బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్
నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య
మిడుతూరు: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. ఆదివారం మండలపరిధిలోని వీపనగండ్ల గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. విగ్రహప్రదాత అయిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచ మేధావుల్లో బాబాసాహెబ్ ఒకరన్నారు. ఆయన కల్పించిన రిజర్వేషన్‌తో తాను ఐఆర్‌ఎస్ స్థాయికి ఎదిగానని చెప్పారు. జిల్లాలో 100కు పైగా అంబేడ్కర్ విగ్రహాలను సొంతఖర్చుతో నెలకొల్పి ఆయన గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేస్తానన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యుడు పర్వత యుగంధర్‌రెడ్డి, అంబేడ్కర్ యూత్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వాడాల త్యారాజు మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి, అసిస్టెంట్ ఫ్రొఫెసర్ నాగరాజు, పారిశ్రామిక వేత్త చంద్రమౌళి, దళిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాధవరం బాల సుందరం, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు జయరాముడు, మేకల దేవదాసు, జిల్లా అధ్యక్షుడు నాగముని, తాలుకా అధ్యక్షుడు అచ్చెన్న, టీడీపీ నాయకుడు విక్టర్, వీపనగండ్ల ఎంపీటీసీ తిమ్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖరయ్య, సంఘపెద్దలు పాల్గొన్నారు.