి (19) వరకట్న వేధింపులను తట్టుకోలేక ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అత్తిలి మండలం బొంతువారిపాలెంకు చెందిన పెచ్చెట్టి శేఖరశ్రీను, దానేశ్వరి దంపతుల కుమార్తె సుధారాణిని అండలూరు గ్రామానికి చెందిన డ్రైవర్ మల్లుల ప్రసాద్‌కు ఇచ్చి ఏడాదిన్నర క్రితం వివాహం చేశారు.
సుధారాణి తల్లిదండ్రులు ప్రస్తుతం గల్ఫ్‌లో ఉంటున్నారు. అక్కడ వారు సంపాదిస్తున్న మొత్తంలో కొంత సొమ్మును కుమార్తె సుధారాణి, అల్లుడు ప్రసాద్‌కు పంపిస్తుండేవారు. అయితే, రెండు నెలల నుంచి వారికి సొమ్ము పంపించడం మానేసి కుమార్తె వివాహం నిమిత్తం చేసిన బకాయిలు తీరుస్తుండటంతో సుధారాణిని భర్త, అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు. వేధింపులను తట్టుకోలేక సుధారాణి మంగళవారం ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఏడు నెలల క్రితమే పాపకు జన్మనిచ్చింది.
అత్తింటివారే చంపేశారు
సుధారాణిని ఆమె భర్త, అత్తమామలు కొట్టి చంపేశారని ఆమె తాతయ్య గుడాల కృష్ణారావు ఆరోపించారు. ఆమెను సోమవారం నాడు ఆమెను తమ ఇంటినుంచి అత్తింటికి పంపించామని ఆయన చెప్పారు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే సుధారాణి తమకు ఫోన్ చేసిందని, భర్త, అత్తమామలు వేధిస్తున్నట్టు చెప్పిందని తెలిపారు. మంగళవారం ఉదయం మరోసారి ఫోన్‌చేసి వేధింపులు తట్టుకోలేకపోతున్నానని కన్నీరు పెట్టుకుందన్నారు.
దీంతో ఆమెను తమ ఇంటికి తీసుకొచ్చేందుకు అండలూరు వెళ్లగా, అప్పటికే చంపేశారని కృష్ణారావు కన్నీటి పర్యంతమవుతూ వివరించారు. ఇదిలావుండగా, సుధారాణి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని భర్త ప్రసాద్, అత్తమామలు తెలిపారు. మృతదేహాన్ని డీఎస్పీ పి.సౌమ్యలత పరిశీలించారు. వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని ఎస్సై శ్యామ్‌సుందర్ చెప్పారు.
వరకట్న వేధింపులకు గృహిణి బలి
Published Wed, May 13 2015 2:31 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM
Advertisement
Advertisement